Begin typing your search above and press return to search.

దిశను మార్చుకుంటున్న హైదరాబాద్.. వీటి నిర్మాణాలతో మారునున్న కల..

విల్లాల నిర్మాణంలో హైదరాబాద్ ను పరిశీలిస్తే.. హైదరాబాద్‌ టెక్నాలజీ నగరం, రియల్‌ ఎస్టేట్‌ కు అనువైన కేంద్రం, ఇప్పుడు విల్లా కలల రాజధానిగా మారుతోంది.

By:  Tupaki Political Desk   |   25 Oct 2025 3:00 PM IST
దిశను మార్చుకుంటున్న హైదరాబాద్.. వీటి నిర్మాణాలతో మారునున్న కల..
X

వేగవంతమైన అభివృద్ధితో నివాసాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. నివాసాలు కొత్తగా మారుతున్నాయి. నగర వాసులు ఎక్కువగా ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల వైపునకు కాకుండా విల్లాల వైపునకు ఎక్కువ వెళ్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అయితే.. ఈ విల్లాలు కూడా ట్రిపుల్ బెడ్ రూం నుంచి మొదలవడం విశేషం. సింగిల్ బెడ్ రూం .., డబుల్ బెడ్ రూంలను ఎవరూ ఇష్టపడడం లేదు.. ఖచ్చితంగా ట్రిపుల్ బెడ్ రూం ఉండాల్సిందే. అందునా.. గెస్ట్ రూం.. హోం థియేటర్ ఇలా చాలా సౌకర్యాలు కోరుతున్నారు. దీంతో విల్లాల కాస్ట్ విపరీతంగా పెరుగుతోంది.

విల్లాల నిర్మాణంలో హైదరాబాద్ ను పరిశీలిస్తే.. హైదరాబాద్‌ టెక్నాలజీ నగరం, రియల్‌ ఎస్టేట్‌ కు అనువైన కేంద్రం, ఇప్పుడు విల్లా కలల రాజధానిగా మారుతోంది. ఒకప్పుడు 10 అంతస్తుల ఫ్లాట్లు, హై రైజ్‌ టవర్లు మధ్య జీవితాన్ని ఊహించిన మధ్యతరగతి కుటుంబాలు, ఇప్పుడు పచ్చదనం మధ్య సొంత ప్రాంగణం, తోట, గార్డెన్‌తో కూడిన విల్లా జీవనం వైపు పయనిస్తున్నాయి. ఇది కేవలం స్థల మార్పు కాదు జీవన ప్రమాణాల పరిణామం.

పశ్చిమ ప్రాంతానికి భారీ డిమాండ్..

పశ్చిమ హైదరాబాద్‌ ఈ పరిణామానికి ప్రధాన కేంద్రం. ఐటీ కారిడార్‌ విస్తరణతో మొదలైన ఈ రియల్‌ ఎస్టేట్‌ ఇప్పుడు నగరంలోని అన్ని దిశలకూ విస్తరించింది. బాచుపల్లి, గోపన్‌పల్లి, కొల్లూరు, వెలిమల నుంచి మంచిరేవుల, పటాన్‌చెరు వరకు గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు ఒకదాని వెంట మరొకటి రూపుదిద్దుకుంటున్నాయి. బిల్డర్లు చెబుతున్న ఒకే వాక్యం ఇప్పుడు మార్కెట్‌ ధోరణిగా మారింది. ‘ఫ్లాట్‌ నుంచి విల్లాకు అప్‌గ్రేడ్‌ అవ్వడం జీవనశైలిలో భాగమైంది.’

నగరవాసుల కొత్త కలలు

నగరంలోని ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మధ్య తరగతి ప్రొఫెషనల్స్‌ చాలా కాలం ఫ్లాట్‌లలో జీవించి, ఇప్పుడు ప్రశాంతత, పచ్చదనం కోసం శివార్ల వైపు వెళ్తున్నారు. పిల్లల విద్య, ఉద్యోగం, రవాణా అవసరాలు తీరడంతో కుటుంబాలు ఇప్పుడు ‘సొంత ఇల్లు – సొంత గాలి’ అన్న కలను నిజం చేసుకుంటున్నాయి. గత దశాబ్దంలో ఫ్లాట్‌ మార్కెట్‌ బలంగా ఉన్నా, ఇప్పుడు విల్లాలు అదే స్థాయిలో ఆకర్షణగా మారాయి.

తూర్పు హైదరాబాద్‌లో ఘట్‌కేసర్‌, రాంపల్లి, హయత్‌నగర్‌ పరిధుల్లో అందుబాటు ధరల్లో ప్రాజెక్టులు వస్తుండగా, పశ్చిమ హైదరాబాద్‌ మాత్రం అధిక విలువైన విల్లాలకు కేంద్రంగా మారుతోంది. రూ.కోటి నుంచి రూ.25 కోట్ల ధరల్లో ఈ విల్లాలు లభ్యమవుతుండడం కొత్త రియల్‌ ఎస్టేట్‌ లెవల్‌ను సూచిస్తోంది.

ట్రిప్లెక్స్‌ విల్లాల ట్రెండ్‌

ఇటీవల విల్లా డిజైన్‌లు కూడా ‘భారతీయ అవసరాలు + పాశ్చాత్య సౌకర్యాలు’తో మిలితం అవుతున్నాయి. ఎక్కువ ప్రాజెక్టులు ట్రిప్లెక్స్‌ డిజైన్‌లో వస్తున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పెద్ద గది, కిచెన్‌; మొదటి అంతస్తులో పిల్లల బెడ్‌రూమ్స్‌, ప్రైవేట్‌ స్పేస్‌; రెండో అంతస్తులో హోంథియేటర్‌, రిక్రియేషన్‌ జోన్‌. 150 గజాల నుంచి వెయ్యి గజాల వరకు స్థలాల్లో వీటిని నిర్మిస్తున్నారు. పశ్చాత్య దేశాల తరహాలో ఫారెస్ట్‌ థీమ్‌, గ్రీన్‌ కమ్యూనిటీలు, సోలార్‌ ఎకో డిజైన్‌లు కూడా కొత్త ఆకర్షణగా మారాయి.

కొత్త తరంలో కోరికలు.. మార్పులు..

విల్లాల ప్రాజెక్టుల్లో ఇప్పుడు సస్టెయినబిలిటీ (స్థిరంగా ఉండేందుకు) ప్రధాన కేంద్రంగా మారుతోంది. వర్షం నీటి సేకరణ, సోలార్‌ పవర్‌, రీసైక్లింగ్‌ యూనిట్లు, ఎలక్ట్రిక్‌ వాహన ఛార్జింగ్‌ పాయింట్లు అన్నీ భాగంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరగడం అంటే కేవలం లగ్జరీ కాదు, భవిష్యత్‌ బాధ్యత అని కొత్త తరం గ్రహించడం మొదలైంది.

నగర దిశలను పరిశీలిస్తే..

-తూర్పు హైదరాబాద్‌ ను తీసుకుంటే.. ఘట్‌కేసర్‌, కొర్రేముల, ఆదిభట్ల వరకు అందుబాటు విల్లాలు ఉన్నాయి. మధ్య తరగతి బడ్జెట్‌ లో ఇవి రూపాంతరం చెందబోతున్నాయి.

-దక్షిణంవైపు అత్తాపూర్‌ నుంచి మహేశ్వరం, శంషాబాద్‌, తుక్కుగూడ వరకు కొత్త లగ్జరీ ప్రాజెక్టులు; విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం వీటికి అదనపు ఆకర్షణ.

-ఉత్తరం వైపు కొంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్‌, దుండిగల్‌ పరిధిలో ‘ఫ్యామిలీ విల్లాలు’; కొత్త కమ్యూనిటీ బిల్డప్‌.

-పశ్చిమం వైపు పరిశీలిస్తే... బాచుపల్లి నుంచి పటాన్‌చెరు వరకు అధిక విలువ గల లగ్జరీ విల్లాలు; అంతర్జాతీయ ప్రమాణాల థీమ్‌ ప్రాజెక్టులు.

పాశ్చాత్య జీవనశైలికి అనుగుణంగా..

విల్లా ప్రాజెక్టుల్లో ఎక్కువ మంది బిల్డర్లు ఇప్పుడు పాశ్చాత్య థీమ్‌లను అనుసరిస్తున్నారు. మినిమలిస్టిక్ ఆర్కిటెక్చర్‌, వుడ్‌ ఫినిష్‌ ఇంటీరియర్స్‌, ఫారెస్ట్‌ వ్యూ లివింగ్‌ స్పేసెస్. కానీ, ఈ విల్లాల్లో భారతీయ జీవనశైలికి ప్రాధాన్యం కోల్పోలేదు. పూజా గదులు, వంటింటి దగ్గర సిట్ అవుట్, కుటుంబం కలిసే ప్రదేశాలు.. ఇవన్నీ విల్లా డిజైన్‌లో అంతర్భాగాలుగా ఉంటున్నాయి.

విల్లా విప్లవం..

హైదరాబాద్‌ నగరం ఇప్పుడు కేవలం ఉద్యోగాల నగరం కాదు.. ఉన్నత జీవనశైలికి సింబల్‌. ఫ్లాట్ల నుంచి విల్లాల దిశగా ఈ పరిణామం.. నగర వృద్ధి, కుటుంబ స్థిరత్వం, పచ్చదనం వైపు మళ్లుతున్నారు. పశ్చిమ హైదరాబాదు ఆకాశాన్ని తాకే టవర్లతో నిండిపోతున్నప్పటికీ, నేలను తాకే విల్లాలు అక్కడ కొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ విల్లా విప్లవం కేవలం రియల్‌ ఎస్టేట్‌ పరిణామం కాదు.. అది ఒక నగరపు హృదయం తిరిగి తన మూలాలకు చేరిన సంకేతం.