ఆసియా కప్ దొంగ నఖ్వీకి నవంబరులో మూడినట్లే.. బీసీసీఐ సీరియస్
గత నెలలో ఆసియా కప్ ముగిసిన రెండో రోజు.. మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి నఖ్వీ వర్చువల్ గా హాజరయ్యాడు.
By: Tupaki Political Desk | 21 Oct 2025 10:00 PM ISTటి20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ ముగిసి మూడు వారాలు దాటింది.. ఆ టోర్నీ తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా కూడా వెళ్లింది.. ఒక వన్డే కూడా ఆడేసింది.. కానీ, ఇప్పటివరకు ఆసియా కప్ ట్రోఫీ భారత్ చేతికి రాలేదు. దీనివెనుక కారణం అందరికీ తెలిసిందే..! ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాక్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన మొహిసిన్ నఖ్వీ. పాక్ క్రికెట్ జట్టును భ్రష్టుపట్టిస్తున్న నఖ్వీ.. పెహల్గాంపై ఆ దేశ ఆటగాళ్ల అతి సంబరాలకు ఆసియా కప్ టోర్నీలో మద్దతు పలికాడు. దీంతో ఆ పాపిష్టి చేతుల మీదుగా కప్ తీసుకోవడానికి ఫైనల్ అనంతరం టీమ్ ఇండియా నిరాకరించింది. ఇది జరిగి మొన్నటి ఆదివారంతో మూడు వారాలు దాటింది.
ఇంతకూ కప్ ఎక్కడ ఉంది..?
ఇంతకూ ఆసియా కప్ ఎక్కడ ఉంది..? ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షాక్ ఇవ్వడంతో నఖ్వీ దిమ్మ తిరిగింది. ఆసియా కప్ ను తనతో పాటే దుబాయ్ లోని హోటల్ రూంకు తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ ఉంచాడో కొంత సేపు తెలియరాలేదు. ఇప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కార్యాలయంలో కప్ ఉన్నట్లుగా సమాచారం. అయితే, దీనిని తన అనుమతి లేకుండా ఎవరికీ ఇవ్వొద్దని నఖ్వీ ఆదేశాలు ఇచ్చాడు. దీంతో మూడు వారాలుగా అక్కడే మగ్గుతోంది.
సరిగ్గా 3 వారాల కిందట...
గత నెలలో ఆసియా కప్ ముగిసిన రెండో రోజు.. మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి నఖ్వీ వర్చువల్ గా హాజరయ్యాడు. అప్పుడు కప్ అప్పగించాలని బీసీసీఐ గట్టిగా డిమాండ్ చేసింది. కానీ, అతడు డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చాడు. కప్ ను టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తీసుకోవాలని కోరాడు. అదేమీ నీ సొత్తు కాదని బీసీసీఐ మండిపడడంతో నోరు మూశాడు.
నవంబరులో ముహూర్తం
వచ్చే నెల మొదటి వారంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం జరగనుంది. అందులో నఖ్వీ తీరును దులిపేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ట్రోఫీని తిరిగివ్వాలని లేదంటే నీకు మూడినట్లేనని నఖ్వీని హెచ్చరించింది. ఇప్పుడు ఐసీసీ సమావేశంలో తాడోపేడో తేల్చుకుంటామని నఖ్వీకి మెయిల్ పెట్టింది. అతడి నుంచి సమాధానం బట్టి నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితిని వివరిస్తూ ఐసీసీకి మెయిల్ చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
కొసమెరుపుః ఏవిధంగా చూసినా నఖ్వీకి ఈసారి గూబ గుయ్ మనడం ఖాయం. ఎందుకంటే.. ఐసీసీ చైర్మన్ భారతీయుడైన జై షా కాబట్టి.
