Begin typing your search above and press return to search.

భారత్‌లో సింహాలు.. విదేశాల్లో పిల్లులా? యువ బ్యాటర్లకు ఇదో హెచ్చరిక

భారత క్రికెట్‌లో ప్రస్తుతం యువ రక్తం ఉడుకుతోంది. మైదానంలోకి అడుగుపెడుతూనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే యువ బ్యాటర్ల ధోరణి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

By:  A.N.Kumar   |   21 Sept 2026 12:39 PM IST
భారత్‌లో సింహాలు.. విదేశాల్లో పిల్లులా? యువ బ్యాటర్లకు ఇదో హెచ్చరిక
X

భారత క్రికెట్‌లో ప్రస్తుతం యువ రక్తం ఉడుకుతోంది. మైదానంలోకి అడుగుపెడుతూనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే యువ బ్యాటర్ల ధోరణి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి చిన్న వయసులోనే అసాధారణ హిట్టింగ్ నైపుణ్యాలతో భవిష్యత్ ఆశలుగా నిలిచారు. అయితే స్వదేశీ పిచ్‌లపై చూపే ఈ ఆధిపత్యాన్ని విదేశీ గడ్డపైనా కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, దిగ్గజ ఆటగాడు సందీప్ పాటిల్ హెచ్చరించారు.

పవర్ హిట్టింగ్ ఓకే.. కానీ టెక్నిక్ ఏది?

అభిషేక్, వైభవ్‌లలో సహజ సిద్ధమైన బ్యాటింగ్ ప్రతిభ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని పాటిల్ ప్రశంసించారు. భారీ షాట్లు ఆడే సామర్థ్యంతో పాటు మంచి టైమింగ్ కూడా వారి సొంతమని పేర్కొన్నారు. అయితే ఆధునిక అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం ‘పవర్’తోనే ఎక్కువ కాలం మనుగడ సాగించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై కొత్త బంతితో సవాలు ఎదురైనప్పుడు కేవలం దూకుడు మాత్రమే సరిపోదని.. అక్కడ బ్యాటర్ అసలైన టెక్నిక్‌కు పరీక్ష ఎదురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వింగ్, బౌన్స్ ఎదుర్కోవడమే అసలైన సవాలు

భారతీయ పిచ్‌లపై బంతి సులభంగా బ్యాట్‌పైకి వస్తుంది. దీంతో ఎలాంటి భయం లేకుండా షాట్లు ఆడటానికి వీలుంటుంది. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ బంతి విపరీతంగా స్వింగ్ అవ్వడంతో పాటు సీమ్ మూవ్‌మెంట్, అదనపు బౌన్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంతి స్వింగ్ అయ్యేంత వరకు ఓపిక పట్టడం, కొత్త బంతిని గౌరవించడం చాలా అవసరం. ఇటీవల కాలంలో విదేశీ వాతావరణంలో ఈ యువ ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోందని.. దీనిపై వారు తక్షణమే దృష్టి సారించాలని పాటిల్ సూచించారు.

‘ఇండియాలో సింహాలు.. విదేశాల్లో పిల్లులు’ ముద్ర పడకూడదు

యువ ఆటగాళ్లను విమర్శించడం తన ఉద్దేశం కాదని.. వారి లోపాలను ముందే గుర్తించి సరిదిద్దుకోవాలనే ఆకాంక్షతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు సందీప్ పాటిల్ తెలిపారు. భారత క్రికెట్‌లో గతంలో కొందరు బ్యాటర్లపై పడిన "ఇండియాలో సింహాలు.. విదేశాల్లో పిల్లులు" అనే ముద్ర ఈ తరం యువ సంచలనాలపై పడకూడదన్నదే తన తాపత్రయమని ఆయన స్పష్టం చేశారు.

అభిషేక్ శర్మ ఇప్పటికే టీ20ల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. వైభవ్ సూర్యవంశీ సైతం పిన్న వయసులోనే సంచలన స్కోర్లతో వార్తల్లో నిలిచాడు. అయితే, ఈ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శనగా మలచాలంటే వాతావరణానికి, పిచ్ స్వభావానికి అనుగుణంగా తమ శైలిని మలుచుకోవడం తప్పనిసరి.

దూకుడుతో పాటు డిఫెన్స్ కూడా ముఖ్యం

ఆధునిక టీ20 ప్రపంచంలో పవర్ హిట్టింగ్‌కు ఎంత గుర్తింపు ఉందో.. సుదీర్ఘ కాలం నిలకడగా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రాణించాలంటే షాట్ సెలెక్షన్ ముఖ్యం.. ఏ బంతిని కొట్టాలి, ఏ బంతిని వదిలేయాలనే స్పష్టత ఉండాలి. క్రీజులో సమయం గడపాలి. కష్టమైన సమయాల్లో ఓపికగా నిలబడి స్వింగ్ ప్రభావం తగ్గే వరకు వేచి చూడాలి.

అభిషేక్, వైభవ్ వంటి ప్రతిభావంతులు ఈ సాంకేతిక అంశాలపై మరింత దృష్టి పెడితే.. వారు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఏ మూలనైనా.. ఎలాంటి పిచ్‌పైనైనా అత్యుత్తమ బ్యాటర్లుగా ఎదుగుతారనడంలో సందేహం లేదు.