125 కోట్లు కాదు.. 51 కోట్లు.. మహిళల జట్టుకు బీసీసీఐ నజరానా
మహిళల జట్టుకు ఇప్పుడు ప్రైజ్ మనీ రూ.39 కోట్లతో పాటు రూ.51 కోట్లు (మొత్తం రూ.90 కోట్లు) రానున్నట్లు అయింది.
By: Tupaki Political Desk | 3 Nov 2025 5:03 PM ISTమహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు ఎంత ప్రైజ్ మనీ దక్కనుంది..? అది కూడా సొంతగడ్డపై జరిగిన మెగా టోర్నీలో విజయవంతమైనందున ఏమైనా బొనాంజా ఉంటుందా.?? మరి గత ఏడాది టి20 ప్రపంచ కప్ నెగ్గిన పురుషుల జట్టుకు సమానంగా బీసీసీఐ మహిళలకూ డబ్బులు ఇస్తుందా.?? గత రెండు రోజులుగా ఇవే ఊహాగానాలు.. కొందరు అడుగు ముందుకు వేసి మరీ.. బీసీసీఐ టీమ్ ఇండియా మహిళల జట్టుకు ఏకంగా రూ.125 కోట్లు ఇస్తుందని కథనాలు కూడా వచ్చాయి. ఈ మొత్తం నిరుడు టి20 ప్రపంచ కప్ నెగ్గిన పురుషుల జట్టుకు ఇచ్చిన మొత్తం కావడం గమనార్హం. అయితే, అంత కాదు కానీ.. మన అమ్మాయిలకు భారీగానే నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఇది మెగా టోర్నీ టైటిల్ గెలిచినందుకు ఇచ్చే రూ.39 కోట్ల ప్రైజ్ మనీకి అదనం కావడం విశేషం.
ఆ తర్వాత ఇదే తొలి టైటిల్..
ఇటీవలి కాలంలో చూస్తే... 2024లో పురుషుల టి20 ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత టీమ్ ఇండియాకు ఇదే తొలి వరల్డ్ టైటిల్. అందులోనూ మహిళలు తొలిసారి ప్రపంచ చాంపియన్లు అయ్యారు. కాబట్టే వీరికి బీసీసీఐ నుంచి నజరానా భారీగా ఉంటుందని, పురుషులతో సమానంగానూ ఇస్తారని ఊహించారు. తాజాగా బీసీసీఐ ప్రకటన ప్రకారం.. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టుకు రూ.51 కోట్లు బహుమతి ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని ప్లేయర్లు, కోచ్ లు, జట్టు సహాయక సిబ్బందికి అందజేస్తారు.
మొత్తం రూ.90 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయా?
మహిళల జట్టుకు ఇప్పుడు ప్రైజ్ మనీ రూ.39 కోట్లతో పాటు రూ.51 కోట్లు (మొత్తం రూ.90 కోట్లు) రానున్నట్లు అయింది. అయితే, బీసీసీఐ ప్రోత్సాహకం కాక.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా నజరానాలు ప్రకటిస్తాయేమో చూడాలి. ఎందుకంటే.. ప్రపంచ కప్ అందులోనూ మహిళలు తొలిసారి చాంపియన్లుగా నిలిచారు. అసలు నెల కిందట ఇది ఊహించని పరిణామం. ఏడుసార్లు కప్ నెగ్గిన ఆస్ట్రేలియా, నాలుగుసార్లు గెలిచిన ఇంగ్లండ్ లలో ఏదో ఒకటి టైటిల్ కొడుతుందని.. మన జట్టు సెమీస్ చేరితే గొప్ప అని భావించారు. అలాంటిది అమ్మాయిలు పెద్ద అద్భుతమే చేశారు.
ఇది కచ్చితంగా గొప్ప సంచలనమే. అందుకని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటిస్తాయని ఆశించవచ్చు. మరోవైపు తమతమ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లకు వ్యక్తిగతంగానూ అవార్డులు, రివార్డులు ఇవ్వడం కొనసాగుతోంది. ఈ లెక్కన జట్టు ప్రపంచ కప్ గెలిచినందుకు వచ్చే మొత్తంతో పాటు వ్యక్తిగతంగానూ అమ్మాయిలకు భారీగా డబ్బు సమకూరనుంది. ఇక చాంపియన్లకు చాంపియన్ జట్టులోని సభ్యులుగా నిలిచినందుకు వివిధ ఎండార్స్ మెంట్ల రూపంలో అవకాశాలు దక్కడం ఖాయం.
