ధోనీ లేకుంటే సీఎస్‌కే భవిష్యత్తు ఏంటి? 2027 ఐపీఎల్‌లో కొత్త అధ్యాయం మొదలు కానుందా.?
2027 ఐపీఎల్ సమరంలో పసుపు చొక్కా వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టేది ధోనీ కాదు.. కేవలం ఆయన నీడ మాత్రమేనా?
By: A.N.Kumar | 30 July 2026 5:49 PM ISTధోనీ లేని సీఎస్‌కేను ఊహించుకోవడమే అభిమానులకు ఒక నైట్‌మేర్.. కానీ ఆ చేదు నిజాన్ని మింగక తప్పని సమయం ఆసన్నమైందా? 2027 ఐపీఎల్ సమరంలో పసుపు చొక్కా వేసుకుని మైదానంలోకి అడుగుపెట్టేది ధోనీ కాదు.. కేవలం ఆయన నీడ మాత్రమేనా?
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన.. ప్రాచుర్యం పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. సీఎస్‌కే అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకువచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. దాదాపు రెండు దశాబ్దాలుగా తన అద్భుతమైన నాయకత్వంతో మైదానంలో ప్రశాంతమైన వైఖరితో సీఎస్‌కే బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిపారు. అయితే 2027 ఐపీఎల్ సీజన్ నాటికి ధోనీ ఆటగాడిగా మైదానంలో కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం వినిపిస్తోంది.
ప్లేయర్‌గా కాకుండా.. మెంటర్‌గా కొత్త అవతారం?
తాజా నివేదికల ప్రకారం.. 2027 సీజన్‌లో ధోనీ ఆటగాడిగా కాకుండా జట్టుకు ‘మెంటర్’ పాత్రలో వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ధోనీ భవిష్యత్తుపై గత కొంతకాలంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 2026 సీజన్‌లో కూడా ఆయన తుది జట్టులో ఆడకపోయినా డగౌట్‌కే పరిమితమై యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకుడిగా వ్యవహరించారని తెలుస్తోంది.
ఫ్యాన్ బేస్, టికెట్ సేల్స్‌పై ప్రభావం పడేనా?
ధోనీ ఆటకు స్వస్తి పలికితే ఆ ప్రభావం కేవలం మైదానంలోని ఆటపైనే కాకుండా సీఎస్‌కే బ్రాండ్ వ్యాల్యూపై కూడా పడే అవకాశం ఉంది. దశాబ్ద కాలంగా సీఎస్‌కే మ్యాచ్‌లకు స్టేడియం కిక్కిరిసిపోవడానికి ధోనీ ప్రధాన కారణం. ఆయన ఒక్కసారి క్రీజులోకి వస్తే చాలు అని కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తారు. ధోనీ ఆటగాడిగా లేకపోతే స్టేడియాలకు వచ్చే అభిమానుల సంఖ్య తగ్గుతుందేమోనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆటగాడిగా లేకపోయినా మెంటర్‌గా డగౌట్‌లో లేదా స్టేడియంలో ధోనీ కనిపిస్తే, అభిమానులతో సీఎస్‌కేకున్న బలమైన బంధం అలాగే కొనసాగే అవకాశం ఉంది.
ఆర్భాటం లేని వీడ్కోలు.. ధోనీ మార్క్ స్టైల్
ధోనీ రిటైర్మెంట్ అంశం కూడా ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లే, ఎలాంటి ఆర్భాటం లేదా ప్రత్యేకమైన వీడ్కోలు మ్యాచ్ లేకుండానే ధోనీ ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలకవచ్చని భావిస్తున్నారు. వ్యక్తిగత ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన స్వభావానికి ఇది తగినట్లే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అధికారిక ప్రకటన రావాల్సిందే
ఇప్పటివరకు ధోనీ గానీ, సీఎస్‌కే యాజమాన్యం గానీ 2027 సీజన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదంతా ఊహాగానాలు మాత్రమే.
ఏది ఏమైనప్పటికీ తమ ప్రియతమ నాయకుడిని మరోసారి పసుపు జెర్సీలో మైదానంలో చూడాలని సీఎస్‌కే అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
