Begin typing your search above and press return to search.

గుడ్‌బై జింక్స్.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ రిటైర్ మెంట్

అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన అధ్యాయానికి తెరపడింది.

By:  A.N.Kumar   |   30 July 2026 11:00 AM IST
గుడ్‌బై జింక్స్.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ రిటైర్ మెంట్
X

భారత క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్లలో ఒకరిగా.. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకునే నాయకుడిగా గుర్తింపు పొందిన అజింక్య రహానే (38) అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన అధ్యాయానికి తెరపడింది. 'జింక్స్' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే రహానే నిర్మలమైన శైలి, క్రమశిక్షణ, ప్రశాంత నాయకత్వం భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

విదేశీ గడ్డపై నమ్మకమైన 'మిస్టర్ డిపెండబుల్'

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టు పునర్నిర్మాణంలో రహానే కీలక పాత్ర పోషించారు. ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలతో కలిసి ఐదో స్థానంలో బలమైన బ్యాటింగ్ లైనప్‌ను నిర్మించారు. 2013 డర్బన్ టెస్టుతో తన సత్తా చాటిన రహానే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో సెంచరీలు సాధించి విదేశీ పిచ్‌లపై తన సాంకేతిక నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. లార్డ్స్ మైదానంలో ఆయన చేసిన చిరస్మరణీయ శతకం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.

చారిత్రాత్మక గబ్బా విజయం.. నాయకత్వం

రహానే కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టం 2020-21 ఆస్ట్రేలియా పర్యటన. అడిలైడ్ టెస్టులో పరాజయం, క్రమంగా సీనియర్ ఆటగాళ్ల గాయాల నడుమ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రహానే జట్టును అద్భుతంగా నడిపించారు. మెల్‌బోర్న్ టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించి భారత్‌కు విజయాన్ని అందించారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ గబ్బా బ్రిస్బేన్ మైదానంలో చారిత్రాత్మక విజయాన్ని అందించి, సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. ఆయన చూపిన ప్రశాంతత, వ్యూహాత్మక ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.

చివరి దశ.. ఘనమైన ప్రయాణం

కెరీర్ చివరి దశలో ఫామ్ లేమితో జట్టుకు దూరమైనప్పటికీ 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పునరాగమనం చేసి 89, 46 పరుగులతో తన అనుభవాన్ని చాటుకున్నారు. 2023 జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టే ఆయనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మిగిలిపోయింది.

జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ముందడుగు వేసి ఆడటం రహానే నైజం. మైదానంలో ఆయన చూపించిన వ్యక్తిత్వం, స్లిప్ ఫీల్డింగ్‌లో అద్భుత క్యాచ్‌లు, తోటి ఆటగాళ్లకు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివి. భారత క్రికెట్‌కు ఆయన అందించిన సేవలకు గానూ అభిమానులు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.