హార్దిక్ పాండ్యా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడా?
ఒకప్పుడు ఐపీఎల్ గ్రౌండ్‌లోకి హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో అడుగుపెడితే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించడం.. కీలక సమయంలో ఓ వికెట్ తీసి వికెట్ వెనక సీన్ చూపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.
By: A.N.Kumar | 12 Aug 2026 11:53 PM ISTఒకప్పుడు ఐపీఎల్ గ్రౌండ్‌లోకి హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో అడుగుపెడితే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించడం.. కీలక సమయంలో ఓ వికెట్ తీసి వికెట్ వెనక సీన్ చూపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ముంబై ఇండియన్స్ అకాడమీ నుంచి తయారైన ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు ఒక్కసారిగా ‘సారథ్య తీపి’ రుచి మరిగింది. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి తొలి ఏడాదిలోనే ట్రోఫీ కొట్టేసరికి హార్దిక్ మహాశయుడు తన్ను తాను ఒక క్రికెట్ మేధావిగా.. భారత జట్టు తదుపరి ఏకఛత్రాధిపతిగా ఊహించుకోవడం ప్రారంభించారు. ఐతే కథ అక్కడితో ఆగితే బాగుండేది.. కానీ అసలు సినిమా ముందుందిగా..
రోహిత్ శర్మ లాంటి దిగ్గజం చేతిలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని ‘నాకు అప్పగిస్తేనే వస్తా’ అని షరతు పెట్టి మరీ మళ్లీ పాత గూటికి చేరుకోవడం.. ఆపై అభిమానుల నుంచి విపరీతమైన బూటింగ్, విమర్శలు మూటగట్టుకోవడం మనం చూశాం. సరే కెప్టెన్సీ దక్కింది కదా అంటే.. మైదానంలో జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోయింది, పర్సనల్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినా సరే హార్దిక్ గారి కిరీటం మేనియా మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడు మళ్లీ గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లేందుకు రూమర్లు రావడం.. అక్కడ కూడా ‘నాకు కెప్టెన్సీ ఇస్తేనే వస్తా, లేదంటే లేదు’ అని భీష్మ ప్రతిజ్ఞ చేయడం చూస్తుంటే నవ్వాలో లేక జాలిపడాలో అర్థం కావడం లేదు.
పాపం గుజరాత్ మేనేజ్‌మెంట్ మాత్రం ఏం చేస్తుంది? హార్దిక్ వెళ్లిపోయాక శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేసి జట్టును ఒక పద్ధతి ప్రకారం గాడిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ "రారాజు" వచ్చి నా కిరీటం నాకు ఇచ్చేయండి అంటే గిల్ ఏమవ్వాలి.. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఏం కావాలి? అందుకే గుజరాత్ టీమ్ కూడా "బాబోయ్.. మీ ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఓకే కానీ మీ షరతులు మాతో కావు" అని నైస్‌గా దండం పెట్టేసినట్లు తెలుస్తోంది.
అసలు హార్దిక్‌కు ఎవరో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్రాంచైజీలు నిన్ను ఒక నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా చూసి కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి తప్ప నువ్వు అడగ్గానే రాజును చేయడానికి కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి టీమ్స్ అతడి బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాల కోసం ఆలోచించవచ్చు. కానీ అక్కడికి వెళ్లినా ‘నన్నే రాజును చేయండి’ అని పట్టుబడితే చివరికి ఏ జట్టులోనూ చోటు లేక ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ప్రస్తుతం హార్దిక్‌కు అత్యవసరంగా కావాల్సింది బ్యాట్‌తో పరుగులు.. బంతితో వికెట్లు.. అంతే కానీ తలపై కెప్టెన్సీ క్యాప్ కాదు. హోదా కోసం అర్రులు చాచడం ఆపి.. ముందు మైదానంలో సరిగ్గా ఆడితేనే ఈ "స్టార్" వెలుగులు మిగులుతాయి.. లేదంటే ఈ స్వీయ వినాశన పరంపర ఇలాగే కొనసాగి కెరీర్ ముగిసిపోవడం ఖాయం.
