కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్
అంబటి రాయుడు ఓ పాడ్‌కాస్ట్‌లో సచిన్, కోహ్లీ, ధోనీల కెప్టెన్సీ శైలులను విశ్లేషించారు. హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతోందంటూ తిలక్ వర్మకు అన్ని ఫార్మాట్లలో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లను కోరారు. సెలక్షన్ కమిటీలోని ప్రజ్ఞాన్ ఓజాకు కూడా ఇదే విషయంపై తనదైన శైలిలో చురకలు అంటించారు.
By: A.N.Kumar | 21 Nov 2026 2:05 PM ISTభారత క్రికెట్లో మైదానంలో బ్యాట్‌తో సమాధానం చెప్పడం ఒక ఎత్తయితే.. రిటైర్మెంట్ తర్వాత మైక్ పట్టుకుని సంచలనాలు రేపడం అంబటి రాయుడికి వెన్నతో పెట్టిన విద్య.. సచిన్ టెండూల్కర్.. మహేంద్ర సింగ్ ధోనీ.. విరాట్ కోహ్లీ.. ఈ ముగ్గురు దిగ్గజాల కెప్టెన్సీలోనూ ఆడిన అరుదైన రికార్డున్న రాయుడు.. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో కూర్చుని భారత క్రికెట్ పెద్దలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ఒకవైపు దిగ్గజాల నాయకత్వ లక్షణాలను ఆకాశానికెత్తుతూనే మరోవైపు హైదరాబాద్ క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయంపై సెటైరికల్ బాణాలు సంధించారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ గురించి రాయుడు భలే ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. సచిన్ ఒక అసాధారణ క్రికెట్ మేధావి అని ఆయన బుర్రలో ఒకేసారి వంద రకాల వ్యూహాలు పరుగులు తీస్తుంటాయని చెప్పారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడిందట.. అంతటి రాకెట్ సైన్స్ స్థాయిలో ఆలోచించే సచిన్.. కింది స్థాయికి దిగి వచ్చి సాధారణ ఆటగాళ్లకు అర్థమయ్యేలా తన ఆలోచనలను వివరించడం కాస్త కష్టమైందట... అంటే టీచర్ మరీ జీనియస్ అయితే స్టూడెంట్స్‌కు పాఠం అర్థం కానట్లు.. సచిన్ కెప్టెన్సీలోనూ అదే జరిగిందని రాయుడు సున్నితంగా తేల్చేశారు.
ఇక విరాట్ కోహ్లీ, ధోనీల నాయకత్వ శైలిని రాయుడు ఒక్క పంచ్ డైలాగ్‌తో తేల్చేశారు. మనమే స్వయంగా ఒక పని చేయాలంటే కోహ్లీలా చేయాలి.. అదే ఇతరులతో పని చేయించాలంటే మాత్రం ధోనీలా చేయించాలి అంటూ నాయకత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. కోహ్లీ తన ఫిట్నెస్, క్రమశిక్షణతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని.. కానీ జట్టులోని ప్రతి ఒక్కరూ తనలాగే చెమటోడ్చాలని కోరుకోవడమే ఆయనకు సవాలుగా మారిందని విశ్లేషించారు.
అదే ధోనీ విషయానికి వస్తే.. ఆయన రూటే సెపరేటు.. జట్టులో ఎవరి బలమేంటో.. ఎవరికి ఏ పని అప్పగిస్తే ఫలితం వస్తుందో ధోనీకి బాగా తెలుసు. అందరినీ ఒకే గాటన కట్టకుండా.. ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వారితో పని చేయించుకోవడమే ధోనీని మిస్టర్ కూల్ విన్నర్‌గా నిలబెట్టిందని రాయుడు కితాబిచ్చారు. ఇక తాను సీఎస్కే లో ఉన్నప్పుడు హైదరాబాద్ తిలక్ వర్మను తీసుకోవాలని చెప్పినా వినలేదని.. ముంబై తీసుకొని ఇప్పుడు ఎంత బాగుపడిందో చూస్తున్నామన్నారు. గత మూడు వేలంలో సీఎస్కే మంచి ఆటగాళ్లను పిక్ చేయకపోవడమే ఆ టీం ఈ దురావస్థకు కారణమని విశ్లేషించారు.
దిగ్గజాల విశ్లేషణ ముగియగానే రాయుడు తన అసలు అస్త్రాన్ని బయటకు తీశారు. అదే.. హైదరాబాద్ క్రికెటర్లపై సెలెక్టర్ల చిన్నచూపు.. యువ సంచలనం తిలక్ వర్మను కేవలం ఒక్క ఫార్మాట్‌కే పరిమితం చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఇదే ప్రదర్శన ముంబై ఆటగాడు చేసి ఉంటే అందరినీ పక్కకు తోసేసి మరీ అన్ని ఫార్మాట్లలో ఆడించేవారు కదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు.. ఆ తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలే ఇప్పుడు తిలక్ వర్మకు ఎదురవ్వకూడదని ఘాటుగా హెచ్చరించారు.
ఇక సెలక్షన్ కమిటీలో ఉన్న హైదరాబాదీ ప్రజ్ఞాన్ ఓజాకు రాయుడు ఇచ్చిన సలహా అయితే నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేస్తోంది. "ఓజా గారూ.. దయచేసి మా వాడిని అన్ని ఫార్మాట్లలో ఆడించండి, కుర్రాడు బాగుపడతాడు. మీరు ఆ కుర్చీలో ఉండగానే ఈ పని చేసేయండి.. లేకపోతే మన క్రికెట్ రాజకీయాల గురించి తెలిసిందే కదా తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు" అంటూ తనదైన మార్క్ సెటైర్ వేశారు.
రాయుడు మాటల్లో హాస్యం ఉన్నా.. దాని వెనుక హైదరాబాద్ ప్రతిభకు దక్కాల్సిన గుర్తింపు కోసం గట్టి పోరాటమే కనిపిస్తోంది. మరి సెలెక్టర్ల చెవికి ఈ సెటైర్లు ఎక్కుతాయో లేదో చూడాలి.
