Begin typing your search above and press return to search.

కోహ్లీ ఒక్క‌డే కాదు.. ముంబైని కొనేస్తున్న టాప్ -5 సెల‌బ్రిటీలు ఎవ‌రో తెలుసా?

2026లో ఇప్పటివరకూ ముంబై రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊపేసిన ఇటీవ‌లి ప్రాపర్టీ డీల్స్‌లో క్రీడా దిగ్గజం విరాట్ కోహ్లీ .. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంల కొనుగోళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

By:  Sivaji Kontham   |   27 July 2026 6:09 PM IST
కోహ్లీ ఒక్క‌డే కాదు.. ముంబైని కొనేస్తున్న టాప్ -5 సెల‌బ్రిటీలు ఎవ‌రో తెలుసా?
X

భారత ఆర్థిక రాజధాని ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజురోజుకూ సరికొత్త ఎత్తులకు చేరుతోంది. ముఖ్యంగా సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు... వ్యాపార దిగ్గజాలు ముంబైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఖరీదైన స్థలాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2026లో ఇప్పటివరకూ ముంబై రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊపేసిన ఇటీవ‌లి ప్రాపర్టీ డీల్స్‌లో క్రీడా దిగ్గజం విరాట్ కోహ్లీ .. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంల కొనుగోళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ దంపతులు ఇటీవల ముంబైలోని వర్సోవా (అంధేరి వెస్ట్) ప్రాంతంలో రూ. 18.29 కోట్లు వెచ్చించి ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. గోద్రెజ్ స్కైషోర్ భవంతిలోని ఎత్తైన ఫ్లోర్‌లో ఉన్న ఈ ఫ్లాట్ దాదాపు 2,644 చదరపు అడుగుల వైశాల్యాన్ని కలిగి ఉంది. చదరపు అడుగుకు రూ. 69,159 చొప్పున జరిగిన ఈ డీల్ కోసం వారు రూ. 1.09 కోట్ల స్టాంప్ డ్యూటీ.. రూ. 30 వేల రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించారు. ఈ ఫ్లాట్‌తో పాటు వారికి 316 చదరపు అడుగుల ప్రత్యేక స్థలం.. మూడు కార్ పార్కింగ్ స్లాట్లు లభించాయి.

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే ప‌లు ప్రైమ్ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. అలీబాగ్‌లో వీరికి రూ. 37 కోట్లకు పైగా విలువైన విల్లా-స్థలం ఉండగా, గురుగ్రామ్‌లో వీరు నివసించే లగ్జరీ బంగళా విలువ సుమారు రూ. 80 కోట్లుగా అంచనా. వీటితో పాటు లండన్‌లో కూడా వీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీ విలువ రూ. 30 కోట్ల నుండి రూ. 40 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. తాజాగా వర్సోవాలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌తో వారి రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో మరింత బలపడింది.

ఈ మధ్యకాలంలో మరో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం ముంబైలో అత్యంత ఖరీదైన ల్యాండ్ డీల్‌తో వార్తల్లో నిలిచారు. ఖార్ పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 5,413 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక ప్రైవేట్ బంగళాను, దాని అనుబంధ స్థలాన్ని ఆయన దాదాపు రూ. 70.83 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఏకంగా రూ. 4.24 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడం విశేషం. ముంబై ప్రైమ్ లోకేషన్‌లో జాన్ కొనుగోలు 2026లో అతిపెద్ద ఇండివిడ్యువల్ ప్రాపర్టీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.

వీరిద్దరితో పాటు 2026లో ముంబైలో ఆస్తులు కొనుగోలు చేసిన టాప్-5 సెలబ్రిటీల జాబితాలో అమితాబ్ బచ్చన్ (రూ. 15-25 కోట్ల విలువైన ఆస్తులు), మలైకా అరోరా (బాంద్రాలో రూ. 14.5 కోట్ల ఫ్లాట్), తాప్సీ పన్ను (అంధేరిలో రూ. 10.5 కోట్ల ప్రాపర్టీ) బ‌రిలో ఉన్నారు. ప్రస్తుతం ముంబై వెస్ట్రన్ సబర్బ్స్‌లో కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావడంతో వర్సోవా, బాంద్రా, జుహు, అంధేరి ప్రాంతాల్లో ప్రాపర్టీ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణ ముంబైకి అనుసంధానత పెరగడంతో సెలబ్రిటీలు , బిజినెస్ టైకూన్లు ఈ ప్రాంతాలలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.