Begin typing your search above and press return to search.

నో డౌట్.. టీ20ల్లో అభిషేక్‌ శర్మనే టాప్‌

టీ20ల్లో ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్ మెన్ మన అభిషేక్ శర్మనే.. ఓపెనర్ గా వస్తూ సెంచరీలు, విధ్వంసం సృష్టిస్తూ బౌలర్లపై శివతాండవం ఆడేస్తున్నాడు.

By:  A.N.Kumar   |   10 Nov 2025 11:25 AM IST
నో డౌట్.. టీ20ల్లో అభిషేక్‌ శర్మనే టాప్‌
X

టీ20 క్రికెట్‌ అంటే వేగం, సాహసం, ధైర్యం, ధాటిగా కొట్టే శైలి.. ఈ అన్ని లక్షణాలను కలిపిన ఒక ఆటగాడు ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌కి గుర్తింపు తెస్తున్నాడు. అతనే అభిషేక్‌ శర్మ. 2025లో టీ20 క్రికెట్‌ లో అతడు చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, అగ్రెషన్‌.. ఇవన్నీ కలిపి అతడిని ఈ తరానికి “పరిపూర్ణ టీ20 ఓపెనర్‌”గా నిలబెట్టాయి.

టీ20ల్లో ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్ మెన్ మన అభిషేక్ శర్మనే.. ఓపెనర్ గా వస్తూ సెంచరీలు, విధ్వంసం సృష్టిస్తూ బౌలర్లపై శివతాండవం ఆడేస్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత భీకర ఆస్ట్రేలియ బౌలర్ హేజిల్ వుడ్ ను కూడా బౌన్సీ పిచ్ లపై చితక్కొట్టాడంటే మన అభిషేక్ ఎంతగా బౌలర్లను షేక్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఎలా బంతి వేసినా స్టాండ్స్ లోకి పంపిస్తూ బౌలర్లకు నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నాడు. అందుకే మన అభిషేక్ ను ఇప్పుడు అందరూ వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాట్స్ మెన్ అంటూ కొనియాడుతున్నారు.

ఇంగ్లాండ్‌ మాజీ దిగ్గజం కెవిన్‌ పీటర్సన్‌ కూడా అభిషేక్‌ ప్రతిభపై మంత్ర ముగ్ధుడయ్యాడు. “టీ20ల్లో పరిపూర్ణ ఓపెనర్‌, ధైర్యం ఉన్న బ్యాటర్‌” అని ఆయన ప్రశంసించడం అంత తేలిక కాదు. ఎందుకంటే పీటర్సన్‌ తన కాలంలో సొంత శైలితో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆటగాడు. అతడు ఎవరో కాదు, టీ20 బ్యాటింగ్‌ సంస్కృతిని మార్చిన వారిలో ఒకరు. అలాంటి ఆటగాడు అభిషేక్‌ గురించి ఈ స్థాయిలో ప్రశంసించడం అంటే, ఈ యువ భారత ఆటగాడు నిజంగానే అంతర్జాతీయ స్థాయిలో గంభీరమైన ముద్ర వేస్తున్నాడని అర్థం.

అభిషేక్‌ ఆటలో ప్రత్యేకత ఏమిటంటే.. పవర్‌ ప్లేలో దూకుడు.. కానీ నిర్లక్ష్యంగా ఆడడు.. ప్రతి బంతిని చదివే ఆలోచనాత్మక బ్యాటింగ్‌.. స్పిన్నర్‌ అయినా.. ఫాస్ట్‌ బౌలర్‌ అయినా తన రిథమ్‌ నుండి బయటకు రానివ్వడు. షార్ట్‌ బాల్స్‌, యార్కర్స్‌, స్లో బౌన్సర్లు.. అన్నీ అతడికి ఫేవరేట్‌ షాట్లే.

అభిషేక్‌ శర్మ గబ్బాలో సాధించిన 1000 పరుగుల మైలురాయి అతని ఎదుగుదలకి ప్రతీక. కేవలం 528 బంతుల్లోనే ఆ ఘనత అంటే ఇది సర్వసాధారణం కాదు. అంతే కాదు.. ఆసీస్‌ టూర్‌లో సిరీస్‌లోనే అత్యధిక పరుగులు సాధించి, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలవడం అతడి నిరంతర క్రమశిక్షణకు నిదర్శనం.

* యువరాజ్‌ సింగ్‌ పాత్ర

అభిషేక్‌ ఎదుగుదల వెనుక మరో హీరో ఉన్నాడు.. అతడే యువరాజ్‌. అతడు కేవలం కోచ్‌ కాదు, మెంటర్‌ కూడా. ఆయన చెప్పిన బ్యాట్‌ సెంటిమెంట్‌ కథ “అభిషేక్‌ తన బ్యాట్లను ఎవరికీ ఇవ్వడు” ఇది కేవలం సరదా విషయం కాదు, అతడి ఆటపై ఉన్న ప్యాషన్‌.. ఆత్మీయత, ఫోకస్‌కు అద్దం పడుతుంది. ప్రతి ఆటగాడికి అలాంటి సెంటిమెంట్లు ఉంటాయి. కానీ అభిషేక్‌ దానిని మోటివేషన్‌గా మార్చుకున్నాడు.

టీ20 భవిష్యత్తు ఆశాకిరణం

భారత జట్టుకు ఇప్పుడు రోహిత్‌, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి స్టార్లు ఉన్నా, కొత్త తరానికి ప్రతినిధిగా అభిషేక్‌ వేగంగా ఎదుగుతున్నాడు. అతడి శైలి ఐపీఎల్ ఫ్లేవర్‌ కలిగిన గ్లోబల్‌ బ్రాండ్‌ క్రికెట్‌. భవిష్యత్తులో అతడు ఇండియా టీ20 జట్టుకి ఆటగాడిగా మాత్రమే కాకుండా మ్యాచ్‌ విన్నింగ్‌ లీడర్‌గా కూడా అవతరించే అవకాశం ఉంది.

మొత్తం మీద అభిషేక్‌ శర్మ ప్రస్తుతం భారత క్రికెట్‌కి “యువరాజ్‌ తరహా ఫ్లేవర్‌, సూర్యకుమార్‌ తరహా ఆత్మవిశ్వాసం” కలిగిన ఆటగాడు. కెవిన్‌ పీటర్సన్‌ వంటి దిగ్గజాల ప్రశంసలు, యువరాజ్‌ సింగ్‌ వంటి మెంటర్‌ గైడెన్స్‌ ఇవి కలిపి ఈ యువ ఆటగాడి కెరీర్‌ని గ్లోబల్‌ హైట్స్‌కి తీసుకెళ్తున్నాయి.