భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ సరే.. ఆసియా కప్ ఎప్పుడిస్తావ్ నఖ్వీ?
సెప్టెంబరు 28.. అంటే, నాలుగు నెలలు ముగిశాయి..! దుబాయ్ లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి ఆసియా కప్ ను సగర్వంగా గెలిచింది టీమ్ఇండియా.
By: Tupaki Political Desk | 5 Feb 2026 9:41 AM ISTసెప్టెంబరు 28.. అంటే, నాలుగు నెలలు ముగిశాయి..! దుబాయ్ లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి ఆసియా కప్ ను సగర్వంగా గెలిచింది టీమ్ఇండియా. కానీ, ఇప్పటివరకు మన దేశానికి ట్రోఫీ రాలేదు. కారణం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహిసిన్ నఖ్వీ. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లతో టీమ్ ఇండియా క్రికెటర్లు షేక్ హ్యాండ్ చేయలేదు. టోర్నీలో మూడుసార్లు తలపడినా మీకు ఇదే మా శిక్ష అంటూ దాయాది జట్టును మానసికంగా దెబ్బకొట్టింది. ఇక టైటిల్ గెలిచాక.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో అతడు ఆసియా కప్ ను తనతో పాటే హోటల్ కు తీసుకెళ్లాడు. తర్వాత దానిని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. తన అనుమతి లేకుండా ఎవరికీ ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేశాడు. దీనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చాలా సీరియస్ గా తీసుకుంది. నఖ్వీ తీరును ఏసీసీ సమావేశంలో తీవ్రంగా తప్పుబట్టింది. అతడు కాస్త దిగివచ్చినట్లే కనిపించినా... కప్ ను మాత్రం భారత్ కు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నాలుగు నెలలు దాటిపోయి.. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ కూడా వచ్చింది. భారత్ తో ఈ నెల 15న శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరి.. ఆసియా కప్ ను ఎప్పుడు ఇస్తుంది? అనేది మాత్రం చెప్పడం లేదు.
ఇంకా మనకు అవసరమా?
నఖ్వీ.. కేవలం పీసీబీ చీఫ్ మాత్రమే కాదు పాక్ ప్రభుత్వంలో మంత్రి కూడా. పెహల్గాం ఉగ్రదాడి సమయంలో తమ దేశం తరఫున వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతేకాదు.. ఆసియా కప్ లో భారత్ తో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు వెకిలి చేష్టలను (పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ఆరు భారత విమానాలను కూల్చివేసినట్లు వేళ్లను చూపడం) వెనకేసుకొచ్చాడు. పాక్ క్రికెటర్లకు నియమావళి ఉల్లంఘనకు గాను జరిమానా విధిస్తే అది తానే కడతానంటూ ప్రగల్బాలు పలికాడు. అలాంటివాడి చేతుల మీదుగా ఆసియా కప్ టైటిల్ తీసుకోకుండా టీమ్ ఇండియా మంచి పనే చేసింది. క్రీడా లోకం అంతా విమర్శిస్తున్నా నఖ్వీ కూడా తన చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించలేదు. ఇలాంటి వాడి చేతులు పడిన ఆసియా కప్ ఇంకా మనకు అవసరమా? అన్నది ఆలోచించాల్సిన విషయం.
రికార్డులను చెరిపేయలేడుగా..?
ఆసియా కప్ విషయాన్ని బీసీసీఐ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పరిశీలనకు తీసుకెళ్లింది. దీంతో ఐసీసీ ఓ సీనియర్ అధికారిని నియమించింది. నవంబరులో జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ పాయింట్ చర్చకు వచ్చింది. ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కానీ, ఏమీ తేలలేదు. అయితే, నఖ్వీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ఆసియాకప్ 2025 విజేత టీమ్ ఇండియా అనే రికార్డును మాత్రం చెరిపివేయలేడు.
పాక్ కు బుద్ధి చెప్పాలిగా..?
గత ఏడాది వేసవి నుంచి జరుగుతున్న పరిణామాలు.. తాజాగా టి20 ప్రపంచకప్ లో భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అనే డిమాండ్లు అభిమానుల నుంచి వస్తున్నాయి. దీనికి సరైన రీతిలో స్పందన ఉంటుందో లేదో? చూడాలి మరి.
