314 పరుగులు.. 33 లక్షల కారు.. పరుగుల వీరుడికి ‘అభిషేకం’
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అన్నట్లుగా ఆసియా కప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా పరుగుల వరద పారించిన అభిషేక్ కు పరుగు పరుగున లగ్జరీ కారు నడిచొచ్చింది.
By: Tupaki Entertainment Desk | 29 Sept 2025 6:03 PM ISTఆసియా కప్ జరుగుతున్నన్ని రోజులు ఒ కారు అందరినీ ఆకట్టుకుంది.. చూసేందుకు చక్కటి డిజైన్.. కళ్లు చెదిరే లుక్... భారత రోడ్లపై ఎప్పుడూ చూడని తరహాలో... మంచి లగ్జరియస్ ఎస్ యూవీని తలపించేలా ఉన్న ఈ కారును ఎవరు దక్కించుకుంటారో కానీ.. వారంతా లక్కీ ఫెలో ఇంకొకరు ఉండరు అని అభిమానులు అసూపడ్డారు. తాజాగా ఫైనల్ ముగిసిన అనంతరం ఆ కారు భారత దేశానికే వచ్చేస్తోంది..! దీనికి కారణం.. దానిని గెలుచుకున్నది టీమ్ ఇండియా యువ ఓపెనర్ కావమే.
అతడే అడ్డు..
అతడిని ఔట్ చేస్తే టీమ్ ఇండియా పని అయిపోయినట్లేనని పాకిస్థాన్ సంబరపడింది...! పాక్ కు ఆసియా కప్ నకు మధ్య అతడే అడ్డుగోడ అని భయపడింది...! ఆదివారం నాటి ఫైనల్లో వలపన్ని ఔట్ చేసింది..! కానీ, టీమ్ ఇండియా గెలుపును మాత్రం ఆపలేకపోయింది. అతడే.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. బ్యాట్ ను కాస్త వంపుగా పట్టుకుని.. మొదటి బంతి నుంచే సిక్సులు, ఫోర్లు కొడుతూ చెలరేగి ఆడిన ఈ పంజాబ్ కుర్రాడు టి20ల్లో మరో ఎత్తుకు ఎదిగాడు. ముఖ్యంగా ఆసియా కప్ లో అభిషేక్ చెలరేగిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్లో తప్ప ప్రతి మ్యాచ్ లోనూ 30 పైగా పరుగులు చేసిన అభిషేక్ మొత్తం 7 మ్యాచ్ లలో 314 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ రేట్ దాదాపు 200. దీంతో టాప్ స్కోరర్ గా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగానూ నిలిచాడు.
పరుగు పరుగున లగ్జరీ కారు నడిచొచ్చింది...
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అన్నట్లుగా ఆసియా కప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా పరుగుల వరద పారించిన అభిషేక్ కు పరుగు పరుగున లగ్జరీ కారు నడిచొచ్చింది. అది కూడా మామూలుది కారు సూపర్ లగ్జరీ కారు. దాని పేరు ‘హవల్ హెచ్ 9’. మరి దీని స్పెషాలిటీలు ఏంటో తెలుసా?
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా...
గ్రేట్ వాల్ ఆఫ్ మోటార్ (జీడబ్ల్యూఎం) చైనాకు చెందిన కార్ల కంపెనీ. తమ దేశంలోని ప్రఖ్యాత గ్రేట్ వాల్ ను తమ సంస్థ పేరులో పెట్టుకుంది. ఈ సంస్థ రూపొందించిన హవల్ హెచ్ 9’ కారు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ దీని సొంతం. ఈ లగ్జరీ ఎస్ యూవీలో 2.0 లీటర్ టర్బో చార్జ్ డ్ 4 సిలిండర్ గ్యాసోలిన్ ఇంజను ఉంటుంది. ఇక ప్రయాణించేవారి భద్రతను ప్రాధామ్యంగా తీసుకుని డిజైన్, ఫీచర్లు రూపొందించారు.
ఆరు ఎయిర్ బ్యాగ్ లతో...
బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే వాహనాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు భద్రత చాలా ముఖ్యం. అందుకే హవల్ హెచ్ 9లో ఆర ఎయిర్ బ్యాగ్ లతో పాటు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సదుపాయం ఏర్పాటు చేశారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని బట్టి వేగం సర్దుబాటు చేసుకునే వీలుంది.
-360 డిగ్రీల వ్యూ కెమెరా, ఆటో, ఎకో (పర్యావరణ), స్పోర్ట్, శాండ్ (ఇసుక), స్నో (మంచు), మడ్ (బురద) ఇలా పలు డ్రైవ మోడ్స్ ఉన్నాయి. 14.6 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, పది స్పీకర్ల సౌండ్ సిస్టమ్ కూడా ఉంది.
-కూలింగ్ కోసం సీట్ వెంటిలేషన్ ప్రత్యేకం. డ్రైవింగ్ లో అలసిపోకుండా మసాజ్ ఫీచర్ ను ఏర్పాటు చేశారు.
-ఇంతకూ ధర ఎంత అనేది చెప్పలేదు కదూ... రూ.33.60 లక్షలకు పైనే...! ఇది సౌదీ అరేబియా ధర.
పన్ను రాయితీ ఉంటుందా..?
బహుమతి పొందిన వస్తువులకు పన్నురాయితీ ఉంటుందా? మరీ ప్రత్యేకించి క్రీడాకారులకు ఈ వెసులుబాటు ఇస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే విదేశీ కార్లను భారత్ లోకి అనుమతించాలంటే కారు ధరకు సమానంగా పన్నలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన అభిషేక్ రూ.33 లక్షల వరకు కట్టాలి. ఆసియా కప్ లో అద్భుతంగా ఆడినందుకు ఏమైనా రాయితీ ఇస్తారేమో చూడాలి.
