ఇండియాలో తొలిసారి ఆర్చరీ ప్రీమియర్ లీగ్..పూర్తీ వివరాలు!
ఈ మధ్యకాలంలో మన దేశంలో క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Madhu Reddy | 19 Sept 2025 10:54 AM ISTఈ మధ్యకాలంలో మన దేశంలో క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య ప్రతి క్రీడలో యువతను ప్రోత్సహిస్తూ కేంద్రం ముందడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తొలిసారి మన ఇండియాలో "ఆర్చరీ ప్రీమియర్ లీగ్" కు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని జాతీయ ఆర్చరీ అసోసియేషన్ గురువారం అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. జాతీయ ఆర్చరీ అసోసియేషన్ అరంగేట్రం ఎడిషన్ న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు జరగనుంది. ఈ లీగ్ లో ఆతిథ్య భారత్ లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లు కూడా పోటీ పడబోతున్నారు. ముఖ్యంగా మన దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలంపిక్ మూమెంట్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ లీగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
లీగ్ విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 36 మంది భారత టాప్ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు కూడా పోటీ పడనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా రికర్వ్ , కాంపౌండ్ విభాగాలలో ఆర్చర్లు పోటీపడతారు. ఇకపోతే మన ఇండియా నుండి స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, అతాను దాస్, బొమ్మదేవర ధీరజ్, దీపికా కుమారి ఇలా పలువురు ఆర్చర్లు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన చిట్టి బొమ్మ జిజ్ఞాస్, మాదాల సూర్య హంసిని, తెలంగాణ అమ్మాయి తనపర్తి చికిత కూడా ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
పూర్తి వివరాల విషయానికి వస్తే... ఒక్కో జట్టులో మొత్తం నలుగురు మహిళలు, నలుగురు పురుషులు.. 8 మంది ఉంటారు..ఇందులో ఇద్దరు విదేశీయులు.. ఆరుగురు భారత ఆర్చర్లు ఉంటారు. విదేశీల్లో ఒక పురుష ఆర్చర్, మరొకరు మహిళ ఆర్చర్ కూడా ఉంటారు.
భారత ఆర్చరీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సెలక్షన్ ట్రైల్స్ తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగానే ఈ ఆర్చర్లను ఎంపిక చేయడం జరిగింది.
ఇందులో రికర్వ్, కాంపౌండ్ విభాగాలలో ఒలంపిక్ ప్రమాణాలకు తగ్గట్టు 70 మీటర్లు, 50 మీటర్ల లో ఈ పోటీలు జరుగుతాయి. ఈ లీగ్ మొత్తం ప్రైజ్ మనీ అక్షరాల 2కోట్లు కావడం విశేషం.
ఇకపోతే తెలంగాణ, ఝార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా ఐదు రాష్ట్రాల నుంచి ఐదు జట్లు ఈ లీగ్ లో పాల్గొనబోతున్నాయి.
రౌండ్ రాబిన్ పద్ధతిలో రోజుకు మూడు మ్యాచ్లు.. 20 నిమిషాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాణం సంధించేందుకు 20 సెకండ్లు సమయం ఇస్తుండగా.. ఈ లీగ్ లో 15 సెకండ్లకే తగ్గించడం గమనార్హం. మరి ఆర్చర్లు తమ తమ మేధాశక్తిని ఇందులో చూపించాల్సి ఉంటుంది.
