Begin typing your search above and press return to search.

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

ఓ చిన్న చిరునవ్వు.. దానికి తోడు ఒక సరదా కామెంట్.. ఆయన పర్స్ ఖాతాలో నుంచి కోట్ల రూపాయలు గాయబ్ అయ్యేలా చేశాయి.

By:  A.N.Kumar   |   2 Nov 2026 7:24 PM IST
ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..
X

నోటికి అదుపు.. మాటకి పొదుపు ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు.. ఎంత ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ అయితే మాత్రం.. మైదానంలో బంతిని తన్నినంత ఈజీగా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి తప్పించుకోగలరా? ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్, రియల్ మాడ్రిడ్ హీరో క్లియాన్ ఎంబాపెకి ఇప్పుడు ఈ విషయమే బాగా బోధపడి ఉంటుంది. ఓ చిన్న చిరునవ్వు.. దానికి తోడు ఒక సరదా కామెంట్.. ఆయన పర్స్ ఖాతాలో నుంచి కోట్ల రూపాయలు గాయబ్ అయ్యేలా చేశాయి.

అసలేం జరిగిందంటే.. ఒక ఫ్రెంచ్ ఆన్‌లైన్‌ షోలో "మీకు ఇష్టమైన మీమ్ ఏంటి బాస్?" అని యాంకర్ అడిగితే చాలు.. మన ఎంబాపె గారు పొంగిపోయారు. చైనా మాజీ అధ్యక్షుడు మావో జెడాంగ్ మీమ్‌ను చూసి "ఆయన చైనాకు చెందిన డిక్టేటర్ అనుకుంటా" అంటూ అమాయకంగా నవ్వేశారు. ఆ ఒక్క నవ్వు చైనా నెటిజన్లకు తీవ్ర కోపాన్ని తెప్పించింది. దాంతో కథ అడ్డం తిరిగింది.

విషయం వైరల్ అవ్వడమే ఆలస్యం.. ఎంబాపెకి దిమ్మతిరిగే షాక్‌లు వరుసపెట్టి తగిలాయి. చైనాకి చెందిన డాంగ్‌పెంగ్, మెంగిన్యూ, మిల్క్‌గ్రౌండ్ లాంటి దిగ్గజ కంపెనీలు "జాతీయ సెంటిమెంట్‌తో ఆడుకుంటే సహించేది లేదు" అంటూ ఎంబాపెతో చేసుకున్న భారీ బ్రాండ్ ఒప్పందాలను డస్ట్ బిన్‌లో పడేశాయి. ‘అయ్యో తప్పుగా అర్థం చేసుకున్నారు.. నా ఉద్దేశం అది కాదు’ అని ఎంబాపె నెత్తీ నోరు బాదుకుని క్షమాపణలు చెప్పినా చైనా కంపెనీల మనసు కరగలేదు.

ఇక్కడితో కథ ముగిసిందా అంటే అదీ లేదు. ఎంబాపె దెబ్బకి ఆయన ఆడుతున్న రియల్ మాడ్రిడ్ టీమ్‌తో పాటు మొత్తం 'లా లిగా' టోర్నీకే చైనా సీసీటీవీ బ్రాడ్‌కాస్టింగ్ గేట్లు మూసేసింది. ఎంబాపె ఉన్న యాడ్స్.. మ్యాచుల ప్రసారాలను రాత్రికి రాత్రే నిలిపేసింది. రియల్ మాడ్రిడ్ యాజమాన్యం, లా లిగా నిర్వాహకులు కూడా చేతులు జోడించి చైనాను క్షమాపణలు కోరినా ఫలితం లేకుండా పోయింది.

ప్రత్యర్థి జట్టు డిఫెండర్లను సులువుగా దాటుకుపోయే ఎంబాపె.. చైనా 'మావో' డిఫెన్స్‌ను మాత్రం దాటలేక చిక్కుల్లో పడ్డారు. మైదానంలో గోల్స్ కొట్టడం కంటే.. బయట నోరు అదుపులో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటనా రూపంలో ఎంబాపెకి బాగా గుర్తుండిపోతుంది.