రఘువంశీ ఔట్ వివాదం… ఐపీఎల్‌లో న్యాయం ఎక్కడ?
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్.ఎస్.జీ) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఉత్కంఠభరిత పోరుగా నిలిచిపోయింది.
By: A.N.Kumar | 27 April 2026 3:03 PM ISTఐపీఎల్ 2026 సీజన్‌లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్.ఎస్.జీ) మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఉత్కంఠభరిత పోరుగా నిలిచిపోయింది. ఆటలో గెలుపోటముల కంటే.. యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూపంలో ఔట్ అయిన తీరు ఇప్పుడు క్రీడా లోకంలో పెను సంచలనంగా మారింది. మైదానంలో అంపైర్ల నిర్ణయం.. లక్నో జట్టు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్కంఠ రేపిన ఆ ఐదో ఓవర్.. అసలేం జరిగింది?
కోల్‌కతా ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఈ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న రఘువంశీ ఒక షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకర్ పరుగుకు నిరాకరించడంతో సగం పిచ్ వరకు వెళ్లిన రఘువంశీ తిరిగి తన క్రీజులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో రనౌట్ చేసేందుకు ఫీల్డర్ విసిరిన బంతి, రఘువంశీ తన దిశను మార్చుకుంటుండగా అతనికి తగిలింది. లక్నో ఆటగాళ్ల అప్పీల్‌తో థర్డ్ అంపైర్ దీనిని నిశితంగా పరిశీలించి, అతను ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డుపడ్డాడని భావిస్తూ ‘అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద ఔట్‌గా ప్రకటించారు.
క్రీడాస్ఫూర్తి ఎక్కడ? విమర్శల జడివాన
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే స్టేడియంలోని అభిమానులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో రీప్లేలను చూస్తే, రఘువంశీ కేవలం రనౌట్ నుండి తప్పించుకోవడానికి సహజంగా పక్కకు జరిగాడే తప్ప బంతిని ఆపాలని ప్రయత్నించలేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు సైతం అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. బ్యాటర్ ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆటగాడి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనల ప్రకారం అప్పీల్ చేసే హక్కు ఉన్నప్పటికీ, అది వివాదాస్పదంగా ఉన్నప్పుడు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం లక్నో కెప్టెన్‌కు ఉంది. గతంలో ఎం.ఎస్. ధోనీ వంటి దిగ్గజాలు ఇలాంటి సందర్భాల్లో అప్పీల్‌ను ఉపసంహరించుకుని క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. కానీ లక్నో ఆ పని చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
సూపర్ ఓవర్‌లో నరైన్ మ్యాజిక్
వివాదాల నడుమ సాగిన ఈ మ్యాచ్ నిర్ణీత ఓవర్లలో టైగా ముగిసింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇక్కడే కేకేఆర్ వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. అత్యంత ఒత్తిడిలోనూ అద్భుతమైన బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను కట్టడి చేసిన నరైన్ వారిని కేవలం ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయేలా చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు.
న్యాయం గెలిచింది: అభిమానుల స్పందన
మ్యాచ్ ముగిసిన తర్వాత "రఘువంశీకి జరిగిన అన్యాయానికి ప్రకృతి ఇచ్చిన తీర్పు ఇది" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అన్యాయంగా వికెట్ కోల్పోయినప్పటికీ సూపర్ ఓవర్‌లో లక్నోను ఒకే పరుగుకు పరిమితం చేయడం కేకేఆర్ పట్టుదలకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
"క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్. నిబంధనలు ముఖ్యం కానీ, ఆటగాడి నిజాయితీని శంకించేలా నిర్ణయాలు ఉండకూడదు. ఈ మ్యాచ్ ద్వారా అంపైరింగ్ ప్రమాణాలపై ఐసీసీ బీసీసీఐ పునరాలోచించాల్సిన అవసరం ఉంది." అని ఒక సీనియర్ క్రీడా విశ్లేషకుడు తెలిపారు.
మొత్తానికి ఐపీఎల్ 2026లో ఈ మ్యాచ్ కేవలం ఒక ఆటగా మాత్రమే కాకుండా నిబంధనలు వర్సెస్ క్రీడాస్ఫూర్తి అనే పెద్ద చర్చకు వేదికైంది. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా స్పష్టమైన మార్గదర్శకాలు రావాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
