పాక్ కంటే కిందకి... గంభీర్ రిపోర్ట్ కార్డ్ ఇదిగో!
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలోనే బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... స్వదేశంలో శ్రీలంక చేతిలో భారత్ 2-0 తేడాతో ఓడిపోయింది.
By: Raja Ch | 27 Nov 2025 9:43 AM ISTదక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా రెండో టెస్టులోనూ చిత్తయిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలవ్వడం ఒకెత్తు అయితే.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడం మరొలెక్క అని అంటున్నారు. ఇలా దక్షిణాఫ్రికా చేతిలోనూ వైట్ వాష్ కి గురైంది భారత్. అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలోనూ సొంతగడ్డపై 3-0 తో వైట్ 'వాష్' చేయించుకుంది!
అవును... టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. కివీస్ 3-0 ఇచ్చిన స్ట్రోక్ తర్వాత ఇది రెండోది. మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ భారత ప్రధాన కోచ్ గా నియమితులైన అనంతరం ఇప్పుడు భారత జట్టును మూడు ఫార్మాట్లలోనూ నిర్వహిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు టీమిండియా పెర్ఫార్మెన్స్ తో అతని రిపోర్ట్ కార్డుపై చర్చ మొదలైంది.
టీ2- మ్యాచ్ లు:
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వంటి దిగ్గజాలు అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గంభీర్ శ్రీలంకలో కోచ్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో.. అతను అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. ఈ సిరీస్ లో భారత్ మూడు మ్యాచ్ లూ గెలిచింది. ఓవరాల్ గా గంభీర్ కోచ్ గా టీమిండియా ఆడిన 22 మ్యాచ్ లలోనూ 20 మ్యాచ్ లలో విజయాలు సాధించగా రెండు మ్యాచ్ లలో మాత్రమే ఓటమిపాలైంది. అంటే.. విజయ శాతం సుమారు 90 పైనే అన్నమాట.
వన్డే మ్యాచ్ లు:
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలోనే బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... స్వదేశంలో శ్రీలంక చేతిలో భారత్ 2-0 తేడాతో ఓడిపోయింది. ఇందులో ఒక మ్యాచ్ టై అయ్యింది. అయితే.. ఆ తర్వాత గంభీర్ కోచింగ్ లో టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్ లను గెలిచింది. వాటిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా ఉంది.
మొత్తంగా చూసుకుంటే.. 14 వన్డే మ్యాచ్ లలో... 9 మ్యాచ్ లు గెలిచి, 4 మ్యాచ్ లు ఓడిపోగా, ఒక మ్యాచ్ టై అయ్యింది. అంటే.. కోచ్ గా వన్డేల్లో గంభీర్ సక్సెస్ పెర్సంటేజ్ 64.28 అన్నమాట.
టెస్టు మ్యాచ్ లు:
వన్డే, టీ20 మ్యాచ్ ల సంగతి అలా ఉంటే.. టెస్ట్ కోచ్ గా మాత్రం గంభీర్ రికార్డు నిరాశపరిచిందనే చెప్పాలి. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో భారత్ మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ ను 2-2తో డ్రాగా ముగించింది. ఆ తర్వాత వెస్టిండీస్ ను భారత్ స్వదేశంలో ఓడించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో 2-0తో మరో అవమానకరమైన ఓటమి ఎదుర్కొంది.
ఈ క్రమంలో గంభీర్ కోచింగ్ లో టీమిండియా 19 టెస్ట్ మ్యాచ్ లూ అడగా అందులో 7 విజయాలు, 10 ఓటములు ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. అంటే.. టెస్టుల్లో గంభీర్ విజయశాతం 36.84 అన్నమాట.
పాకిస్థాన్ కంటే కిందకు!:
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ కంటే వెనుకబడి, ఐదో స్థానానికి పడిపోయింది. దీంతో... డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకోవాలనే భారత్ ఆశలను మరోసారి దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు.
గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు!:
దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమిపాలైన అనంతరం గువాహటి మైదానంలో కోచ్ గౌతమ్ గంభీర్ కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. బహుమతి ప్రధానోత్సవ సమయంలో గంభీర్ మైదానంలోకి రాగా.. అతను రాజీనామా చేయాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎవరు ఎంత వారించినా వారు ఏమాత్రం తగ్గకుండా నినాదాలు చేశారు.
