అప్ డేట్ కాకపోతే అంతే బాస్... ఘోస్ట్ మాల్స్ చెబుతోన్న పాఠం!
ఇందులో భాగంగా... రెగ్యులర్ పర్యవేక్షణ, అప్ గ్రేడేషన్, ప్లానింగ్, బ్రాండ్ మిక్స్, ఫిట్ అవుట్స్ వంటి వాటిలో ఏది అసమర్ధంగా ఉన్నా.. మాల్ పతనం అనివార్యం అని అన్నారు.
By: Raja Ch | 15 Dec 2025 6:00 PM ISTఒకప్పుడు షాపింగ్ మాల్స్ అంటే ఫుల్ హడావిడి. ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉండేవి. ఒకే చోట అన్నీ దొరుకుతాయనే నమ్మకమో.. లేక, కొత్తొక వింత కావడమో తెలియదు కానీ.. ఆ సందడి అలానే ఉండేది. ఇక వీకెండ్స్ లోనో, ఫెస్టివల్స్ టైమ్ లోనో సంగతి అయితే చెప్పే పనే లేదు. అయితే.. ఇప్పుడు ఆ వైభవం గతం! దేశ వ్యాప్తంగా ఘోస్ట్ మాల్స్ పెరుగుతున్నాయంటూ ఓ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.
అవును... సుమారు 10-15 సంవత్సరాల క్రితం భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఫుల్ జోరుగా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో మాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే! అయితే... లోపభూయిష్ట డిజైన్లు, జనాభాలో మార్పులు, మౌలిక సదుపాయల్లో నవీణీకరణలు లేకపోవడం, మొదలైన కారణాలతో ఘోస్ట్ మాల్స్ పెరిగిపోతున్నాయి! ఈ సందర్భంగా స్పందించిన నైట్ ఫ్రాంక్ ఇండియాలో జాతీయ పరిశోధన డైరెక్టర్ అంకితా సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... రెగ్యులర్ పర్యవేక్షణ, అప్ గ్రేడేషన్, ప్లానింగ్, బ్రాండ్ మిక్స్, ఫిట్ అవుట్స్ వంటి వాటిలో ఏది అసమర్ధంగా ఉన్నా.. మాల్ పతనం అనివార్యం అని అన్నారు. ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ నివేదిక పలు కీలక విషయాలు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా... భారత్ లోని 32 నగరాల్లోని 72 మాల్స్ ఈ స్థితికి చేరుకున్నాయని వెల్లడించింది.
ఇదే సమయంలో... ఈ 72 మాల్స్ మొత్తం రిటైల్ స్థలాల్లో 20%కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని వెల్లడించింది. మొత్తం 365 షాపింగ్ సెంటర్స్ లో 13.4 కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటే అందులో కోటీ యాభై ఐదు లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉందని స్పష్టం చేసింది. అయితే.. కొన్ని నగరాల్లో డిమాండ్ కు మించి స్థలాలు అందుబాటులో ఉండటం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని చెబుతున్నారు!
కాగా... మూడేళ్లుగా మాల్స్ లో సుమారు 40% కంటే ఎక్కువ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్ గా పరిగణిస్తారు. దీనికి కారణం రెగ్యులర్ పర్యవేక్షణ, అప్ గ్రేడేషన్, ప్లానింగ్ లేకపోవడం అని.. అందుకే రెగ్యులర్ గా మార్పుకు అడాప్ట్ అవాలని సూచిస్తున్నారు. ఈ ఘోస్ట్ మాల్స్ పెరగడానికి కేవలం ఆన్ లైన్ షాపింగ్ ఒకటే కారణం కాదని నొక్కి చెబుతున్నారు.
