మహిళల ప్రపంచకప్.. స్పిన్ తో తిప్పేసిన తెలుగమ్మాయి శ్రీచరణి
సరిగ్గా మూడు నెలల కిందట ఇంగ్లండ్ లో ఆ దేశపు జట్టుతో టీమ్ ఇండియా పురుషుల ఐదో టెస్టు..! హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ను భారత జట్టు 6 పరుగుల తేడాతో గెలుచుకుంది.
By: Tupaki Entertainment Desk | 3 Nov 2025 9:21 AM ISTసరిగ్గా మూడు నెలల కిందట ఇంగ్లండ్ లో ఆ దేశపు జట్టుతో టీమ్ ఇండియా పురుషుల ఐదో టెస్టు..! హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ను భారత జట్టు 6 పరుగుల తేడాతో గెలుచుకుంది. స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అనూహ్య రిటైర్మెంట్ తో, మేటి పేసర్ బుమ్రా పూర్తిగా అందుబాటులో లేని స్థితిలో కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిన టీమ్ ఇండియా చివరకు 2-2తో సిరీస్ ను డ్రా చేసింది. ఇక చివరి టెస్టులో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అసలు సిసలు పోరాట యోధుడిలా కనిపించాడు. 4/86, 5/104 ఇదీ అతడి ప్రదర్శన. ఈ సిరీస్ మొత్తం ఆడిన అతడు 183.3 ఓవర్లు (1,113 బంతులు) బౌలింగ్ చేశాడు. 23 వికెట్లు తీశాడు. సిరీస్ లో టాప్ ఇవే.
-సెప్టెంబరు 28.. అంటే దాదాపు నెల కిందట ఆసియాకప్ ఫైనల్.. ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టు. 147 పరుగుల టార్గెట్. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (5), శుబ్ మన్ గిల్ (12)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) త్వరగా ఔట్ అయిపోయారు. కానీ, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (69 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. అత్యంత ఒత్తిడిని భరించి మరీ టైటిల్ అందించాడు.
-తాజాగా ఆదివారం.. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. వారి టార్గెట్ 299. ఆ జట్టు ఓపెనర్లు కెప్టెన్ లారా ఓల్వార్ట్ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, సిక్స్), తజ్మిన్ బ్రిట్స్ (24)లు 9.3 ఓవర్లలో 51 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. బ్రిట్స్ అనూహ్యంగా రనౌట్ అయింది. ఇలాంటి సమయంలో ప్రత్యర్థిపైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. వన్ డౌన్ బ్యాటర్ అన్నెకె బాష్ (0)ను వికెట్ల ముందు దొరకబట్టి ఎల్బీ చేసింది విశాఖపట్నం అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగింది.
మలుపు తిప్పింది మనమ్మాయే..
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ను మలుపుతిప్పింది తెలుగుమ్మాయి శ్రీచరణినే అని చెప్పాలి. పిచ్ తీరును చూస్తే...
బ్రిట్స్ రనౌట్ మినహా భారత బౌలర్లకు వికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో బంతి అందుకున్న శ్రీచరణి తన స్లో స్పిన్ తో మాయ చేసింది. ఫామ్ లో లేని బాష్ కు సరైన బంతి వేసింది. ఇంతటితో తన పని ముగించలేదు. పొదుపైన బౌలింగ్ తో సఫారీలను కట్టడి చేసింది. మొత్తం తన కోటాలో 9 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చింది. మధ్యలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు కొన్ని షాట్లు కొట్టడంతో పరుగులు వెళ్లాయి కానీ.. లేదంటే చరణి ఇంకా తక్కువే ఇచ్చేది.
కష్టాల్లో బంతి అందుకుని..
ఫైనల్లో మాత్రమే కాదు.. ప్రపంచ కప్ లో జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కెప్టెన్ హర్మన్ బంతిని శ్రీచరణికే ఇచ్చింది. మొత్తం 9 మ్యాచ్ లూ ఆడిన ఈమె పాకిస్థాన్ పై మినహా అన్నిసార్లు వికెట్ పడగొట్టింది. టోర్నీలో 14 వికెట్లు సాధించింది. కఠిన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాపై లీగ్ దశలో (3/41), సెమీస్ లో (2/49) చక్కగా రాణించింది. ఇకమీదట టీమ్ ఇండియాలో ఈ ఎడమచేతివాటం ఆర్థొడాక్స్ స్పిన్నర్ కు సుస్థిర స్థానం ఖాయం.
