వైట్ వాష్ కు మైండ్ వాష్.. గంభీర్.. అగార్కర్ కు బీసీసీఐ క్లాస్
బీసీసీఐ సమావేశాలు అధికంగా ముంబైలోనే జరుగుతాయి. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది.
By: Tupaki Entertainment Desk | 1 Dec 2025 5:00 PM ISTచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టెస్టు ఫార్మాట్లో ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండు వైట్ వాష్ లు..! అది కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ప్రధాన ప్రత్యర్థులతో కాకుండా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై..! గెలిచింది కేవలం బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి బలహీన జట్లపైనే! వన్డేల్లో శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత సిరీస్ పరాజయం..! టెస్టులకు ముగ్గురు దిగ్గజాలు అనూహ్య రిటైర్మెంట్.. జట్టులోకి ఎవరిని ఎంపిక చేస్తారో.. మైదానంలో దిగే తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియనంతగా మార్పులు.. ఇదేదో పాకిస్థాన్ క్రికెట్ లోని పరిస్థితి కాదు. అత్యంత సమర్థ, అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)లోని పరిస్థితి. దీంతో టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వారిద్దరితో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అది కూడా బుధవారమే అత్యవసరంగా సమావేశం కానుంది. వాస్తవంగా ఇలాంటి భేటీలు సహజమే. కానీ, తాజా ఓటముల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి, ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి? ఏమైనా మార్పులు చేస్తారా? లేక గంభీర్, అగార్కర్ లను సున్నితంగా హెచ్చరించి వదిలేస్తారా? అన్నది చూడాలి.
ఆకస్మికంగా అంటే...
బీసీసీఐ సమావేశాలు అధికంగా ముంబైలోనే జరుగుతాయి. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. కానీ, బుధవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే జరిగే రాయ్ పూర్ లోనే గంభీర్, అగార్కర్ లతో భేటీ కానుండడం గమనార్హం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభ్ తేజ్ సింగ్ పాల్గొంటారు. ఇంత ఆకస్మిక సమావేశానికి కారణం జట్టు ప్రదర్శనే అనే విశ్లేషణలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఇటీవలి టెస్టు సిరీస్ వైట్ వాష్ తర్వాత ఈ మీటింగ్ జరుగుతుండడంతో సమీక్ష జరపనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇకమీదట ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఏంచేయాలి? అనే చర్చ సాగనున్నట్లు చెబుతున్నారు.
ఏం చేస్తున్నారు మీరు..?
గంభీర్, అగార్కర్ వచ్చాక టీమ్ఇండియా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏదో ఒక సాధారణ జట్టు తరహాలో ఈ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇలాగే వదిలేస్తే మున్ముందు విమర్శలు తీవ్రం కావడం ఖాయం. వీటిపైనే బీసీసీఐ సమీక్షించే చాన్సుంది. పైగా వచ్చే ఫిబ్రవరి నుంచి టి20 ప్రపంచ కప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉన్నాయి. టి20 ప్రపంచ కప్ ను నిలబెట్టుకోవడం, వన్డే ప్రపంచ కప్ నెగ్గడం చాలా ప్రతిష్ఠాత్మకం. అందుకనే గంభీర్, అగార్కర్ నుంచి వారి ప్రణాళికలపై బీసీసీఐ స్పష్టత కోరే చాన్సుందని సమాచారం. టీమ్ ఇండియా వచ్చే ఏడాది జూలైలో టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. శ్రీలంకతో జరిగే ఈ సిరీస్ కు ఇప్పటినుంచే ఆలోచించడం సరికాకున్నా, భవిష్యత్ టెస్టు జట్టు నిర్మాణంపైనా ఆలోచన చేయొచ్చు. ఇదే సమయంలో డిసెంబరు 9 నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు జట్టును కూడా ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.
