గుంట నఖ్వి.. ఆసియా కప్ ఎక్కడ దాచాడో..? పాక్ కు పట్టుకెళ్తాడా?
దుబాయ్ లో మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో ఆసియా కప్ ట్రోఫీ సంగతి ప్రధానంగా ప్రస్తావనకు రావడం ఖాయం.
By: Tupaki Political Desk | 30 Sept 2025 1:24 PM ISTఆసియా కప్ ఫైనల్ ముగిసి రెండో రోజు గడుస్తోంది.. ఇప్పటివరకు విజేత టీమ్ ఇండియాకు ట్రోపీ చేతికి రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు టీమ్ ఇండియా నిరాకరించింది. దీంతో కాసేపు చూసిన నఖ్వీ దుబాయ్ స్టేడియం గ్రౌండ్ నుంచి ట్రోఫీని, విజేత మెడల్స్ ను ఎత్తుకెళ్లాడు. అతడు ఉండే హోటల్ కు వీటిని తీసుకెళ్లినట్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో గ్రౌండ్ లో కప్ కథ ముగిసినా.. గ్రౌండ్ బయట మాత్రం డ్రామా నడుస్తోంది.
క్రికెట్ లో అరుదైన వింత ఇదొకటి...
క్రికెట్ ఎన్నో వింతలు చూసింది. కానీ , ఇది మాత్రం వింతల్లో కెల్ల వింత అని చెప్పుకోవాలి. ఒక జట్టుకు దక్కాల్సిన ట్రోఫీని.. వివిధ కారణాలతో వారు ముగింపు వేడుకల సందర్భంగా తీసుకోకున్నా, ఆ జట్టుకు చేరవేయడం గౌరవప్రదం. కానీ, భారత జట్టు ట్రోఫీని తన నుంచి అందుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీకి కడుపు మండింది. దీంతో పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అయిన నఖ్వీని ఈ విషయంలో నిలదీసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సిద్ధమైంది. ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయానికి పంపాల్సిందిగా నఖ్వీని కోరింది. ఈ కార్యాలయం దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఉంది. కానీ, ఇప్పటివరకు అతడు ఆ పని చేయలేదు.
నేడు తేలుతుందా....? నఖ్వీకి ఎసరు..
దుబాయ్ లో మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో ఆసియా కప్ ట్రోఫీ సంగతి ప్రధానంగా ప్రస్తావనకు రావడం ఖాయం. అంతేకాక నవంబరులో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సమావేశంలోనూ దీనిని లేవనెత్తే అవకాశం ఉంది. కాగా, భారత జట్టు ట్రోఫీ అందుకుంటుందని దింపుడు కళ్లెం ఆశతో చివరి వరకు చూసిన నఖ్వీ.. చివరకు అది జరిగే పని కాదని తెలిసి పోడియం దిగి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో నఖ్వీని ఏసీఏ పదవి నుంచి తప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.
అసలు ఎక్కడున్నాడు...?
నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని పతకాలను తనతో పాటు హోటల్ రూమ్ కు తీసుకెళ్లాడు. మరి ఒకటిన్నర రోజుగా ఎక్కడ దాచాడన్నది తెలియడం లేదు. ఒకవేళ తనతోపాటు పాకిస్థాన్ కు తీసుకెళ్లాడా..? ఆ దేశ జాతీయ మంత్రి కాబట్టి అతడికి విమానాశ్రయాల్లో పెద్దగా తనిఖీలు ఉండవు. కాబట్టి అలాంటి పని ఏదైనా చేశాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, అందుకు పెద్దగా అవకాశాలు లేవు. అదే పని చేస్తే గనుక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరింత ఇబ్బందుల్లో పడినట్లే. అంతర్జాతీయంగానూ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది.
