Begin typing your search above and press return to search.

లండన్ కు తల్లిదండ్రులు.. లార్డ్స్‌లోనే రోహిత్ శర్మకు వీడ్కోలా? ఏం జరుగుతోంది?

సిడ్నీలో ఆడిన 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ 11 వన్డేల్లో 387 పరుగులు మాత్రమే చేశాడు.

By:  A.N.Kumar   |   17 July 2026 4:00 PM IST
లండన్ కు తల్లిదండ్రులు.. లార్డ్స్‌లోనే రోహిత్ శర్మకు వీడ్కోలా?  ఏం జరుగుతోంది?
X

టీమిండియా స్టార్ ఓపెనర్, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకనున్నాడనే ప్రచారం క్రికెట్ ప్రపంచంలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జూలై 19 చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న మూడో వన్డే మ్యాచ్ అతని కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి గానీ, రోహిత్ శర్మ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

లండన్ చేరిన తల్లిదండ్రులు.. ఊహాగానాలకు బలం

ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా రోహిత్ శర్మ తల్లిదండ్రులు లార్డ్స్ వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లండన్ చేరుకున్నట్లు వార్తలు రావడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా కీలకమైన లేదా చివరి మ్యాచ్‌లకే కుటుంబ సభ్యులు హాజరవుతుండటంతో ఇదే రోహిత్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

యువతరం వైపు సెలెక్టర్ల మొగ్గు?

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే రోహిత్‌తో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యశస్వి జైశ్వాల్‌ను పూర్తి స్థాయి వన్డే ఓపెనర్‌గా తీర్చిదిద్దే యోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

2027 ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మ వయస్సు 40 ఏళ్లకు పైగా ఉండనుండటంతో ఫిట్‌నెస్, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ బలవంతపు వీడ్కోలు నిర్ణయంపై రోహిత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని, తన అభిప్రాయాన్ని బీసీసీఐ పెద్దలకు స్పష్టంగా తెలియజేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఫామ్ లేమి కూడా ఒక కారణమేనా?

ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా సెలెక్టర్ల ఆలోచనల్లో భాగమైనట్లు తెలుస్తోంది.

సిడ్నీలో ఆడిన 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ 11 వన్డేల్లో 387 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కాలంలో మూడు అర్ధసెంచరీలు నమోదు చేసినప్పటికీ అతని పేలవమైన స్ట్రైక్‌రేట్, ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ల కొరతపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కలిపి 68 బంతులు ఎదుర్కొని కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

వన్డేల్లో రోహిత్ శర్మ తిరుగులేని రికార్డులు

భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకరిగా రోహిత్ శర్మ నిలిచాడు. అతని సుదీర్ఘ కెరీర్ గణాంకాలు ఇలా ఉన్నాయి. మొత్తం 287 వన్డేల్లో 11,757 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 48.58. సెంచరీలు 33, హాఫ్ సెంచరీలు 62.. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలో ఏకైక బ్యాటర్.

దాదాపు 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన హిట్‌మ్యాన్ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ శర్మ లేదా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.