Begin typing your search above and press return to search.

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ విలువ భారీగా పెరుగుదల.. ఇప్పుడు రూ.6.73 కోట్లకు చేరిన గోల్డ్ ట్రోఫీ!

ఫిఫా వరల్డ్ కప్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల గుండె చప్పుడు.

By:  A.N.Kumar   |   26 Jun 2026 11:29 AM IST
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ విలువ భారీగా పెరుగుదల.. ఇప్పుడు రూ.6.73 కోట్లకు చేరిన గోల్డ్ ట్రోఫీ!
X

ఫిఫా వరల్డ్ కప్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానుల గుండె చప్పుడు. ఈ మెగా టోర్నీలో గెలవాలనేది ప్రతి ఆటగాడి కల. అయితే ఈ కప్‌కు కేవలం క్రీడా పరంగానే కాకుండా ఆర్థికంగానూ ఇప్పుడు విపరీతమైన క్రేజ్ పెరిగింది. తాజాగా అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్స్ డేటా ప్రొవైడర్ ఎల్.ఎస్.ఈజీ అంచనాల ప్రకారం.. ఫిఫా వరల్డ్ కప్ ఒరిజినల్ ట్రోఫీ విలువ రికార్డు స్థాయికి చేరింది. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఈ గోల్డ్ ట్రోఫీ విలువ దాదాపు మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం రూ. 6.73 కోట్లకు (7.13 లక్షల అమెరికన్ డాలర్లు) చేరుకోవడం విశేషం. 2022లో ఈ ట్రోఫీ విలువ సుమారుగా 2.77 లక్షల డాలర్లు (రూ. 2.61 కోట్లు) మాత్రమే ఉండేది.

బంగారం ధరల పెరుగుదలే ప్రధాన కారణం

ఈ స్థాయిలో ట్రోఫీ విలువ పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడమే. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరడంతో, నిఖార్సయిన బంగారంతో రూపొందించిన ఫిఫా ట్రోఫీ విలువ కూడా అదే వేగంతో ఎగబాకింది.

ట్రోఫీ బరువు.. ప్రత్యేకతలు:

ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని 18 క్యారెట్ల బంగారంతో అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. ఈ ట్రోఫీ మొత్తం బరువు 6.175 కిలోగ్రాములు. ఇందులో దాదాపు 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన బేస్ భాగంలో ప్రత్యేకమైన గ్రీన్ 'మాలచైట్' రాయిని ఉపయోగించారు. ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులు ఉద్వేగంతో గ్లోబ్ భూమిని పైకెత్తి పట్టుకున్నట్లుగా ఈ ట్రోఫీని డిజైన్ చేశారు.

ఇతర క్రీడా ట్రోఫీలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకం

1974 నుండి ఈ ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని విజేతలకు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా ట్రోఫీలలో ఇది ఒకటిగా నిలిచింది. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఒలింపిక్స్, టెన్నిస్, క్రికెట్ (ఐసీసీ వరల్డ్ కప్), రగ్బీ వంటి ఇతర మెగా టోర్నీల ట్రోఫీలను పూర్తిగా లేదా భారీ మొత్తంలో బంగారంతో తయారు చేయరు. కానీ ఫిఫా ట్రోఫీకి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది.

ఫైనల్స్ గెలిచిన జట్టుకు వేడుకల సమయంలో మాత్రమే ఈ అసలు గోల్డ్ ట్రోఫీని ఇస్తారు. ఆ తర్వాత ఫిఫా దీనిని తిరిగి స్వాధీనం చేసుకుని జ్యూరిచ్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తుంది. విజేత దేశానికి కేవలం బంగారు పూత పూసిన ప్రతిరూప ట్రోఫీని మాత్రమే శాశ్వతంగా ఇస్తారు.

భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ ట్రోఫీ విలువ మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం క్రీడా గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ఫిఫా కప్.. ఇప్పుడు అపారమైన ఆర్థిక విలువకు కూడా నిదర్శనంగా మారింది.