ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు
గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో ఉన్న ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్‌లో దుబాయ్‌లో నివసించే వరుణ్ సుహాగ్ (42) అనే వ్యక్తి 2018లో రూ.6.68 కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నారు.
By: A.N.Kumar | 2 Nov 2026 11:56 PM ISTలక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు పోసి ఇల్లు కొనుగోలు చేసేది విలాసవంతమైన జీవితం గడపాలని... అంతర్జాతీయ ప్రమాణాలు.. అత్యాధునిక సదుపాయాలు.. ప్రశాంతమైన వాతావరణం ఉంటాయని భావించి రియల్ ఎస్టేట్ దిగ్గజాలను నమ్ముతారు. కానీ కోట్లు కుమ్మరించినా కనీస సౌకర్యాల కోసం పోరాడాల్సిన దుస్థితి వస్తే? సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే గురుగ్రామ్‌లోని ప్రతిష్టాత్మక 'ట్రంప్ టవర్స్' నివాసికి ఎదురైంది.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో ఉన్న ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్‌లో దుబాయ్‌లో నివసించే వరుణ్ సుహాగ్ (42) అనే వ్యక్తి 2018లో రూ.6.68 కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్‌ను బుక్ చేసుకున్నారు. 2025 నాటికి చెల్లింపులన్నీ పూర్తి చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర ఆలస్యం తర్వాత ఈ ఏడాది ఆగస్టు 27న బిల్డర్ ఇంటి తాళాలు అప్పగించారు. కానీ ఫ్లాట్‌లోకి అడుగుపెట్టిన ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంట్లో ఫాల్స్ సీలింగ్ పనులు కూడా పూర్తికాకపోవడంతో నివాసయోగ్యంగా మార్చుకోవడానికి మరో రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కనీస పనులు పూర్తికాని భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అర్థం కాక ఆయన విస్తుపోయారు.
ఇంటి పరిస్థితి ఒకెత్తయితే అక్కడి ఆంక్షలు, పర్యవేక్షణ లోపం మరో ఎత్తుగా మారాయి. లిఫ్ట్ ఉపయోగించాలంటే బిల్డింగ్ హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి 30 నుండి 40 నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఫర్నిచర్ లారీలను, కర్టెన్లు వేసే పనివారినీ చివరికి డెలివరీ బాయ్స్‌ను కూడా లోపలికి అనుమతించకపోవడంతో గోప్యత లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోఫా కూడా లోపలికి తేలేక నేలపైనే పడుకోవాల్సి వచ్చిందని వరుణ్ వాపోయారు.
బిల్డర్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో వరుణ్ తనకు ఎదురైన చేదు అనుభవాలను ఫొటోలు, వీడియోలతో సహా 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఎం3ఎం ప్రమోటర్ పంకజ్ బన్సాల్‌తో జరిపిన సంభాషణల స్క్రీన్‌షాట్‌లను కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఏకంగా 19 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. నెటిజన్ల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో బిల్డర్ తక్షణమే దిగొచ్చారు. సమస్యను గుర్తించి సోమవారం నాటికి లిఫ్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటన కేవలం ఒక కొనుగోలుదారుడి సమస్య మాత్రమే కాదు.. వేగంగా విస్తరిస్తున్న భారత లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక కనువిప్పు లాంటిది. కేవలం బ్రాండ్ పేరు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా.. నిర్మాణ నాణ్యత, నిర్వహణ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ , ప్రాథమిక సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. కోట్లు వెచ్చించేది కేవలం నాలుగు గోడల కోసం కాదు.. గౌరవప్రదమైన జీవన ప్రమాణాల కోసమేనని గ్రహించాలి.
