ఆ ఓపెనర్ రనౌట్..ఈ కెప్టెన్ క్యాచ్.. టర్నింగ్ ఇచ్చిన అమన్ జ్యోత్
మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను మొదట, చివర్లో రెండు ఔట్ లు తీవ్రంగా దెబ్బకొట్టాయి.
By: Tupaki Entertainment Desk | 3 Nov 2025 9:20 AM ISTమహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను మొదట, చివర్లో రెండు ఔట్ లు తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఆ రెండింటిలోనూ పాలుపంచుకున్నది ఒక్కరే. ఆమెనే అమన్ జ్యోత్ కౌర్ (ఏబీ కౌర్). పూర్తి పేరు అమన్ జ్యోత్ భూపిందర్ కౌర్. మహిళల టీమ్ ఇండియాలో కౌర్ అంటే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అనే అనుకుంటారు అందరూ. కానీ, ఈ అమన్ జ్యోత్ కౌర్ కూడా ఉన్నట్లు పెద్దగా తెలియదు. హర్మన్ లాగానే చండీగడ్ కు చెందిన అమన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్. లోయర్ మిడిలార్డర్ లో దిగుతుంటుంది. శ్రీలంకపై హాఫ్ సెంచరీ (57) సాధించింది. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ లోనూ పదికిపైగానే పరుగులు చేసింది. బౌలింగ్ లోనూ రాణించి ఏడు మ్యాచ్ లలో ఆరు వికెట్లు పడగొట్టింది. అయితే, వీటికంటే ఫైనల్లో ఆమె మొదట చేసిన రనౌట్, చివర్లో అందుకున్న క్యాచ్ లే కీలకం.
అదే మలుపు
ఫైనల్లో 299 పరుగుల భారీ టార్గెట్ అయినప్పటికీ దక్షిణాఫ్రికా ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు కెప్టెన్ లారా ఓల్వార్ట్ (101), తజ్మిన్ బ్రిట్స్ (23) నిలకడగా ఆడుతూ 9.3 ఓవర్లలో 51 పరుగులు జోడించారు. పరిస్థితి చూస్తుంటే బౌలర్లకు వికెట్ దక్కేలా లేదు. లారా కుదరుకుంటే విధ్వంసమే. ఆమెకు బ్రిట్స్ తోడైతే ఇక మ్యాచ్ ఖతమే. కప్ గల్లంతే. అలాంటి సమయంలో బ్రిట్స్ మిడాన్ దిశగా బంతిని కొట్టి రన్ కు ప్రయత్నించింది. అక్కడ ఉన్న అమన్ మెరుపువేగంతో బంతిని అందుకుని నేరుగా వికెట్లకేసి కొట్టింది. మరో మాట లేకుండా బ్రిట్స్ పెవిలియన్ కు వెళ్లిపోయింది.
అది ప్రపంచ కప్ క్యాచ్
ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చివర్లో అమన్ అందుకున్న క్యాచ్ అద్భుతం అనే చెప్పాలి. ప్రత్యర్థి కెప్టెన్ లారా దూకుడుగా ఆడుతూ 98 బంతుల్లోనే 101 పరుగులు చేసింది. అప్పటికి వారి స్కోరు 41.1 ఓవర్లలో 220. ఇంకా 54 బంతులలో 79 పరుగులు చేయాల్సి ఉండగా, నాలుగు వికెట్లు చేతిలో ఉండగా.. లారా క్రీజులో ఉండగా ఇదేమీ పెద్ద విషయం కాదు. ఇలాంటి సమయంలో ఆమె డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ కొట్టింది. అంతే.. అమన్ జ్యోత్ తన ఎడమవైపునకు పరుగెడుతూ బంతిపైనే ఫోకస్ పెడుతూ పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ, బంతి చేతిలో ఆగలేదు. ఒకటికి రెండుసార్లు క్యాచ్ చేజారినట్టే.. కప్ కూడా చేజారినట్లే అనుకున్నారు. అమన్ మాత్రం పట్టు విడవలేదు. వరుసగా సెమీఫైనల్స్, ఫైనల్స్ లో సెంచరీలు చేసిన లారాను పెవిలియన్ చేర్చిన ఈ క్యాచ్ తో టీమ్ ఇండియాకు ప్రపంచకప్ ఖాయమైంది. అంతేకాదు.. అమన్ జ్యోత్ ఆమె క్యాచ్ ను పట్టిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
