బౌలింగే చేతకాని పేసర్ రవూఫ్‌కు ఫైటర్ జెట్ దించిన బుమ్రా
ఆసియా కప్ లో సూపర్ 4లో భారత్ పై మ్యాచ్ సందర్భంగా హారిస్ రవూఫ్.. యుద్ధ విమానాలు (ఫైటర్ జెట్లు) కూలినట్లుగా ఆరు వేళ్లను చూపుతూ ఎక్స్ ట్రాలు చేశాడు.
By: Tupaki Entertainment Desk | 29 Sept 2025 9:23 AM ISTఆదివారం.. ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ ఫైనల్ ముగిశాక కామెంట్రీ రూమ్ లో భారత మాజీ హెడ్ కోచ్, మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి, పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ విశ్లేషణ మొదలైంది. ప్రజంటేటర్ మాట్లాడాక అక్రమ్ కాస్త ఆగ్రహంగా నోరు తెరిచి ఓ బౌలర్ ను తీవ్రంగా తప్పుబట్టాడు. అతడు పాక్ బౌలింగ్ రన్ మెషీన్ అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశాడు. సహజంగా బ్యాట్ తో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న వారిని రన్ మెషీన్ అని అంటారు. కానీ, ఓ బౌలర్ ను పట్టుకుని.. అదీ ఒక గొప్ప బౌలర్ అయిన వసీమ్ అక్రమ్ ఇంత మాట అన్నాడంటే ఆ బౌలర్ ఎంత దరిద్రంగా బంతులేశాడో.. అతడి ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
స్పీడ్ ఉంటే సరిపోదు..
హారిస్ రవూఫ్.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడని ప్రపంచ క్రికెట్ లో పేరు. కానీ, క్రికెట్ లో బౌలర్ కు వేగం ఒక్కటే సరిపోదు. లైన్ అండ్ లెంగ్త్ ముఖ్యం. టి20 క్రికెట్ లో అయితే మరీను .ఇలానే హారిస్ రౌఫ్ కు పరుగులు టన్నులు టన్నులు ఇచ్చే బౌలర్ గా చెడ్డ పేరొచ్చింది. అంతెందుకు..? ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టి20 ప్రపంచ కప్ లో కోహ్లి క్రీజులోంచి ముందుకొచ్చి హారిస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన సిక్సర్లు ఐకానిక్ గా నిలిచాయి. పాక్ క్రికెట్ లోని అత్యంత అవినీతి కారణంగానో ఏమో.. మరే దిక్కు లేకనో ఏమో.. హారిస్ రవూఫ్ ఇంకా ఆ దేశానికి ఆడుతున్నాడు.
హాఫ్ సెంచరీ చేశాడు.. బౌలింగ్ లో
ఆదివారం భారత్ తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాక్ తరఫున రెండు హాఫ్ సెంచరీలు నమోదుయ్యాయి. అదేంటి? ఆ జట్టు ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ఒక్కడే కదా హాఫ్ సెంచరీ చేసింది అంటారా..? అయితే, ఈ రెండో హాఫ్ సెంచరీ బౌలింగ్ లో వచ్చింది. హారిస్ రవూఫ్ ద్వారా..! అతడు 3.4 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడన్నమాట. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అందుకే అక్రమ్ కు తీవ్ర ఆగ్రహం కలిగి బౌలింగ్ లో పాక్ రన్ మెషీన్ అని మండిపడ్డాడు.
సూపర్ 4 లో ఎక్స్ ట్రాలు చేసి...
ఆసియా కప్ లో సూపర్ 4లో భారత్ పై మ్యాచ్ సందర్భంగా హారిస్ రవూఫ్.. యుద్ధ విమానాలు (ఫైటర్ జెట్లు) కూలినట్లుగా ఆరు వేళ్లను చూపుతూ ఎక్స్ ట్రాలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కు చెందిన ఫైటర్ జెట్లను పాక్ కూల్చిందనేలా ఈ విధంగా ప్రవర్తించాడు. దీనికి 30 శాతం జరిమానా కూడా ఎదుర్కొన్నాడు. అయితే, ఫైనల్లో హారిస్ రవూఫ్‌కు భారత మేటి పేసర్ బుమ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. రవూఫ్‌కు 17 వ ఓవర్ లో ఐదో బంతిని బుమ్రా యార్కర్ గా సంధించాడు. దీనికి సమాధానం లేక అతడు బౌల్డయ్యాడు. అనంతరం బుల్లెట్ దించాను అన్నట్లుగా... మన ఫైటర్ జెట్లు పాక్ భూభాగంలోకి దూసుకెళ్లాయి అన్నట్లుగా సంజ్ఞ చేశాడు. దీంతో రవూఫ్‌కు బుమ్రా గట్టి కౌంటర్ ఇచ్చాడని టీవీల ముందు అభిమానులు సంతోషించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టి వైరల్ చేశారు.
