Begin typing your search above and press return to search.

39 ఏళ్ల మెస్సీని ఐదుగురు ఆపలేకపోయారు.. మరి రోహిత్, కోహ్లీలను ఎందుకు ఆపాలి?

39 ఏళ్ల వయసులో కూడా మెస్సీ ఫుట్‌బాల్ మైదానంలో పరుగెడుతుంటే ఐదుగురు డిఫెండర్లు కలిసి కూడా ఆయనను ఆపలేకపోతున్నారు.

By:  A.N.Kumar   |   14 Aug 2026 11:44 AM IST
39 ఏళ్ల మెస్సీని ఐదుగురు ఆపలేకపోయారు.. మరి రోహిత్, కోహ్లీలను ఎందుకు ఆపాలి?
X

భారత క్రికెట్‌లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఏమిటయ్యా అంటే.. "2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ముసలితనం వచ్చేస్తుంది.. కాబట్టి వాళ్లకు టాటా బాయ్ బాయ్ చెప్పేయాలి" అని కొందరు 'బోర్డు పండితులు', సోషల్ మీడియా విశ్లేషకులు గళమెత్తుతున్నారు. యువ రక్తం ఉరకలేస్తోంది.. కాబట్టి ఈ 'వృద్ధ దంపతుల' లాంటి జోడీని పక్కన పెట్టి కుర్రాళ్లకు పీఠం వేయాలని ప్రతిపాదనలు పంపేస్తున్నారు.

అయితే ఈ సుదీర్ఘ చర్చపై మన 'భజ్జీ' హర్భజన్ సింగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "వయసు చూసి తీసేయడానికి ఇదేమైనా రిటైర్మెంట్ ఏజ్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగమా?" అని పరోక్షంగా ప్రశ్నించారు. తన వాదనకు మద్దతుగా హర్భజన్ ఏకంగా ఫుట్‌బాల్ దేవుడు లియోనెల్ మెస్సీని రంగంలోకి దించారు.

మెస్సీకి లేని నిబంధనలు.. మనోళ్లకేనా?

39 ఏళ్ల వయసులో కూడా మెస్సీ ఫుట్‌బాల్ మైదానంలో పరుగెడుతుంటే ఐదుగురు డిఫెండర్లు కలిసి కూడా ఆయనను ఆపలేకపోతున్నారు. మరి 39 ఏళ్ల వయసొస్తే క్రికెట్ బ్యాట్ పట్టుకోకూడదని ఏ రాజ్యాంగంలో రాసి ఉందో ఈ విమర్శకులకే తెలియాలి.

2027 ప్రపంచకప్ నాటికి విరాట్ కోహ్లీ వయసు దాదాపు 39 ఏళ్లకు చేరుకుంటుంది. రోహిత్ శర్మ కూడా అదే కోవలోకి వస్తారు. కానీ ప్రశ్నించాల్సింది వారి ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని కాదు.. మైదానంలో వారి ఫిట్‌నెస్‌ను, బ్యాటు నుంచి వస్తున్న పరుగుల వరదను.. యువ ఆటగాళ్లతో పోటీపడి మరీ రన్స్ తీస్తున్నప్పుడు, మైదానంలో క్యాచ్‌లను అద్భుతంగా పడుతున్నప్పుడు వయసుతో పనేంటి? వైభవ్ సూర్యవంశీ వంటి యువ కెరటాలు ఎంత దూకుడుగా ఆడుతున్నప్పటికీ ప్రపంచకప్ వంటి మహామహా ఒత్తిడి ఉండే టోర్నీల్లో 500 మ్యాచ్‌ల అనుభవం ఉన్న రోహిత్-కోహ్లీలు ఇచ్చే భరోసా వేరు.

పర్‌ఫార్మెన్స్ ఉంటేనే పీఠం.. లేదంటే విశ్రాంతి

అయితే కోహ్లీ, రోహిత్‌లకు 'లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్' ఇవ్వాలని హర్భజన్ అనడం లేదు. శరీరం సహకరించనప్పుడు, పరుగులు రానప్పుడు ఎప్పుడు తప్పుకోవాలో ఆ దిగ్గజాలకు బాగా తెలుసు. కానీ కేవలం "39 ఏళ్లు వచ్చాయి కాబట్టి ఇంట్లో కూర్చోండి" అనడం రన్నింగ్ ఫామ్‌లో ఉన్న గుర్రాన్ని రేసు నుంచి తప్పించడమే అవుతుంది.

ఏతావాతా చెప్పేదేంటంటే.. 'వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే, క్లాస్ అనేది పర్మనెంట్' మెస్సీ తరహాలోనే రోహిత్, కోహ్లీలు కూడా తమ బ్యాట్‌లతోనే విమర్శకుల నోళ్లు మూయిస్తారని ఆశిద్దాం. 2027 వరల్డ్ కప్‌లో ఈ ఇద్దరి అనుభవం భారత్‌కు ట్రోఫీ తెచ్చిపెడితే.. ఇప్పుడు వయసు గురించిన మాట్లాడే నోళ్లే జైజైలు కొడతాయనడంలో సందేహం లేదు.