Begin typing your search above and press return to search.

ఐడీపీఎల్ భూములు: అస‌లేంటీ వివాదం?

ప్ర‌భుత్వం కేటాయించిన ఐడీపీఎల్ స్థలాన్ని ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆక్ర‌మించార‌న్న‌ది జాగృతి సంస్థ నేత క‌విత ఆరోపిస్తున్నారు.

By:  Garuda Media   |   16 Dec 2025 4:24 PM IST
ఐడీపీఎల్ భూములు: అస‌లేంటీ వివాదం?
X

ఐడీపీఎల్ భూములు.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ని కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఐడీపీఎల్‌... కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌. ఐడీపీఎల్ అంటే.. ఇండియ‌న్ డ్ర‌గ్స్ అండ్ ఫార్మాస్యూటిక‌ల్ లిమిటెడ్‌. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌కు ప్రాధాన్యం ఇస్తూ.. హైద‌రాబాద్‌లోనే ప్ర‌త్యేకంగా ఈ సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌రు 376లో భూములు కేటాయించారు. దేశ ఔష‌ధ రంగానికి ఇది త‌ల‌మానికంగా ఉండాల‌ని కూడా ప్ర‌భుత్వం అప్ప‌ట్లో పేర్కొంది. అయితే.. ఆ త‌ర్వాత‌ రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో.. ఈ ప్రాజెక్టును ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పైగా.. ఇక్క‌డ స్థానికులు కొంద‌రు.. పాక‌లు, షెడ్లు వేసుకుని నివ‌సిస్తున్నారు. అయినా.. కేసీఆర్ స‌ర్కారు దీనిని పెద్దగా ప‌ట్టించుకోలేదు. అనంత‌ర కాలంలో పెద్ద ప్ర‌హ‌రీ కూడా నిర్మించారు. ఈ వ్య‌వ‌హార‌మే రాజ‌కీయంగా ఇప్పుడు దుమారం రేపుతోంది.

ప్ర‌భుత్వం కేటాయించిన ఐడీపీఎల్ స్థలాన్ని ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆక్ర‌మించార‌న్న‌ది జాగృతి సంస్థ నేత క‌విత ఆరోపిస్తున్నారు. కానీ.. తానేమీ స్థ‌లాన్ని ఆక్ర‌మించ‌లేద‌ని.. చ‌ట్ట‌బ‌ద్ధంగా కొంత భూమిని స‌మీపంలో కొనుగోలు చేశాన‌ని మాధ‌వ‌రం చెబుతున్నారు. ఇది వివాదంగా మారింది. ప్ర‌స్తుతం ఈ భూమి విలువ 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైచిలుకుగా ఉండ‌డం.. రాజ‌కీయ దుమారం రేగ‌డానికి కార‌ణ‌మైంద‌న్న వాద‌న ఉంది.

వాస్త‌వానికి ఇక్క‌డ భారీ ప్రాజెక్టును క‌ట్టి.. ఔష‌ధ‌రంగాన్ని డెవ‌లప్ చేయాల‌ని సంక‌ల్పించారు. కానీ, ఆదిశ గా అడుగులు ప‌డ‌లేదు. ఈ భూములు మార్కెట్ విలువ పరంగా చాలా ఖ‌రీదైన‌వి కావ‌డం, కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడం, కాలక్రమేణా సంస్థ మూతపడటంతో ఈ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయ‌న్న‌ది వాస్త‌వం. కేసీఆర్ హ‌యాంలోనూ ఈ భూముల విషయంపై ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పుడు క‌విత రంగ ప్ర‌వేశంతో ఈ దూకుడు మ‌రింత పెరిగింది.