భారత్ నెగ్గి వారం..ఆసియా కప్ ఎత్తుకెళ్లిన నఖ్వీకి గోల్డ్ మెడల్
మొహిసిన్ నఖ్వీని పాకిస్థాన్ లో మీడియా మొఘల్ అంటారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న అతడు ఈ ఏడాది ఏప్రిల్ లో ఏసీఏ అధ్యక్షుడు అయ్యాడు.
By: Tupaki Entertainment Desk | 5 Oct 2025 5:01 PM ISTటీమ్ ఇండియా ఆసియా కప్ ఫైనల్లో గెలిచి 8 రోజులు అవుతోంది. గత ఆదివారం జరిగిన తుది సమరంలో మన జట్టు గెలిచాక ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆ దేశ మంత్రి కూడా అయిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నుంచి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు దుబాయ్ లోని హోటల్ కు తీసుకెళ్లిపోయాడు. అప్పటినుంచి కప్ ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదు. మంగళవారం జరిగిన ఏసీఏ సమావేశంలో వర్చువల్ పాల్గొన్న నఖ్వీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు శుక్లా నిలదీసినప్పటికీ ట్రోఫీ ఇంతవరకు అప్పగించలేదు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తన నుంచి ట్రోఫీ తీసుకెళ్లాలని కోరాడు. దీనికి బీసీసీఐ ససేమిరా అని చెప్పింది.
ఇంతకూ ఎక్కడ దాచాడు?
ఆసియా కప్ ట్రోఫీ భారత్ కు వచ్చేది ఎలా...? నఖ్వీ అప్పగించేది ఎప్పుడు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని దుబాయ్ లో యూఏఈ క్రికెట్ బోర్డు కార్యాలయంలో ఉంచుతానని, అక్కడినుంచి తీసుకెళ్లాలని చెప్పినట్లు కథనాలు వచ్చాయి. కానీ, అదేమీ జరగలేదు. అసలు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన నఖ్వీ చేతులు తాకిన ట్రోఫీ భారత్ కు అవసరమా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
మంత్రే కాదు.. మీడియా అధిపతి కూడా
మొహిసిన్ నఖ్వీని పాకిస్థాన్ లో మీడియా మొఘల్ అంటారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న అతడు ఈ ఏడాది ఏప్రిల్ లో ఏసీఏ అధ్యక్షుడు అయ్యాడు. తాజాగా ఆసియా కప్ లో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ఆరు ఫైటర్ జెట్ ల సంకేతానికి 30 శాతం మ్యాచ్ ఫీజు ఎదుర్కొన్నాడు. ఈ ఫీజును తానే కడతానని నఖ్వీ చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి. ఫైనల్ అనంతరం ట్రోఫీని నఖ్వీ తనతో తీసుకెళ్లడంతో వివాదం మరింత ముదిరింది.
ఇప్పుడు మళ్లీ నఖ్వీ ప్రస్తావన ఎందుకు అంటే... అతడికి గోల్డ్ మెడల్ వచ్చిందట.
కప్ ఎత్తుకెళ్లినందుకు బహుమానం...?
పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో పేరిట ఏర్పాటు చేసిన ఎక్స్ లెన్స్ గోల్డ్ మెడల్ ను నఖ్వీకి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడిగా ఈ అవార్డు ఇస్తున్నారట. కరాచీలో జరిగే వేడుకలో అవార్డును నఖ్వీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. జుల్ఫికర్ అలీ భుట్టో మాజీ ప్రధాని తండ్రి, ప్రస్తుత పాకిస్థాన్ మంత్రివర్గంలో నఖ్వీకి సహచరుడు అయిన బిలావల్ భుట్టోకు తాత. పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీకి మామ.
కాగా భారత్ కు ట్రోఫీ అప్పగించకపోవడంపై క్రీడా వర్గాలు నఖ్వీని తీవ్రంగా తప్పబడుతున్నాయి. పాకిస్థాన్ లో మాత్రం అతడిని భారత్ కు తలవంచని నాయకుడిగా కీర్తిస్తుండడం గమనార్హం.
