హైదరాబాద్ లో 'రియల్' రివర్స్ : కోకాపేటలో కోట్ల కరువు.. ‘జీరో’ బిడ్లతో ఖజానాకు షాక్
హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ భూముల వేలానికి బిల్డర్ల నుంచి స్పందన కరువైంది. కోకాపేటలో ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర నిర్ణయించినా బిడ్లు దాఖలు కాలేదు. మూసాపేట, బంజారాహిల్స్ ప్లాట్ల వేలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధిక భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు, మార్కెట్ మందగమనం కారణంగా డెవలపర్లు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
By: A.N.Kumar | 28 Nov 2026 7:00 PM ISTఒకప్పుడు హైదరాబాద్ భూముల వేలం అంటే బిల్డర్ల మధ్య రణరంగమే. ఎకరా వంద కోట్లు దాటినా ఇది మాకే కావాలి అంటూ పోటీ పడే రోజులు పోయాయి. ఇప్పుడు హెచ్ఎండీఏ వేలం హాళ్లలో ఎకరా రూ.120 కోట్ల కనీస ధర వినిపించగానే బిల్డర్లు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. భూములున్నాయి.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. అధికారులు రెడీగా ఉన్నారు.. కానీ కొనేవాళ్లే అయ్యో.. మా వల్ల కాదు బాబోయ్ అంటూ పక్కకి తప్పుకుంటున్నారు.
గత ఏడాది కోకాపేటలో ఎకరా రూ.151.25 కోట్లు పలికినప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ వేడి ఇంకా చల్లారకముందే ఈసారి ఎకరాకు రూ.120 కోట్ల ధర పెట్టినా ఒక్కరూ ముందుకు రాకపోవడం పెద్ద ట్విస్ట్. కోకాపేటలో 4.59 ఎకరాలు, మూసాపేటలో 3.15 ఎకరాలు కలిపి కనీసం రూ.863 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. ఫలితం మాత్రం అక్షరాలా సున్నా.. బంజారాహిల్స్‌లోని ఎనిమిది ప్లాట్ల వేలంలోనూ ఇదే తీరు కనిపించడం విశేషం.
ధర తగ్గించండి సార్.. మార్కెట్ కొంచెం డల్‌గా ఉంది అని బిల్డర్లు వేడుకున్నా అధికారులు మాత్రం తమ లెక్కల్లోనే ఉండిపోయారు. ఎకరాకు రూ.120 కోట్లు భూమి కోసమే పెడితే.. ఆ తర్వాత సిమెంట్, ఇనుము, అనుమతులు, వడ్డీలు, మార్కెటింగ్ ఖర్చులు కలిపి భవనాలను ఎవరికి అమ్మాలి? చందమామ మీద ఉండే వాళ్లకి అమ్మాలా? అన్నట్టుంది బిల్డర్ల ఆలోచన. లాభం సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి అయినా తిరిగి వస్తుందా లేదా అన్న మీమాంసలో డెవలపర్లు ఉన్నారు.
ఒకటి రెండు వేలాల్లో బిడ్లు పడకపోయినంత మాత్రాన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమీ కుప్పకూలిపోదు. కాకపోతే ధర ఎంత పెంచినా కొనేవాళ్లు ఉంటారు అనే పాత ఫార్ములా ఇప్పుడు పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. ధరలు నిర్ణయించడం ప్రభుత్వాల చేతిలో ఉన్నా.. ఆ ధరలకు కొనాలా వద్దా అనేది మార్కెట్ చేతిలో ఉంటుంది. రికార్డుల గతం చూసుకుని ప్రతిసారీ అదే రేటు ఆశిస్తే.. వేలం పాటల్లో జీరోలే మిగులుతాయి. మరి అధికారులు తమ ధరల లెక్కను మార్చుకుంటారా..? లేక వచ్చే వేలంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా చూడాలి..
