Begin typing your search above and press return to search.

మళ్లీ అలా మాట్లాడితే.. పాక్ క్రికెటర్ కు భజ్జీ సీరియస్ వార్నింగ్

పాక్ క్రికెటర్లు కనిపిస్తే చాలు.. వారి వెంట తిరుగుతూ ఉంటాడంటూ భజ్జీని ఉద్దేశించి నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టు అయ్యాడు హర్బజన్.

By:  Garuda Media   |   14 Feb 2026 9:14 AM IST
మళ్లీ అలా మాట్లాడితే.. పాక్ క్రికెటర్ కు భజ్జీ సీరియస్ వార్నింగ్
X

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్బన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా గౌరవ మర్యాదల్ని పాటించే అతను.. హద్దులు మీరి మాట్లాడే వారిని మాత్రం ఏ మాత్రం ఉపేక్షించడు. ఒక మాట అంటే పది మాటలు అనటమే కాదు.. సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించాడు భజ్జీ. నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన పాక్ క్రికెటర్ కు తనకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాడు. మళ్లీ నోరు పారేసుకుంటే.. నిన్ను నాశనం చేస్తానని ఘాటుగా రియాక్టు అయ్యాడు.

అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడ మొదలైందంటే.. యూఏఈ వేదికగా ఐఎల్ టీ 20 లీగ్్ లో భజ్జీ బ్రాడ్ కాస్టర్ గా వ్యవహరించాడు. పాక్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ ను హర్బజన్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ అంశంపై మరో పాక్ క్రికెటర్ (తన్వీర్ అహ్మద్) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్లు కనిపిస్తే చాలు.. వారి వెంట తిరుగుతూ ఉంటాడంటూ భజ్జీని ఉద్దేశించి నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టు అయ్యాడు హర్బజన్.

తన యూట్యూబ్ చానల్ లో మాట్లాడిన భజ్జీ.. ‘‘అతడి పేరు కూడా నాకు సరిగా తెలీదు. అతన్ని నేను ఒక్కసారి కూడా చూడలేదు. అతడు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి గుర్తింపుకోసం వివిధ ఫ్లాట్ ఫామ్ ల మీద డ్రామా చేస్తుంటాడు. నాకైతే ఆ వ్యక్తి ఎవరో తెలీదు. మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట. పాక్ తరఫున మూడు నాలుగు మ్యాచ్ లు ఆడి ఉంటాడు. తనకు తాను ఇమ్రాన్.. వసీం అక్రమ్.. వకార్ యూనస్ అన్నట్లుగా బిల్డప్ లు ఇస్తుంటాడు. ఒక బ్రాడ్ కాస్టర్ గా నా పని నేను చేశా. కానీ.. ఈ వ్యక్తికి సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్లు కనిపిస్తే చాలు.. వారి వెంట తిరుగుతూ ఉంటానట. పాక్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ నీలా నోరు పారేసుకోలేదు. వాళ్లకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. నీలాంటోళ్లు జీవితంలో ఏమీ సాధించకుండా ఒక చోట కూర్చొని దిగజారుడు చానళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటాడు’’ అంటూ సీరియస్ అయ్యాడు.

అంతేకాదు.. ఇప్పటికైనా మాట్లాడే విధానం నేర్చుకోవలన్న భజ్జీ.. ఐదు మ్యాచ్ లు ఆడిన వాడికి వంద మ్యాచ్ లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి.. తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలానే వాగితే.. నిన్ను నాశనం చేస్తా. బీకేర్ ఫుల్’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి కామ్ గా ఉన్న హర్బజన్ ను కెలికి మరీ తిట్టించుకున్న క్రికెటర్ గా తన్వీర్ అహ్మద్ నిలిచాడు. మరి.. ఇక్కడితో ఆగుతాడా? మరింత కెలికి.. మరింతగా తిట్టించుకుంటాడా? అన్నది చూడాలి.