భారత్ లో నెలలో టి20 ప్రపంచ కప్.. బంగ్లాదేశ్ బహిష్కరిస్తుందా?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సూచన మేరకు.. ఆ దేశ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచ కప్ లో తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరితే ఏం జరుగుతుందో చూడాలి.
By: Tupaki Political Desk | 4 Jan 2026 4:05 PM ISTబంగ్లాదేశ్ లో హిందువులను టార్గెట్ గా చేసుకుని చెలరేగుతున్న హింస కారణంగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి ఆ దేశ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను విడుదల చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించడం ఇతర పరిణామాలకు దారితీసేలా కనిపిస్తోంది. సరిగ్గా నెల రోజుల్లో భారత్ లో టి20 ప్రపంచకప్ మొదలు కానుండగా... కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మినీ వేలంలో రూ.9.20 కోట్లకు దక్కించుకున్న ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ లో ఆడించొద్దని భావించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్ లో టి20 ప్రపంచ కప్ జరగనుంది. ఇందులో బంగ్లాదేశ్ ఆడే నాలుగు మ్యాచ్ లు భారత్ లోనే ఉన్నాయి. ఫిబ్రవరి 7న కోల్ కతాలో వెస్టిండీస్, 9న ఇటలీ, 14 ఇంగ్లండ్ తో, 17న ముంబైలోని వాంఖడేలో నేపాల్ తో బంగ్లా మ్యాచ్ లు జరగాల్సి ఉంది. కానీ, భారత్ తో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సూచనలు చేసింది. బంగ్లా మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరాలని పేర్కొంది.
ఇప్పటికే పాక్ మ్యాచ్ లంకలో..
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు గత ఏడాది ఏప్రిల్ లో పెహల్గాంలో భారత పర్యటకులపై దాడి చేసి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని భారత్ భావించింది. ఇప్పటికే దాదాపు 14 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అయితే, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తప్పదు కాదు భారత్.. పాక్ తో ఆడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో ఆసియా కప్ లో భారత్ తలపడింది. కానీ, పాక్ ఆటగాళ్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఆసియా కప్ ను పాకిస్థాన్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి తీసుకోలేదు. మహిళల క్రికెట్, అండర్ 19 దశలోనూ పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ లు లేవు. ఇక టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకకు తరలించారు.
ఐసీసీ ఏం చేస్తుందో?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సూచన మేరకు.. ఆ దేశ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచ కప్ లో తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరితే ఏం జరుగుతుందో చూడాలి. కానీ, నాలుగు మ్యాచ్ లను ఈ సమయంలో లంకకు మార్చడం సాధ్యమేనా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక తమ క్రికెటర్ కాంట్రాక్టు పొందినప్పటికీ.. లీగ్ లో ఆడలేకపోవడాన్ని బంగ్లా క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టి20 ప్రపంచ కప్ మాత్రం ఎలా ఆడతామని.. తమ ఆటగాళ్లకు భద్రత కల్పిస్తామని బీసీసీఐ స్పష్టం చేయాలని కోరుతున్నారు.
మార్పు సాధ్యం కాదు..
ప్రపంచ కప్ మరో నెల రోజులు మాత్రమే ఉన్నందున ఈ సమయంలో బంగ్లా మ్యాచ్ లను లంకకు మార్చడం సాధ్యం కాదని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. లాజిస్టిక్స్ నుంచి ప్రయాణాల వరకు పలు ఇబ్బందులు ఎదురవుతాయని .. బంగ్లాదేశ్ తో ఆడాల్సిన జట్ల విషయం కూడా ఆలోచించాలని సూచిస్తోంది. ప్రపంచ కప్ లీగ్ దశలో రోజుకు మూడు మ్యాచ్ లలో ఒకటి లంకలో జరుగుతుంది. ఇప్పుడు బంగ్లా కూడా తమ మ్యాచ్ లను లంకలో జరపాలని కోరితే షెడ్యూల్ మొత్తం మార్చాల్సి ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ మ్యాచ్ ల మార్పు లేనట్లే.
బహిష్కరిస్తే...?
భారత్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడొద్దని భావించి బంగ్లా... టోర్నీ మొత్తాన్ని బహిష్కరిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పటికి అయితే అంత సాహసం బంగ్లా చేస్తుందని భావించలేం. కాకపోతే.. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చెప్పలేం..! భారత్ లో మ్యాచ్ లు ఆడొద్దని బంగ్లా గట్టిగా తలచుకుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.
