Begin typing your search above and press return to search.

ఆఫీస్ స్పేస్: పలు నగరాల్లో క్షీణత.. హైదరాబాద్ అందుకు భిన్నం

దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు ఎక్కువగా నమోదైన మహానగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.

By:  Garuda Media   |   11 Oct 2026 10:17 PM IST
ఆఫీస్ స్పేస్: పలు నగరాల్లో క్షీణత.. హైదరాబాద్ అందుకు భిన్నం
X

దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు ఎక్కువగా నమోదైన మహానగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జరిగిన లావాదేవీలను అధ్యయనం చేసిన కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఈ వివరాల్ని తాజాగా విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. ఇంతకూ ఈ సంస్థ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వాణిజ్య రియల్ ఎస్టేట్ సేవల సంస్థల్లో ఇదొకటిగా చెప్పాలి. గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాప్ 3 కంపెనీల్లో ఇదొకటి కావటం గమనార్హం.

అమెరికాలోని చికాగో ప్రధాన కార్యాలయంగా పని చేసే ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 60కు పైగా దేశాల్లో 350 కంటే ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 53వేలకు పైనే ఉద్యోగులు పని చేస్తున్నారు. అధికారిక రిపోర్టుల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా రూ.86వేల కోట్లకు పైనే వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ఉత్తమ బ్రాండ్లు - కంపెనీల జాబితాలో ఇదొకటి.

ఇక.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ఆఫీసు స్థలాల డిమాండ్ పై వారు తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. దేశ వ్యాప్తంగా ఆఫీసు స్పేస్ స్థలాల నికర అద్దె లావాదేవీలు తగ్గాయని పేర్కొంటూ అందుకు హైదరాబాద్ మహానగరం మినహాయింపుగా పేర్కొంది. 2026 జనవరి - సెప్టెంబరును టైమ్ లైన్ గా తీసుకొని చేసిన అధ్యయనంలో గత ఏడాది ఇదే సమయంలో జరిగిన లావాదేవీలతో పోల్చారు.

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కలిపి నికర లీజింగ్ 20 శాతం తగ్గితే..హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా నికర లీజింగ్ 41 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. దేశంలోని ఎనిమిది మహానగరాల్లో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలవగా.. బెంగళూరు రెండోస్థానంలో నిలిచింది. అదే సమయంలో విదేశీ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు భారతదేశంలోని తమ కార్యాలయాలను భారీగా విస్తరిస్తున్నాయని క్యూ3లో జరిగిన మొత్తం లీజింగ్ లోని వీటి వాటానే 42 శాతంగా ఉందని పేర్కొంది. అంతేకాదు కో వర్కింగ్ - ఫ్లెక్సిబుల్ ఆఫీస్ ఆపరేటర్ల నుంచి కూడా డిమాండ్ ఉన్నట్లుగా పేర్కొంది.

దేశంలోనే ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో తొలిస్థానంలో నిలిచిన హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ నగరంలోని మాదాపూర్.. గచ్చిబౌలి ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించింది. బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీ - ఎన్ సీఆర్ మూడో స్థానంలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నాలుగో స్థానంలో.. ఫూణె ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం ఎనిమిది నగరాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించిన ఈ అధ్యయనం హైదరాబాద్ ఎలా అయితే నికర ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో మొదటిస్థానంలో ఉందో.. అదే విధంగా బెంగళూరు.. ఫూణె నగరాల్లో మాత్రం లీజింగ్ కార్యకలాపాలు పెరిగినట్లుగా పేర్కొంది.

మిగిలిన నగరాలకు మించి హైదరాబాద్ ఎందుకు తొలిస్థానంలో నిలిచింది? దానికి కారణాలేంటి? అన్న అంశంలోకి వెళితే.. ఐటీ రంగాన్ని దాటి క్యూ3లో హైదరాబాద్ లో బ్యాంకింగ్.. ఆర్థిక సేవల రంగానికి చెందిన కంపెనీలు భారీగా ఆఫీస్ స్థలాల్ని లీజుకు తీసుకున్నాయని.. నగరంలో జరిగిన మొత్తంలీజింగ్ లావాదేవీల్లో అత్యధికం (39.7 శాతం) ఈ రంగానిదేనని పేర్కొంది. అంతేకాదు.. అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు తమ ప్రపంచ స్థాయి వ్యూహాత్మక కేంద్రాల్ని ఏర్పాటులో హైదరాబాద్ కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వటం కూడా ఒక కారణంగా పేర్కొంది.

ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర ఉదాహరణల్ని కూడా ప్రస్తావించింది. అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజం ఫెడెక్స్ హైదారాబాద్ లోని ఫీనిక్స్ సెంటారస్ లో నెలకు చదరపు అడుగు రూ.78 చొప్పున సుమారు 1.19 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకోవటం హైదరాబాద్ మార్కెట్ బలానికి నిదర్శనంగా పేర్కొంది. అంతేకాదు.. భాగ్యనగరంలో కో-వర్కింగ్ - ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఎకకువగా ఉండటం మరో కారణం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మొత్తం లీజింగ్ లావాదేవీల్లో గచ్చిబౌలి ప్రాంతంలోనే 89 శాతం జరగ్గా.. మరో 10 శాతం మాదాపూర్ లో జరిగినట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది.