Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ క్రికెటర్ల ఐపీఎల్ బ్యాన్.. బీసీసీఐ సంచలన ప్రకటన

బంగ్లాదేశ్ కొద్దిరోజులుగా తగులబడుతోంది. ప్రధాని షేక్ హసీనాను గద్దెదించాక అక్కడ ఉన్మాద శక్తులు మతమౌఢ్యంతో రెచ్చిపోతున్నాయి.

By:  A.N.Kumar   |   2 Jan 2026 5:56 PM IST
బంగ్లాదేశ్ క్రికెటర్ల ఐపీఎల్ బ్యాన్.. బీసీసీఐ సంచలన ప్రకటన
X

బంగ్లాదేశ్ కొద్దిరోజులుగా తగులబడుతోంది. ప్రధాని షేక్ హసీనాను గద్దెదించాక అక్కడ ఉన్మాద శక్తులు మతమౌఢ్యంతో రెచ్చిపోతున్నాయి. మైనార్టీలు అయిన హిందువులను సజీవ దహనాలు చేయడం.. కొట్టి చంపడం నిత్య కృత్యంగా మారింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నేతల ప్రకటనలు కూడా భారత్ కు వ్యతిరేకంగా సాగుతున్నాయి. ఇంతటి ఉద్రిక్తతల వేళ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పాల్గొనడంపై దేశవ్యాప్తంగా విమర్శలు.. చర్చలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించాలనే డిమాండ్లపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ ఈ విషయంలో తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన మార్గనిర్దేశకాలు అందలేదని స్పష్టం చేశాయి.

ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్

బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడనివ్వకూడదనే అంశం పూర్తిగా దౌత్యపరమైనదని.. ఇది తమ పరిధిలోని అంశం కాదని బీసీసీఐ పేర్కొంది. "ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చే వరకు మేము ఏ ఆటగాడిపై సొంతంగా నిర్ణయం తీసుకోలేము. ఈ విషయంలో మరింత వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు" అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

ఐపీఎల్ 2026 మినీ వేలం.. ముస్తాఫిజుర్ పై కాసుల వర్షం

రాజకీయ వివాదాలు ఒకవైపు ఉన్నప్పటికీ ఇటీవల అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ హాట్ కేకులా అమ్ముడుపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ నిలిచాడు.

2016లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ముస్తాఫిజుర్ ఇప్పటివరకు 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయగల అతని సామర్థ్యంపై నమ్మకంతో కేకేఆర్ భారీ ధర వెచ్చించింది.

విమర్శలకు కారణం ఏమిటి?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడుల వార్తల నేపథ్యంలో భారతీయ నెటిజన్లు.. కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. "ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతుంటే ఆ దేశ ఆటగాళ్లకు భారత లీగ్ లో కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు?" అన్నది విమర్శకుల ప్రధాన ప్రశ్న. అయితే క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టకూడదని క్రీడా ప్రేమికులు వాదిస్తున్నారు.

భారత్–బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్ ఖరారు

దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. గతంలో వాయిదా పడిన సిరీస్‌లను పునరుద్ధరిస్తూ ఆగస్టు–సెప్టెంబరు 2026 మధ్య ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఉండనున్నాయి. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గతేడాది ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్‌తో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతాయని బీసీబీ ఆశిస్తోంది.

మొత్తానికి బంగ్లాదేశ్ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్ల ప్రాతినిధ్యానికి ఢోకా లేదని అర్థమవుతోంది. అయితే రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు మారితే అది నేరుగా క్రికెట్ మైదానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.