Begin typing your search above and press return to search.

నెలకు ₹87,000 కోట్లు.. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు!

ఈసారి జరిగిన 2026 ఎడిషన్ క్రీడా పరంగా మైమరిపించడమే కాకుండా రాబడిలోనూ అపూర్వమైన రికార్డులను నెలకొల్పింది.

By:  A.N.Kumar   |   21 July 2026 3:50 PM IST
నెలకు ₹87,000 కోట్లు.. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు!
X

ఫుట్‌బాల్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. కోట్ల మంది ఆరాధించే ఒక ఆవేశం.. ఆ ఆవేశానికి, ఉద్వేగానికి పరాకాష్ట ‘ఫిఫా వరల్డ్ కప్’. ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచాన్ని ఊపేసే ఈ మెగా టోర్నీ కేవలం మైదానానికే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థలను శాసించే స్థాయి వాణిజ్య ఉత్సవంగా మారింది. తాజాగా ముగిసిన ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ క్రీడా రంగాన్నే విస్తుపోయేలా చేసింది.

ఏకంగా ₹87 వేల కోట్ల రాబడి

ఈసారి జరిగిన 2026 ఎడిషన్ క్రీడా పరంగా మైమరిపించడమే కాకుండా రాబడిలోనూ అపూర్వమైన రికార్డులను నెలకొల్పింది. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే ఫిఫా ఏకంగా 9 బిలియన్ డాలర్లు (మన భారతీయ కరెన్సీలో సుమారు ₹87,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించిందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ క్రీడా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క టోర్నమెంట్ కూడా ఒకే ఎడిషన్‌లో ఈ స్థాయి భారీ ఆదాయాన్ని చవిచూడలేదు.

ఈ చారిత్రక ఆదాయానికి ప్రధాన కారణాలు

మ్యాచ్‌ల ప్రారంభానికి నెలల ముందే లక్షలాది టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టికెట్ల ధరలు ఎంత ఎక్కువగా ఉన్నా, తమ అభిమాన జట్లను చూడటానికి అభిమానులు ఏమాత్రం వెనుకాడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్రాండ్లు ఈ టోర్నీలో భాగస్వామ్యం అయ్యేందుకు పోటీపడ్డాయి. ప్రకటనలు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా రూ. వేల కోట్లు ఫిఫా ఖాతాలో చేరాయి. ప్రసార హక్కులు ఊహించని ధరకు అమ్ముడుపోగా అధికారిక జెర్సీలు, మెర్చండైజ్ అమ్మకాలు కూడా ఈ ఆదాయానికి భారీగా ఊతాన్నిచ్చాయి.

మెస్సీ, రొనాల్డో.. టోర్నీకే సమ్మోహన శక్తి

2026 వరల్డ్ కప్‌పై గ్లోబల్ స్థాయిలో ఇంతటి అపారమైన ఆసక్తి ఏర్పడటానికి మరో ముఖ్య కారణం లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. ఆధునిక ఫుట్‌బాల్ మహామహులుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలకు బహుశా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు అనే అంచనాలు ఉండటంతో అభిమానులు మ్యాచ్‌లకు పోటెత్తారు. వీరిద్దరి ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడాభిమానులు లక్షల సంఖ్యలో స్టేడియాలకు తరలిరావడంతో దాదాపు ప్రతి మ్యాచ్ హౌస్‌ఫుల్ కాంబోతో సాగింది.

2022 తో పోలిస్తే భారీ లీప్

2022 ఖతార్ వరల్డ్ కప్ నమోదు చేసిన ఆదాయ రికార్డులను 2026 ఎడిషన్ సునాయాసంగా తుడిచిపెట్టేసింది. ఈ స్థాయి ఆర్థిక విజయం సాధించడం ద్వారా ఫిఫా వరల్డ్ కప్ గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్‌లో తన సార్వభౌమత్వాన్ని మరోసారి చాటుకుంది.

ఒక్క నెల వ్యవధిలోనే ₹87 వేల కోట్లు సాధించి చారిత్రక మైలురాయిని చేరుకున్న ఈ రికార్డును రాబోయే రోజుల్లో అధిగమించడం ఏ ఇతర క్రీడా ఈవెంట్‌కైనా ఒక పెద్ద సవాలుగా మారడం ఖాయం..