Begin typing your search above and press return to search.

ఎవరీ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ?

ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్టు పెట్టేందుకు కారణమైనోడు, మన తెలుగోడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.

By:  Garuda Media   |   29 Sept 2025 5:29 PM IST
ఎవరీ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ?
X

అత్యంత కీలక మ్యాచ్. అందునా ఆసియా కప్ ఫైనల్. అది కూడా దాయాది పాక్ తో తలపడే వేళ.. ఎంతటి ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతకు ముందు మ్యాచ్ లలో అదరగొట్టిన బ్యాటర్లు తక్కువ స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టిన తరుణంలో.. భారత క్రీడాభిమానులు ఆసియా కప్ మీద ఆశలు వదులుకుంటున్న వేళ.. గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. మ్యాచ్ ను నిలబెట్టి..చివరి వరకు క్రీజ్ లో ఉండి.. భారత్ కు ఆసియా కప్ దక్కేలా చేయటమే కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఎక్స్ ఖాతాలో ‘‘మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు’’ అంటూ పోస్టు పెట్టేందుకు కారణమైనోడు, మన తెలుగోడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.

2002 నవంబరు ఎనిమిదిన హైదరాబాద్ లోని పుట్టిన తిలక్ వర్మ తల్లిదండ్రులు నంబూరి నాగరాజు.. గాయత్రిదేవి. చందానగర్ లోని పేజీఆర్ స్టేడియంలో కోచ్ సలాం బయాష్ వద్ద శిక్షణ తీసుకున్న అతను..

లింగంపల్లిలోని క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. తిలక్ వర్మ తండ్రి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికి కొడుక్కి క్రికెట్ అంటే ఇష్టమన్న ఉద్దేశంతో అతడ్ని ఎంతగానో ప్రోత్సహించాడు. తమ కష్టాలు తెలీకుండా డబ్బులు పోగు చేసి స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించాడు.

ఇక్కడే కోచ్ సలామ్ బయాష్ గురించి ప్రస్తావించాలి. తిలక్ వర్మ టాలెంట్ ను గుర్తించిన సలాం అతడ్ని ప్రోత్సహించటమే కాదు.. స్టార్ క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ప్రోత్సహించాడు. అందులో భాగంగా కోచింగ్ ఫీజును కూడా తీసుకోకుండా అతడికి శిక్షణ ఇచ్చాడు. అంతేకాడు.. ఆయనే తన బైక్ మీద తిలక్ ను తీసుకొచ్చేవాడు. తెల్లవారుజామున క్రికెట్ ప్రాక్టీస్ కోసం 40 కి.మీ. బైక్ మీద వెళ్లే వేళలో.. వెనక కూర్చునే తిలక్ వర్మ నిద్రపోయేవాడు. మధ్యలో చాలాసార్లు బైక్ ఆపి నీళ్లతో ముఖం కడిగే పరిస్థితి.

ఇలా పడిన కష్టానికి ప్రతిఫలంగా పదహారేళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ అవకాశం దక్కింది. 2018-19 రంజీ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో అందరి కంట్లో పడిన అతను.. అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2020 అండర్ 19 ప్రపంచ కప్ భారత జట్టులోనూ చోటు దక్కించుకోవటం ద్వారా.. తన సత్తా చాటాడు. బంగ్లాదేశ్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో సత్తా చాటటం ద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల కంట్లో పడిన అతను.. 2002లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్ తో ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చాడు.

2023లో రూ.1.7 కోట్ల పలికన అతను.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాదు ముంబయి తరఫు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఆ టాలెంట్ అతడ్ని టీమిండియాకు సెలక్టు అయ్యేలా చేసింది. 2025లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ అతడ్ని రూ.8 కోట్లకు సొంతం చేసుకుండి. 2025 జూన్ లో అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచ్ లో 29 బంతుల్లో 44 పరుగులు చేశాడు తిలక్ వర్మ.

ఐదు అడుగుల పదకొండు అంగుళాల పొడవున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సత్తా మరోసారి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆసియా కప్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకే అలౌట్ కావటం.. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు బంతులు ఉండగానే విజయం సాధించటం తెలిసిందే. అయితే.. ఈ విజయం ఊరికే సొంతం కాలేదు. మొదటి ఐదు ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లు పడి.. మ్యాచ్ మీద గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ.. క్రీజ్ లోకి వచ్చిన వేళ తన అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో మూడు ఫోర్లు.. నాలుగు సిక్సులతో కలిసి 69 పరుగులు చేయటం ద్వారా తన సత్తా చాటారు. తన బ్యాటింగ్ సత్తాతో మరోసారి వార్తల్లో నిలిచారు.