Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రియల్ ముందుకా ? వెనక్కా ?

ముంబయి, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలోనే కాదు హైదరాబాద్ లో కూడా తమకు ఒక స్థిరాస్థి ఉండాలన్న ఆలోచన సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

By:  Tupaki Political Desk   |   12 Oct 2026 1:00 PM IST
హైదరాబాద్ రియల్ ముందుకా ? వెనక్కా ?
X

ముంబయి, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలోనే కాదు హైదరాబాద్ లో కూడా తమకు ఒక స్థిరాస్థి ఉండాలన్న ఆలోచన సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే నిర్మాణాలు పెరిగిపోవడం, కొనుగోలు దారులు తగ్గిపోవడంతో పాటు ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి వాటి డిమాండ్ కొనసాగుతున్నది. కానీ ఎక్కడా ధరలు మాత్రం పడిపోకపోవడం గమనించాల్సిన అంశం.

ప్రజలు ముఖ్యంగా ప్రీమియం, లగ్జరీ తరహాలో రూ.1 నుండి రూ.3 కోట్ల విలువైన 3, 4 బీహెచ్కే అపార్ట్ మెంట్లను ఆదరిస్తున్నారు. కొల్లూరు, తెల్లాపూర్, మోకిల, శంకర్ పల్లి, తుక్కుగూడ, శంషాబాద్, ఆదిభట్ల ప్రాంతాలలో అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. కోకాపేట్, గండిపేజ, మోకిల ప్రాంతాలలో విల్లాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు రూ.50 లక్షల నుండి రూ.కోటి పైచిలుకు నివాసాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

ప్రస్తుతం క్రెడాయి, క్రె మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం 26,068 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నాలుగున్నరేళ్లలో 13 శాతం తగ్గుదల నమోదయినా వీటి మొత్తం విలువ రూ.52,913 కోట్లు కావడం గమనార్హం. అయితే కొత్త లాంచింగ్ లు 37 శాతం పెరుగుదల నమోదు చేస్తూ 49,656 యూనిట్లు లాంచ్ కావడం విశేషం. పశ్చిమ కారిడార్ మార్కెట్ ను శాసిస్తుండగా, ఉత్తర, దక్షిణ కారిడార్లలో అమ్ముడుపోనివి, నిర్మాణంలో ఉన్నవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దాదాపు 1.1 లక్షల నుండి 1.43 లక్షల యూనిట్లు అమ్ముడుపోని వాటి జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నవి ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి రెడీ టు మూవ్ యూనిట్లు 30 వేలు మాత్రమే. పశ్చిమ, దక్షిణ కారిడార్లలో గేటెడ్ లే అవుట్లు, విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి.

పండుగ సీజన్లలో అమ్మకాలు మెరుగవుతాయని, రియల్ ఎస్టేట్ లో ప్రస్తుత పరిస్థితి డెడ్ స్టాక్ కాదు, ఫ్యూచర్ పైప్ లైన్ అని రియల్టర్లు, డెవలపర్లు చెబుతున్నారు. ప్రీమియం సెగ్మెంట్ బలంగా ఉండగా, కొందరు డెవలపర్లు లాంచింగ్ లను తగ్గించి సెలక్టివ్ గా వెళ్తున్నారు. ఇక కొనుగోలుదారులు ప్రధానంగా డెవలపర్ బ్రాండ్, నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, అందులో కల్పించే వసతులు, డబ్బులు చెల్లించే ప్రక్రియను పరిశీలించి ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి నెమ్మదించినా, కొత్త జాగ్రత్తగా ముందుకు సాగుతుందని తెలుస్తుంది.