టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా హైదరాబాదీ దిగ్గజ క్రికెటర్?
ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవి నుంచి (టెస్టులకు) అతడిని తప్పిస్తారనే ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. వాస్తవానికి పదిపదిహేను రోజుల కిందటనే ఈ మేరకు వార్తలు వచ్చాయి.
By: Tupaki Entertainment Desk | 28 Dec 2025 8:58 AM ISTనిరుడు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్.. అసలు 38 ఏళ్లుగా భారత్ లో టెస్టుల్లో గెలవడమే తెలియని న్యూజిలాండ్ ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది.. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో 1-3తో సిరీస్ లాస్! దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి ఔట్. కొత్త డబ్ల్యూటీసీ సైకిలో ఇంగ్లండ్ లో 2-2తో డ్రా చేసుకున్నా ఆ ఘనత అంతా కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ దే. స్వదేశంలో మళ్లీ వెస్టిండీస్ వంటి బలహీన జట్టును ఓడించినా, ఆ వెంటనే దక్షిణాఫ్రికాతో 0-2తో వైట్ వాష్. ఈ ఏడాదిన్నర కాలంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి రీ ఎంట్రీ చాన్సే లేదు. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 6వ స్థానానికి పడిపోయింది. దీంతోనే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్ పనితీరుపై తీవ్ర విమర్శలు రాసాగాయి. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవి నుంచి (టెస్టులకు) అతడిని తప్పిస్తారనే ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. వాస్తవానికి పదిపదిహేను రోజుల కిందటనే ఈ మేరకు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అంతా గప్ చుప్. తాజాగా అనూహ్యంగా టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి చర్చనీయం అయింది. గౌతమ్ గంభీర్ స్థానంలో టెస్టులకు కొత్త కోచ్ ను నియమిస్తారనే కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు హైదరాబాదీ స్టయిలిస్ట్ బ్యాట్స్ మన్ ను సంప్రదించారని తెలుస్తోంది.
వెరీ వెరీ స్పెషల్ చేతిలో?
వీవీఎస్ లక్ష్మణ్.. పరిచయం అక్కర్లేని భారత క్రికెటర్. లక్ష్మణ్ ఇప్పటికే అండర్ 19 జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. తన సేవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేశానికి అందిచేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు లక్ష్మణ్ ను గంభీర్ స్థానంలో టెస్టు ఫార్మాట్ కు కోచ్ గా నియమించే అంశం వైరల్ అవుతోంది. వీవీఎస్ తో బీసీసీఐ అధికారి ప్రవేటుగా ఇదే ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. అయితే, వన్డేలు, టి20లకు గంభీర్ ను కొనసాగిస్తూనే టెస్టులకు లక్ష్మణ్ ను కోచ్ గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గంభీర్ వచ్చాక పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో టీమ్ఇండియా మెరుగ్గానే ఆడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లు గెలిచింది. కానీ, టెస్టుల్లోనే విఫలం అవుతోంది.
అతడికి ప్లస్.. ఇతడికి మైనస్..
వందకు పైగా టెస్టులు ఆడిన రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ ది. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉన్న సమయంలోనే వారితో మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఇక గంభీర్ కు టెస్టుల్లో అంత గొప్ప రికార్డు లేదు. ఓపెనర్ గా కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. టి20, వన్డేల్లో మాత్రం గొప్ప బ్యాటర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే రికార్డు వీరిద్దరి విషయంలో ప్రస్తావనకు వస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 0-2తో కోల్పోయాక వీవీఎస్ ను బీసీసీఐ అధికారి కలిశారని.. టెస్టు కోచ్ పదవిని ఆఫర్ చేశారని అంటున్నారు. ఐతే, ఇది అనధికార ప్రతిపాదనే.
దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ వైదొలగాక మొదట హెడ్ కోచ్ పదవి వీవీఎస్ లక్ష్మణ్ వద్దకే వచ్చింది. కానీ, అతడు బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అధిపతిగా ఉండేందుకే మొగ్గుచూపాడు. ఇప్పుడు బోర్డు పట్టుబడితే ఏం చేస్తాడో చూడాలి.
-గంభీర్ హెడ్ కోచ్ పదవీ కాలం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. అయితే, ఫిబ్రవరి-మార్చిలో జరిగే టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా ప్రదర్శన సరిగా లేకుంటే ఏం జరుగుతుందో చూడాలి. పైగా టీమ్ ఇండియా వచ్చే ఏడాది జూలైలో (శ్రీలంక టూర్) టెస్టు ఆడనుంది. అంటే.. టెస్టు కోచ్ పదవిని తేల్చేందుకు చాలా సమయం ఉంది.
