ప్రపంచకప్ ల బాయ్ కాట్ కొత్తేమీ కాదు.. భారత్ కు మాత్రం కొత్తనే!
టి20 వరల్డ్ కప్ కోసం వచ్చే తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని బంగ్లా ఆరోపిస్తోంది. వాస్తవానికి.. దాని ఆక్రోశం ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించడమే.
By: Tupaki Political Desk | 26 Jan 2026 12:00 PM ISTబంగ్లాదేశ్ తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకుంటూ.. భారత్ వంటి ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలమైన దేశంతో లొల్లి పెట్టుకుంది. స్వదేశంలో హిందువులపై దాడులను అరికట్టలేక.. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పించారన్న కోపంతో భారత్ లో జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ల వేదికలను మార్చాలని పట్టుబట్టింది. చివరకు టోర్నమెంటు వచ్చేందుకు మొరాయించి, తన స్థానాన్ని స్కాట్లాండ్ కు కోల్పోయింది. తద్వారా భారత క్రికెట్ తో భవిష్యత్ సంబంధాలను చెడగొట్టుకుంది. బంగ్లా రాకపోతే భారత్ కు వచ్చే నష్టం ఏమీ లేదు.
కానీ, బంగ్లాకే భారీగా చిల్లు అని స్పష్టమైంది. కాగా, ప్రపంచ కప్ ను బంగ్లా బాయ్ కాట్ చేసింది అనేకంటే తన గొయ్యి తానే తవ్వుకుంది అనడం సరైనది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో బాయ్ కాట్ లు కొత్త కాదు. భారత్ ను కార్నర్ చేస్తూ బాయ్ కాట్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావట్టి దీనిని భారత క్రికెట్ కంట్రోలో బోర్డు (బీసీసీఐ) అంత తేలిగ్గా వదలుతుందని అనుకోవద్దు.
భద్రతా కారణాలు కానే కాదు
టి20 వరల్డ్ కప్ కోసం వచ్చే తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని బంగ్లా ఆరోపిస్తోంది. వాస్తవానికి.. దాని ఆక్రోశం ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించడమే. అతడిని బలి పశువును చేస్తూ ఏకంగా ప్రపంచ కప్ నే బహిష్కరించింది. అయితే, ప్రపంచ కప్ మ్యాచ్ లను ఫలానా దేశంలో ఆడలేం అంటూ గతంలో కొన్ని జట్లు పట్టుపట్టాయి కానీ, మొత్తానికే బహిష్కరించలేదు. ఇలాచూస్తే 1996లో శ్రీలంకలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ల గురించి చెప్పుకోవాలి.
వన్డే వరల్డ్ కప్ లో...
1996 వన్డే ప్రపంచ కప్ ను భారత్-పాకిస్థాన్-శ్రీలంక ఉమ్మడిగా నిర్వహించాయి. దీనికిముందే ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. లంక జట్టు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్ పై ఆసీస్ క్రికెటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలోనే 1996 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తమ మ్యాచ్ ను లంకలో ఆడాల్సి వచ్చింది. కానీ, ఎల్టీటీఈ దాడులను సాకుగా చూపుతూ వెళ్లేందుకు నిరాకరించింది. అనూహ్యంగా వెస్టిండీస్ కూడా నాడు లంకలో మ్యాచ్ లు ఆడలేదు. ఈ రెండు మ్యాచ్ ల పాయింట్లు లంక ఖాతాలో చేరాయి. చివరకు ఫైనల్లో శ్రీలంక ఏకంగా ఆస్ట్రేలియానే ఓడించి టైటిల్ కొట్టింది.
-2003 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా-జింబాబ్వే-కెన్యా నిర్వహించాయి. జింబాబ్వే వెళ్లేందుకు ఇంగ్లండ్ నిరాకరించింది. దీనికి ప్రతీకారంగా ఇంగ్లండో జరిగిన 2009 టి20 ప్రపంచకప్ ను జింబాబ్వే బహిష్కరించింది. ఇక 2003లోనే కెన్యా రాజధాని నైరోబీలో ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు నిరాకరించింది.
భారత్ ఎక్కడ ఆడితే అక్కడే టోర్నీ..
గత ఏడాది ఏప్రిల్ లో పెహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడులు చేశాక భారత్-పాక్ క్రికెట్ సంబంధాలు మరింత క్షీణించాయి. సెప్టెంబరులో పాకిస్థాన్ లో జరిగిన ఆసియా కప్ లో ఆడేందుకు భారత్ ససేమిరా అని చెప్పింది. దీంతో మ్యాచ్ లను దుబాయ్ లో ఆడింది. పాకిస్థాన్ జట్టు కూడా అక్కడికే వచ్చి ఆడింది. చివరకు భారత్ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పాక్ ను ఓడించి టైటిల్ కొట్టింది.
-కాగా, అండర్ 19 ప్రపంచ కప్ లోనూ బాయ్ కాట్ కల్చర్ ఉంది. 2016లో ఆస్ట్రేలియా జట్టు భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ లో ఆడేందుకు నిరాకరించింది. దీంతో నాడు ఐర్లాండ్ కు చాన్స్ వచ్చింది.
