వన్ డౌన్ లో అక్షర్.. ఆఖర్లో దూబే.. ఈ ఐపీఎల్ గంభీర్ ఇక మారడా?
దక్షిణాఫ్రికాతో తొలి టి20లో బ్యాటింగ్ ఆర్డర్ పరంగా బాగానే వ్యవహరించాడు గంభీర్. అందరినీ సరైన ఆర్డర్ లోనే పంపాడు.
By: Tupaki Political Desk | 13 Dec 2025 6:00 PM ISTటార్గెట్ 214... మొదటి ఓవర్లోనే కీలకమైన వైస్ కెప్టెన్ డకౌట్..! ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు? జట్టులో కీలకమైన ఆటగాడినే వన్ డౌన్ లో పంపుతారు.. లేదంటే హార్డ్ హిట్టర్ ను ముందుకు దింపుతారు. కానీ, బౌలింగ్ ఆల్ రౌండర్ ను ప్రమోట్ చేస్తారా? కానీ, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ దక్షిణాఫ్రికాతో రెండో టి20లో అదే చేశాడు. ఇక్కడ అక్షర్ పటేల్ ను తప్పుబట్టాల్సింది ఏమీలేదు. నిరుడు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అతడు ఆడిన ఇన్నింగ్సే కీలకంగా నిలిచింది. బంతితో, బ్యాట్ తో సమంగా రాణిస్తున్న అక్షర్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అయితే, మరీ భారీ స్కోరు చేజింగ్ సమయంలో వన్ డౌన్ లో పంపేంతగా అయితే కాదు. కెప్టెన్ సూర్య ఫామ్ లో లేడు అనుకుంటే ఓవైపు జితేశ్ శర్మ, మరోవైపు తిలక్ వర్మ ఇంకోవైపు శివమ్ దూబె వంటి బ్యాటర్లు ఉండగా అక్షర్ ను దింపడం అంటే గంభీర్ ఏం ఆలోచిస్తున్నాడు? అనేది చర్చనీయంగా మారింది. పైగా ఈ మ్యాచ్ లో 21 బంతులు ఆడిన అక్షర్ 21 పరుగులు చేశాడు. అనుకున్నంత వేగంగా స్కోరును కదిలించలేకపోయాడు. దీంతో గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు ఇటీవలి అన్ని సిరీస్ లలో హెడ్ కోచ్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లోనూ మరోసారి విమర్శకులకు పని కల్పించాడు.
మొదటి మ్యాచ్ లో బాగానే ఉన్నా..
దక్షిణాఫ్రికాతో తొలి టి20లో బ్యాటింగ్ ఆర్డర్ పరంగా బాగానే వ్యవహరించాడు గంభీర్. అందరినీ సరైన ఆర్డర్ లోనే పంపాడు. జట్టు కూడా భారీ స్కోరు చేసి గెలుపొందడంతో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ, రెండో టి20లో అదీ క్లిష్ట పరిస్థితుల్లో అక్షర్ తో ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇలాంటి సమయంలో జితేశ్ నో, శివమ్ దూబేనో వన్ డౌన్ లో ఆడిస్తే అసలు ప్రశ్నించేవారే లేకపోయేవారు. కానీ, అక్షర్ ను పంపి అతడు విఫలమై.. చివరకు దూబెను 8 స్థానంలో బ్యాటింగ్ చేయించడం తీవ్ర అసహనం రేకెత్తిస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో కీలకమైన మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనూ ఓడితే ఐదు మ్యాచ్ ల సిరీస్ చేజారే ప్రమాదం ఉంది.
ఎందుకీ ప్రయోగాలు.??
గంభీర్ చేస్తున్న ప్రయోగాలు ఎందుకు? అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు టి20ల్లో 8వ నంబరు వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉంటున్నారు. అలాంటప్పుడు లోయరార్డర్ బ్యాటర్ ను వన్ డౌన్ లో పంపడం ఎందుకు? ఇక వన్డేలు, టెస్టుల్లోనూ ప్రయోగాలు చేయడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. గంభీర్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్, కోచ్ తరహాలో ఇష్టారీతిన ప్రయోగాలు చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా టీమ్ ఇండియాతోనూ ఆటలాడుతున్నట్లు మండిపడుతున్నారు.
