ఇండియా కోడలు కాబోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ప్రతిభావంతమైన లెగ్ స్పిన్నర్ అమండా వెల్లింగ్టన్ త్వరలోనే భారత దేశంతో కుటుంబ బంధం కలుపుకోబోతున్నారు.
By: A.N.Kumar | 13 Nov 2025 2:47 PM ISTఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ప్రతిభావంతమైన లెగ్ స్పిన్నర్ అమండా వెల్లింగ్టన్ త్వరలోనే భారత దేశంతో కుటుంబ బంధం కలుపుకోబోతున్నారు. పంజాబ్‌కు చెందిన యువకుడు హంరాజ్ తో ఆమె వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది, ఈ శుభవార్తను అమండా స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో క్రికెట్ ప్రపంచం నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రేమకు వేదికైన సంగీత కచేరి
అమండా, హంరాజ్ పరిచయం ఆస్ట్రేలియాలో జరిగిన ఒక సంగీత కచేరీలో మొదలైంది. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్‌కు జెర్సీని బహుమతిగా అందించేందుకు వెళ్లిన అమండా, అక్కడ హంరాజ్‌ను కలుసుకున్నారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధం వరకు చేరుకుంది. ఈ జంట తమ అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
*భారత్ తరఫున ఆడాలన్న ఆకాంక్ష
వివాహం తర్వాత అమండా వెల్లింగ్టన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. “వివాహం తర్వాత నాకు భారత పౌరసత్వం లభిస్తే, భారత్ తరఫున క్రికెట్ ఆడాలని చాలా ఆసక్తిగా ఉంది” అని ఆమె మనసులోని మాటను వెల్లడించారు. తన లెగ్ స్పిన్ ప్రతిభతో టీమ్ ఇండియాకు సేవ చేసే అవకాశం దొరికితే చాలా సంతోషంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించడంలో అమండా వెల్లింగ్టన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అమండాకు కొంతకాలంగా ఆస్ట్రేలియా జట్టులో అవకాశాలు దక్కకపోయినా, ఆమె విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో మాత్రం స్థిరంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నారు.
అమండా–హంరాజ్ వివాహ వార్త, ఆమె భారత జట్టు తరఫున ఆడాలనే కోరిక, ఇండియా , ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను ఒకచోట చేర్చింది. ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో అమండా టీమ్ ఇండియా జెర్సీ ధరించే అవకాశం ఉంటే అది ఎంత గొప్పగా ఉంటుందోనన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
