గుజరాత్ కూల్.. చెన్నై గుండెల్లో రైళ్లు.. ఈ రాత్రికి సీఎస్కే ఫ్యాన్స్ హార్ట్ బీట్ తట్టుకోవడం కష్టమే!
ఐపీఎల్ సీజన్ చివరి దశకు వచ్చేసరికి కొన్ని జట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్.. సరిగ్గా యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు సిలబస్ మొత్తం మర్చిపోయి తెల్లమొహం వేసినట్టు ఉంటుంది.
By: A.N.Kumar | 21 May 2026 10:52 AM ISTఐపీఎల్ సీజన్ చివరి దశకు వచ్చేసరికి కొన్ని జట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్.. సరిగ్గా యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు సిలబస్ మొత్తం మర్చిపోయి తెల్లమొహం వేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై మ్యాచ్ ఉందంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ‘విసిల్ పోడు’ అంటూ ఫ్యాన్స్ స్టేడియంలను హోరెత్తించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే “విసిల్ పక్కన పెట్టి.. క్యాలిక్యులేటర్ పట్టుకోండి” అని మేనేజ్‌మెంట్ అభిమానులకు ఉచితంగా పంపిణీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్.. చెన్నైకి మామూలు మ్యాచ్ కాదు.. అసలైన ‘డూ ఆర్ డై’ జాతర!
గెలిస్తే గండం.. ఓడితే లగేజ్ సర్దుకోవడమే!
ఈ రాత్రి మ్యాచ్‌లో గెలిస్తేనే చెన్నైకి ప్లేఆఫ్స్ ఆశలు పేపర్ మీద బ్రతికి ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఓడిందా.. ఇక అంతే సంగతులు. “ఈసారి కప్పు మనదే భయ్యా” అంటూ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెట్టిన బిల్డప్ స్టేటస్‌లన్నీ డిలీట్ చేసి.. సైలెంట్‌గా ఆర్సీబీ ఫ్యాన్స్ లాగా “నెక్స్ట్ ఇయర్ కప్ నమ్దే” అనే బోర్డు తిప్పేయాల్సిందే. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. చెన్నై కేవలం గుజరాత్‌పై గెలిస్తే సరిపోదు. అది కథలో మొదటి చాప్టర్ మాత్రమే. ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే పెద్ద కథే ఉంది. రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఓడిపోవాలి. పంజాబ్ కింగ్స్ ఎక్కడికక్కడ జారిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగుకు కుదేలవ్వాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వరుసగా బోర్లా పడాలి... అంటే ఇవాళ రాత్రి నుంచి చెన్నై అభిమానులు కేవలం టీవీల ముందు కూర్చుని ధోనీ ధోనీ అని అరిస్తే సరిపోదు. జ్యోతిష్కుల్లా మారి చేతిలో క్యాలిక్యులేటర్లు పట్టుకుని, మిగతా జట్ల జాతకాలను కూడా లెక్కగట్టాలి. నెక్ట్స్ మ్యాచ్‌లో ఎవడైనా సిక్స్ కొడితే.. “అయ్యో, వీడు సిక్స్ కొడితే మన రన్ రేట్ పడిపోతుందే” అని గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి.
నెట్ రన్ రేట్ శాపం.. సంజూపైనే భారం!
ఇక నెట్ రన్ రేట్ సంగతి కొంచం మాట్లాడకపోతే ఎలా? ప్రస్తుతం చెన్నై రన్ రేట్ ఎలా ఉందంటే.. ఫ్రెషర్ ఉద్యోగానికి వెళ్లిన కుర్రాడిని ఇంటర్వ్యూలో “నీకు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందా?” అని అడిగినట్టుంది. వరుస ఓటములతో ఇప్పటికే మైనస్ మూడ్‌లో ఉన్న జట్టు.. ఇప్పుడు ఒక్కసారిగా పుంజుకుని హిమాలయాలంత భారీ విజయాన్ని నమోదు చేయాలి. స్కోర్‌బోర్డు మీద రన్ రేట్ ఎంత మైనస్‌లో ఉన్నా మాకు అనవసరం. క్రీజులో సంజూ శాంసన్ హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ తిప్పుతూ కనిపిస్తే చాలు.. ఐసీసీ రూల్స్ మార్చైనా చెన్నైని ప్లేఆఫ్స్‌కు పంపుతుందని మా గట్టి నమ్మకం అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.. మరి అది నెరవేరుతుందో లేదో చూడాలి.
కూల్‌గా ఉన్న గుజరాత్.. పెరగనున్న చెన్నై హార్ట్ బీట్!
మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ టికెట్‌ను జేబులో వేసుకుని.. హాయిగా కాళ్లు చాపుకుని రిలాక్స్ మోడ్‌లో ఉంది గుజరాత్ టైటాన్స్. అయితే క్రికెట్‌లో టెన్షన్ లేని జట్లతోనే అసలైన ప్రమాదం ఉంటుంది. వాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ‘పోతే పోయింది’ అని బ్యాట్లు ఊపితే బంతి స్టేడియం దాటాల్సిందే. పైగా టాప్-2 లో నిలిచి క్వాలిఫైయర్-1 ఆడాలంటే వాళ్లకు కూడా ఈ మ్యాచ్ పాయింట్లు అవసరమే. కాబట్టి చెన్నైకి ఎదురుగా నిలబడింది కేవలం ఒక టీమ్ కాదు.. భారీ స్టేట్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్న ఒక మైటీ టైటాన్స్..
సోషల్ మీడియాలో అయితే మీమ్స్ మామూలుగా లేవు. “చెన్నై ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఇండియా లాజిక్ కంటే ఇస్రో మ్యాథ్స్ ఎక్కువ కావాలి” అని కొందరు సెటైర్లు వేస్తుంటే.. “ధోనీ లాస్ట్ ఓవర్‌లో వచ్చి హెలికాప్టర్ షాట్ కొడితే అంపైర్లు అంకెలు మార్చేస్తారు” అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రాత్రి మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నా.. సీఎస్‌కే ఫ్యాన్స్ హార్ట్‌బీట్ మాత్రం ఐపీఎల్ అఫీషియల్ డ్రమ్స్ బీట్ కంటే వేగంగా కొట్టుకోవడం ఖాయం!
