Begin typing your search above and press return to search.

నువ్వు మగాడ్రా బుజ్జీ.. అభిషేకూ.. షేక్ చేస్తున్నావంతే..

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి నిప్పులు చెరిగాడు.

By:  A.N.Kumar   |   7 May 2026 10:15 AM IST
నువ్వు మగాడ్రా బుజ్జీ.. అభిషేకూ.. షేక్ చేస్తున్నావంతే..
X

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి నిప్పులు చెరిగాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎవరైనా తన శైలి మాత్రం ‘అటాకింగ్’ అని మరోసారి నిరూపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అభిషేక్ చేసిన విధ్వంసం ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించింది. కేవలం మెరుపు ఇన్నింగ్స్‌కే పరిమితం కాకుండా క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరసన చేరి అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

తొలి బంతి నుంచే బాదుడు..

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు అభిషేక్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్‌లోకి పంపాడు. అక్కడితో ఆగకుండా మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లోనూ వరుస సిక్సర్లతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రేయాస్ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అభిషేక్ వెనుదిరిగినా అతను సృష్టించిన ఇంపాక్ట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

అరుదైన రికార్డు: 300 క్లబ్‌లో అభిషేక్

ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే అభిషేక్ శర్మ ఒక చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారతదేశ గడ్డపై జరిగిన టీ20 మ్యాచుల్లో (ఐపీఎల్ , దేశవాళీ కలిపి) 300 సిక్సర్లు బాదిన ఆరో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఉన్న దిగ్గజాలను గమనిస్తే అభిషేక్ సాధించిన ఘనత ఎంత గొప్పదో అర్థమవుతుంది. రోహిత్ 388, క్రిస్ గేట్ 300, విరాట్ కోహ్లీ 300+, సంజూశాంసన్ 300+, సూర్యకుమార్ యాదవ్ 300+ ల సరసనర 302 సిక్సులతో అభిషేక్ శర్మ చేరాడు.

విశేషమేమిటంటే ఈ ఘనత సాధించడానికి అభిషేక్ కేవలం 153 మ్యాచులు మాత్రమే తీసుకున్నాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తర్వాత అత్యంత వేగంగా (200 మ్యాచుల లోపు) ఈ మైలురాయిని చేరిన ప్లేయర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.

క్లాసెన్, ఇషాన్ కిషన్ జుగల్బందీ

అభిషేక్ ఇచ్చిన ఊపును మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ రెట్టింపు చేశారు. క్లాసెన్ తన మార్కు షాట్లతో పంజాబ్ బౌలర్లను వణికించాడు. అతను 43 బంతుల్లో 69 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పంజాబ్ ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేయడం సన్‌రైజర్స్ బ్యాటర్లకు కలిసొచ్చింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.

తేలిపోయిన పంజాబ్ బౌలింగ్

పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల అతని గణాంకాలు దెబ్బతిన్నాయి. పంజాబ్ ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడవడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. అభిషేక్ శర్మ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. "నువ్వు మామూలోడివి కాదు భయ్యా.. మగాడివి" అంటూ నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.

భారత జట్టు భవిష్యత్తు ఓపెనర్‌గా అభిషేక్ శర్మ దూసుకుపోతున్న తీరు చూస్తుంటే, మరిన్ని అంతర్జాతీయ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.