Begin typing your search above and press return to search.

తీసేయ‌డం స‌రే.. ఆ రూ.10 కోట్లు కేకేఆర్ కా..? ముస్తాఫిజుర్ కా?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చరిత్ర‌లో లేని విధంగా ఒక విదేశీ ఆట‌గాడిని వ‌దిలేయండి అంటూ ఫ్రాంచైజీకి సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).

By:  Tupaki Entertainment Desk   |   3 Jan 2026 6:00 PM IST
తీసేయ‌డం స‌రే.. ఆ రూ.10 కోట్లు కేకేఆర్ కా..? ముస్తాఫిజుర్ కా?
X

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చరిత్ర‌లో లేని విధంగా ఒక విదేశీ ఆట‌గాడిని వ‌దిలేయండి అంటూ ఫ్రాంచైజీకి సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). 18 సీజ‌న్ల పాటు ఎవ‌రి విష‌యంలోనూ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోని బోర్డు.. బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడుల ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ దేశ పేస్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను వ‌చ్చే సీజ‌న్ కు ప‌క్క‌న‌పెట్ట‌మ‌ని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) యాజ‌మాన్యాన్ని కోరింది. అయితే, ఇక్క‌డే ఒక చిక్కుముడి ఉంది. డిసెంబ‌రులో జ‌రిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ ను కేకేఆర్ ఏకంగా రూ.9.20 కోట్ల భారీ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. ఐపీఎల్ లో ఓ బంగ్లాదేశీ ఆట‌గాడికి ద‌క్కిన అధిక ధ‌ర ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ, ఈ మొత్తం చేతికి అంద‌కుండానే ముస్తాఫిజుర్ త‌న చేతుల్లో లేని ప‌రిస్థితుల‌కు బ‌ల‌య్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ నుంచి అకార‌ణంగా వెళ్లిపోయిన ఆట‌గాళ్ల‌పై చ‌ర్య‌ల విష‌యంలో బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహ‌క మండ‌లికి స్ప‌ష్ట‌త ఉంది. గ‌తంలో లీగ్ వేలంలో మంచి ధ‌ర దక్కిన‌ప్ప‌టికీ అకార‌ణంగా వెళ్లిపోయాడు ఇంగ్లండ్ విధ్వంస‌క ప్లేయ‌ర్ హ్యారీ బ్రూక్. కానీ, ముస్తాఫిజుర్ ను బీసీసీఐనే వ‌దిలేయ‌మ‌ని సూచించింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఆ 9.20 కోట్లు అత‌డికి ఇస్తారా?

ఏడుగురిలో ఒక‌డు...

గ‌త నెల‌లో జ‌రిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ తో పాటు ఏడుగురు బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు పేర్లు న‌మోదు చేసుకున్నారు. కానీ, ముస్తాఫిజుర్ ను మాత్ర‌మే ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ఇటీవ‌లి కాలంలో 30 ఏళ్ల ముస్తాఫిజుర్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. 2016 నుంచి లీగ్ లో ఆడుతున్నాడు. 60 మ్యాచ్ ల‌లో 65 వికెట్లు తీశాడు. తొలి రెండేళ్లు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఒక్కో సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్, రాజ‌స్థాన్, రెండు సీజ‌న్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్, ఒక సీజ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్, గ‌త ఏడాది మ‌ళ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించాడు.

ఫిజ్... ఒక్క బంతి కూడా వేయ‌కుండానే..

ఫిజ్ అంటూ స‌హ‌చ‌రులు పిలుచుకునే ముస్తాఫిజుర్ తొలిసారిగా కేకేఆర్ కు ఆడ‌బోతున్నాడు. కానీ, ప‌రిణామాల రీత్యా ఒక్క బంతి కూడా వేయ‌కుండానే వ‌దిలేయాల్సి వ‌చ్చింది. మ‌రి అత‌డికి రూ.9.20 కోట్లు ఇస్తారా? అంటే... నిబంధ‌న‌ల మేర‌కు ఈ మొత్తం కోల్ క‌తా ప‌ర్స్ నుంచి క‌ట్ అయ్యాయి. కానీ, ఫిజ్ అంశం భిన్న‌మైన‌ది కావ‌డంతో ఏం చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆట‌తో సంబంధం లేని కార‌ణాల‌తో అత‌డు ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హించ‌లేక‌పోతున్నాడు. దీంతో అత‌డికి చెల్లించాల్సిన మొత్తం తిరిగి కేకేఆర్ కు జ‌మ అవుతుంది.

ముస్తాఫిజుర్ డ‌బ్బు డిమాండ్ చేస్తే..

త‌నంత‌ట తాను దూరం కాలేదు కాబ‌ట్టి.. ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్, బీసీసీఐ నుంచి డ‌బ్బు డిమాండ్ చేసే చాన్స్ ఉంది. అత‌డు ఆ నిర్ణయం తీసుకుంటే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం కానుంది. ఎక్కువ‌శాతం మంది అభిప్రాయం ప్ర‌కారం ముస్తాఫిజుర్.. ఎలాంటి ఆలోచ‌న చేయ‌క‌పోవ‌చ్చు. మ‌రికొన్నేళ్లు క్రికెట్ ఆడేంత సామ‌ర్థ్యం ఉన్నందున వ‌చ్చే సీజ‌న్ కు లేదా ఈ సీజ‌న్ లోనే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేవ‌ర‌కు వేచి చూస్తాడ‌ని భావిస్తున్నారు. మ‌రి.. అప్ప‌టివ‌ర‌కు అత‌డి స్థానంలో వేరొక‌రిని తీసుకునేందుకు కేకేఆర్ కు అనుమ‌తి ఉంది. అయితే, ఫిజ్ కు చెల్లిస్తామ‌ని చెప్పిన మొత్తం తిరిగి జ‌మ అయ్యాకే మ‌రొక‌రికిపై ఖ‌ర్చు చేయ‌గ‌ల‌దు.