రూ.25 కోట్ల గ్రీన్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కు భారీ షాక్
సుమారు రూ.25.20 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఈ ఆటగాడు మైదానంలో కనీస ప్రభావం చూపలేకపోతుండటంతో అటు యాజమాన్యం, ఇటు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
By: A.N.Kumar | 7 April 2026 11:46 AM ISTఖరీదైన ఆటగాడు.. అల్ప ప్రదర్శన! ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పాలిట గుదిబండలా మారాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుమారు రూ.25.20 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఈ ఆటగాడు మైదానంలో కనీస ప్రభావం చూపలేకపోతుండటంతో అటు యాజమాన్యం, ఇటు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధర భారీ.. స్కోరు అల్పం
ఐపీఎల్ అంటేనే ధనవర్షం. అయితే ఇక్కడ ఆటగాడి ధర కంటే అతని ప్రదర్శనే జట్టు తలరాతను మారుస్తుంది. మినీ వేలంలో భారీ అంచనాలతో గ్రీన్‌ను దక్కించుకున్న కేకేఆర్, అతను జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడని భావించింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గ్రీన్ చేసిన పరుగులు వరుసగా 18, 2, 4. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టుకు అండగా నిలవాల్సిన సమయంలో బాధ్యతారహితంగా వికెట్ పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రీన్ బ్యాటింగ్‌లో పాత పదును కనిపించడం లేదు. బంతిని ఎదుర్కోవడంలో అతనిలో స్పష్టమైన ఆత్మవిశ్వాసం లోపించినట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో ఒక్కో పరుగు విలువైనదే. అలాంటిది రూ. 25 కోట్లు ఖర్చు పెట్టిన ప్లేయర్ కనీసం రెండంకెల స్కోరు చేయడానికే ఇబ్బంది పడుతుండటం జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తోంది.
కేకేఆర్ తీసుకున్న నిర్ణయం తప్పిదమా?
2024 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి మెగా వేలానికి ముందు కొంతమంది కీలక ఆటగాళ్లను వదులుకుంది. ముఖ్యంగా
జట్టుకు ఓపెనింగ్‌లో శుభారంభాలు ఇచ్చే ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ను వేలంలోకి వదిలేసింది. ఇక జట్టును నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా విడిచిపెట్టేసింది. డెత్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించే హిట్టర్ నికోలస్ పూరన్ ను వదులుకుంది.. వీరిని వదులుకుని వారి స్థానంలో ఒకే ఒక్క గ్రీన్‌పై భారీ పెట్టుబడి పెట్టడం ఇప్పుడు కేకేఆర్ చేసిన అతిపెద్ద పొరపాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ కోర్ బలాన్ని తగ్గించుకుని విదేశీ ఆటగాడిపై ఆధారపడటం కోల్‌కతా కొంపముంచుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
బౌలింగ్‌లోనూ అదే వైఫల్యం
ఒకవేళ బ్యాటింగ్‌లో విఫలమైనా, బౌలింగ్‌లోనైనా రాణిస్తాడా అంటే అదీ లేదు. ఆల్‌రౌండర్ హోదాలో జట్టులోకి వచ్చిన గ్రీన్ మొదట్లో ఫిట్ నెస్ లోపంతో బౌలింగ్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నా రిథమ్ మిస్ అయ్యింది. బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు ఇస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు సులువుగా దొరికిపోతున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో అతను విఫలమవుతుండటంతో కేకేఆర్ బౌలింగ్ విభాగంపై ఒత్తిడి పెరుగుతోంది. "ఐపీఎల్‌లో పేరును చూసి పాయింట్లు ఇవ్వరు. మైదానంలో చూపే ప్రతిభే ముఖ్యం. గ్రీన్ త్వరగా తన ఫామ్‌ను అందుకోకపోతే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుండి త్వరగానే నిష్క్రమించాల్సి ఉంటుంది." అని అభిప్రాయపడుతున్నారు.
షారుఖ్ ఖాన్ అంచనాలు తలకిందులు
జట్టు యజమాని షారుఖ్ ఖాన్ గ్రీన్‌ను తీసుకోవడం ద్వారా జట్టుకు ఒక కంప్లీట్ ఆల్‌రౌండర్ దొరుకుతాడని ఆశించారు. కానీ ఈ భారీ పెట్టుబడి ఇప్పుడు కేకేఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. ఇతర జట్లు తక్కువ ధరకే నాణ్యమైన ఆటగాళ్లను దక్కించుకోగా కేకేఆర్ మాత్రం గ్రీన్ విషయంలో 'మరీ ఎక్కువ' రిస్క్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గ్రీన్ కోలుకుంటాడా?
లీగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి, గ్రీన్‌కు తనను తాను నిరూపించుకోవడానికి మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే మాత్రం అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కోట్లు కుమ్మరించినంత మాత్రాన విజయాలు రావని మైదానంలో పోరాటపటిమ ఉంటేనే గెలుపు సాధ్యమని కామెరూన్ గ్రీన్ ఇప్పటికైనా గ్రహించాల్సి ఉంది. కేకేఆర్ అభిమానులు మాత్రం గ్రీన్ నుంచి ఒక 'బిగ్ ఇన్నింగ్స్' కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
