వందపైగా వెండితెరలపై ఆసియాకప్ ఫైనల్.. అభిమానులూ పండుగ చేస్కోండి
ఈ నేపథ్యంలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాక్ తో ఆడడం అవసరమా? అనే స్థితి నుంచి... రెండు వారాల కిందట మ్యాచ్ మొదలైంది.
By: Tupaki Entertainment Desk | 27 Sept 2025 10:00 PM ISTసరిగ్గా ఐదు నెలల కిందట ఇదే రోజుల్లో పెహల్గాంలో భారత పర్యాటకులపై పాకిస్థాన్ అండదండలు ఉన్న ఉగ్రవాద మూకల దాడి... ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ తో పాటు వారి ఆటకట్టు.. అప్పటినుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు...! ఈ క్రమంలో వచ్చింది ఆసియా కప్. అందులోనూ పాకిస్థాన్ తో ఒకే గ్రూప్ లో ఉంటూ టోర్నీలో గరిష్ఠంగా మూడుసార్లు ఆడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాక్ తో ఆడడం అవసరమా? అనే స్థితి నుంచి... రెండు వారాల కిందట మ్యాచ్ మొదలైంది.
షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. షేక్ చేశారు
ఆసియా కప్ లో అన్ని విదేశీ జట్ల ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ లు ఇస్తూ.. మ్యాచ్ ముగిశాక కూడా వారితో మాట్లాడుతున్న భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు, ఇతర ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. మిగతా భారత ఆటగాళ్లూ ఇంతే. దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్న పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ తర్వాత మ్యాచ్ రిఫరీ మీద ఏడుపు మొదలుపెట్టింది. సూపర్ 4 మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్ల వెకిలి చేష్టలు శ్రుతిమించాయి. ఇప్పుడు ఇక మూడోసారి ఫైనల్లో తలపడనున్నాయి.
అసలే ఆదివారం.. ఆపై వెండితెరపై...
ఉద్రిక్తతలు, వివాదాల నడుమ సాగుతున్న ఆసియా కప్ లో ఫైనల్ ను అది కూడా భారత్ -పాక్ మ్యాచ్ ను వెండితెరపై చూస్తే ఆ మజానే వేరు కదా..? ఇప్పుడు ఈ ఆలోచనే చేసింది పీవీఆర్ ఐనాక్స్. కేవలం రెండు వారాల్లో మూడోసారి అదీ ఆదివారం తలపడుతున్న భారత్-పాక్ మ్యాచ్ ను దేశవ్యాప్తంగా వందకుపైగా థియేటర్ లలో లైవ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాహాళ్లు ఎంపికచేసినవి మాత్రమే. సినిమాలకు తరహాలోనే దీనికి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
అభిమానులకు పండుగే...
అసలే ఆసియా కప్ లో టీమ్ ఇండియా జోరు మీద ఉంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరింది. ఈ క్రమంలో ఆదివారం కూడా మనదే గెలుపు అని.. కప్ మనదే అని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది మ్యాచ్ సమయంలో, విజయం అనంతరం కావాల్సిన సరుకు-సరంజామాను సిద్ధం చేసుకున్నారు. అలాంటివారికి సినిమా హాళ్లలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ చూడనుండడం పెద్ద పండుగే. అంటే.. దసరా ముందే వచ్చిందన్నట్లు.
