దక్షిణాఫ్రికాతో టెస్టులు.. కొత్త ట్రెండ్.. ముందు టీ.. తర్వాత లంచ్
సాధారణంగా 90 ఓవర్ల పాటు సాగే టెస్టు మ్యాచ్ లో రెండు బ్రేక్ లు ఉంటాయి. అవి లంచ్, టీ. ఉదయాన్నే మ్యాచ్ మొదలైన రెండున్నర గంటల తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చేస్తారు.
By: Tupaki Entertainment Desk | 12 Nov 2025 9:15 AM ISTసాధారణంగా 90 ఓవర్ల పాటు సాగే టెస్టు మ్యాచ్ లో రెండు బ్రేక్ లు ఉంటాయి. అవి లంచ్, టీ. ఉదయాన్నే మ్యాచ్ మొదలైన రెండున్నర గంటల తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చేస్తారు. తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. చివరి సెషన్ తో ఆ రోజు ఆట ముగిస్తారు. ఇప్పటివరకు భారత్ లో టెస్టు మ్యాచ్ లు అంటే.. మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా టెస్టు మ్యాచ్ లు అంటే ఇదే తీరు. శతాబ్దంపైగా ఇదే కొనసాగుతోంది. కానీ, భారత్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టులో తొలిసారిగా ఓ ప్రయోగం చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్ కు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 22 నుంచి అసోంలోని గువాహటిలో జరగనుంది. అయితే, దేశ ఈశాన్య ప్రాంతంలో టెస్టు మ్యాచ్, అది కూడా శీతాకాలంలో జరుగుతుండడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఒకటే టైమ్ జోమ్.. కానీ, టైమింగ్ వేరు..
అమెరికా, రష్యా, కెనడా వంటి పెద్ద దేశాల్లో వివిధ రకాల టైమ్ జోన్లు ఉన్నాయి. కానీ, భారత దేశం అంతటా ఒకటే టైమ్ జోన్ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్-ఐఎస్టీ). ఈశాన్య రాష్ట్రాలకు పశ్చిమాన ఉన్న మహారాష్ట్రకు టైమ్ ఒకటే అయినా టైమింగ్ మాత్రం చాలా తేడా. ఈశాన్యంలో వేసవిలో 4.30 కల్లా తర్వాత తెల్లవారుతుంది. అప్పటినుంచి ప్రజలు పనులు మొదలుపెట్టేస్తారు. రాత్రి త్వరగా పడుకుంటారు. కానీ, కార్యాలయాలు సహా అన్నీ సాయంత్రం 5-6 వరకు కొనసాగించాల్సిన పరిస్థతి. ఇక ముంబైలో అలాకాదు. 6 గంటల వరకు తెల్లవారితే నగరం కాబట్టి 10-11 తర్వాతనే కార్యకలాపాలు మొదలవుతాయి. అందుకనే దేశంలో భిన్న టైమ్ జోన్లు అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ విషయానికి వస్తే...
వెలుతురు మందగించక ముందే..
భారత్ లో శీతాకాలం కాబట్టి వెలుతురు చాలా త్వరగా మందగిస్తుంది. అసలే టెస్టు మ్యాచ్. ఆపై ఈశాన్యంలోని గువాహటిలో జరుగుతుంది. కాబట్టి 22 నుంచి జరిగే భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టులో ముందుగా టీ బ్రేక్, తర్వాత లంచ్ విరామం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. టెస్టు మ్యాచ్ ను సాధారణంగా 9.30కు మొదలుపెడతారు. కానీ, గువాహటిలో 8.30 (టాస్)కే ప్రారంభిస్తారు. మొదటి సెషన్ 9-11 గంటల మధ్య ఉంటుంది. 20 నిమిషాల టీ బ్రేక్ ఇస్తారు. లంచ్ విరామం 1.20-2 గంటల మధ్య ఉంటుంది. 4 వరకు మ్యాచ్ ను ముగిస్తారు. వీలును బట్టి అరగంట అదనపు సమయం ఇస్తారు.
