ముదురుతున్న క్రికెట్ వివాదం.. బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాల బ్యాన్!
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది.
By: Tupaki Entertainment Desk | 5 Jan 2026 9:00 PM ISTభారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. తమ దేశంలోని మైనారిటీలైన హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఆస్తుల ధ్వంసానికి పాల్పడడంతో పాటు ఇద్దరు, ముగ్గురిని ఆందోళనకారులు హతమార్చారు. ఈ నేపథ్యంలో భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ రూ.9.20 కోట్లకు దక్కించుకున్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పై పడింది. అతడిని విడుదల చేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)... కేకేఆర్ ను ఆదేశించింది. దీనిపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిలిపివేయాలని నిర్ణయించింది.
ప్రపంచ కప్ నకు రానట్టేనా?
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్-శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న టి20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పాల్గొంటుందా...? ముస్తాఫిజుర్ ను కేకేఆర్ విడుదల చేసిన అంశంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బంగ్లా ప్రభుత్వం.. భారత్ లో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని కోరింది. అది జరగడం కాస్త కష్టమైన పనే అయినా.. ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈలోగానే బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది.
ఆ నిర్ణయం మమ్మల్ని బాధించింది...
ముస్తాఫిజుర్ ఉదంతాన్ని మనసులో పెట్టుకుని.. ఈ పరిస్థితుల్లో భారత్ లో టి20 ప్రపంచ కప్ ఆడలేమని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. అందుకని వచ్చే నెల 7 నుంచి జరిగే తమ టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లను శ్రీలంకలో జరపాలని కోరుతోంది. ఇప్పుడు మార్చి 26 నుంచి జరిగే ఐపీఎల్ మీద కూడా ఆగ్రహంగా ఉండడం గమనార్హం. దీన్ని చూస్తుంటే భారత్ మీద ఆ దేశ ప్రభుత్వం ఎంతటి ఆగ్రహంతో ఉందో తెలుస్తోంది. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి పక్కనపెట్టడానికి సరైన కారణాలు లేవని బంగ్లా తాజాగా పేర్కొంది. ఈ నిర్ణయం తమ దేశ ప్రజలను బాధించిందని.. అందుకే తదుపరి నిర్ణయం తీసుకునేవరకు బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
