తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష?
దీంతో ఆయనకు గరిష్టంగా 9 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
By: A.N.Kumar | 22 July 2026 1:52 PM ISTఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన అద్భుతమైన ఆటతీరుతో కాదు.. డ్రంకెన్ డ్రైవ్ కేసులో నేరం ఒప్పుకుని వార్తల్లోకి ఎక్కారు. సిడ్నీలో నమోదైన ఈ కేసు విచారణ సందర్భంగా వార్నర్ కోర్టు ముందు తన తప్పును అంగీకరించినట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఆయనకు గరిష్టంగా 9 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అసలేం జరిగింది?
సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 5న సిడ్నీలో డేవిడ్ వార్నర్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. సాధారణంగా అలాంటి సమయాల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలను ఎంచుకోవాల్సి ఉండగా స్వయంగా వాహనం నడపడంతో పోలీసులు ఆయనపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు విచారణ సందర్భంగా వార్నర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. "మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం నా పొరపాటే" అని వార్నర్ ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని భావించిన న్యాయస్థానం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది.
విధించే అవకాశమున్న శిక్షలు
ఈ కేసులో కోర్టు ఆగస్టు 18న తుది తీర్పును వెల్లడించనుంది. సమాచారం ప్రకారం వార్నర్‌కు గరిష్టంగా 9 నెలల వరకు జైలు శిక్ష... కనీసం 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. దాదాపు 2,200 ఆస్ట్రేలియన్ డాలర్ల అపరాధ రుసుము పడనుంది.
తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టుడైన వార్నర్!
భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా తెలుగు వారికి డేవిడ్ వార్నర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించి, 2016లో తొలి టైటిల్ అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మైదానంలో దూకుడుగా ఆడే వార్నర్, సోషల్ మీడియాలో తెలుగు పాటలకు డాన్సులు చేస్తూ, సినిమాల డైలాగులు చెబుతూ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు.
సెలబ్రిటీలకు ఒక హెచ్చరిక
మైదానంలో ఎంతటి గొప్ప ఆటగాడైనప్పటికీ, మైదానం వెలుపల వారి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. కోట్లాది మంది అభిమానులు, ముఖ్యంగా యువత సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకుంటారు. విదేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. హోదా ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే దానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఈ ఘటన కేవలం వార్నర్‌కే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది.
