సియోల్ హెచ్చరిక – మన రియల్ ఎస్టేట్‌కు పాఠమా?
ఈ క్రమంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ పరిస్థితి మనకు ఒక హెచ్చరికగా కనిపిస్తోంది.
By: A.N.Kumar | 2 Feb 2026 4:00 PM ISTఒకవైపు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అమ్ముడుపోని అపార్ట్‌మెంట్లు, ఖాళీగా నిలిచిపోయిన బిల్డింగులు… మరోవైపు డిమాండ్ ఉందని చెప్పుకుంటూ ధరలు పెంచాలని కోరుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులు. భారతీయ నగరాల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇదే. ఈ క్రమంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ పరిస్థితి మనకు ఒక హెచ్చరికగా కనిపిస్తోంది.
సియోల్‌లో అపార్ట్‌మెంట్ ధరలు వారానికి ఒకసారి పెరుగుతున్నాయి. ఏడాది పొడవునా వరుసగా 52 వారాలు ధరలు పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా హోం లోన్లపై ఎంత కట్టడి చేసినా మార్కెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. ఫలితం ఏమిటి? ఒక మధ్యతరగతి ఉద్యోగి 30 ఏళ్లు పని చేసి, రిటైర్ అయిన తర్వాత సియోల్‌లో ఉండలేని పరిస్థితి. ఇది అభివృద్ధి విజయమా? లేక విధాన పరాజయమా?
సియోల్ జనాభా దాదాపు 93 లక్షలు. విస్తీర్ణం పరంగా చిన్న నగరంలో ఇంత భారీ జనసాంద్రత ఉండటం సహజంగానే రియల్ ఎస్టేట్‌పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా యువత ఫ్లాట్ కొనుగోలునే జీవిత లక్ష్యంగా భావించే స్థితికి చేరడం ఆందోళన కలిగించే అంశం. పెళ్లి, కుటుంబం తర్వాత.. ముందుగా ఇల్లు కంపల్సరీగా భావిస్తున్నారు.. ఇది సామాజిక మార్పు మాత్రమే కాదు, ఆర్థిక ఒత్తిడికి ప్రతిబింబం.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం.. సియోల్ సమస్య ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దశాబ్దాలుగా రాజధానికే అభివృద్ధిని కేంద్రీకరించడం.. ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ భౌగోళిక అసమతుల్యత ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, టాప్ యూనివర్సిటీలు, అధిక వేతన ఉద్యోగాలు.. అన్నీ ఒకేచోట. ఫలితంగా దేశమంతా రాజధానికే క్యూ కట్టింది. సెజోంగ్ నగరాన్ని పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేసినా.. సియోల్‌పై ఒత్తిడి తగ్గలేదు.
ఇక లోన్ల విషయానికి వస్తే.. భారతదేశంతో పోలిస్తే సియోల్ చాలా కఠినం. మన దగ్గర ఫ్లాట్ విలువలో 80–90 శాతం వరకు లోన్ వస్తే, అక్కడ కేవలం 40 శాతమే. అయినా ధరలు పెరుగుతున్నాయంటే అది డిమాండ్ తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ లాంటి దేశాలు కూడా ఇలాంటి కఠిన విధానాలనే అమలు చేస్తున్నాయి. అయినా సమస్య పూర్తిగా అదుపులోకి రావడం లేదు.
ఇప్పుడు ప్రశ్న మనదే.. భారత నగరాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయా? ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఒకవైపు వేలాది అపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉండగా, మరోవైపు ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇది నిజమైన డిమాండా? లేక స్పెక్యులేషన్‌తో సృష్టించిన బుడగనా? అన్నది అర్థం చేసుకోవాలి.
సియోల్ అనుభవం చెబుతున్న పాఠం స్పష్టం.. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే గృహం సాధారణ మనిషికి అందని కలగా మారుతుంది. ధరల నియంత్రణ ఒక్కటే పరిష్కారం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ, ఉద్యోగాల సమాన పంపిణీ, మౌలిక వసతుల విస్తరణ.. ఇవే దీర్ఘకాలిక మార్గాలు.
లేదంటే ఈ రోజు సియోల్ కథ మనం వార్తల్లో చదువుతాం. రేపు అదే కథ మన నగరాల సంపాదకీయాల శీర్షిక అవుతుంది.
