Begin typing your search above and press return to search.

దివాళా తీసిన 'బైజుస్' ఆస్తులు కొన్న మీషో అధినేత‌.. 84 కోట్లు రిస్క్ చేసారా?

మీషో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ బెంగళూరులో రూ.83.81 కోట్ల విలువైన రెండు లగ్జరీ ప్లాట్లను కొనుగోలు చేశారు. తూర్పు బెంగళూరులోని ఎప్సిలాన్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ స్థలాలను బైజుస్ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులైన దివ్య గోకుల్‌నాథ్, దీప్తి అఖిల రాఘవన్ నుంచి కొనుగోలు చేశారు. మొత్తం 33,475 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డీల్ పూర్తయింది.

By:  Sivaji Kontham   |   17 Nov 2026 9:39 AM IST
దివాళా తీసిన బైజుస్ ఆస్తులు కొన్న మీషో అధినేత‌.. 84 కోట్లు రిస్క్ చేసారా?
X

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ లావాదేవీని పూర్తి చేశారు. ఆపత్కాలంలో ఉన్న ఎడ్‌టెక్ దిగ్గజం `బైజుస్` వ్యవస్థాపకుల కుటుంబం నుంచి తూర్పు బెంగళూరులోని అత్యంత ప్రతిష్టాత్మకమైన `ఎప్సిలాన్` గేటెడ్ కమ్యూనిటీలో రెండు లగ్జరీ ప్లాట్లను కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో మీషో ఐపీఓ విజయవంతం కావడంతో బిలియనీర్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన విదిత్ ఆత్రేయ ఈ ప్రాపర్టీ కోసం రూ. 83.81 కోట్లు వెచ్చించారు.

ఈ డీల్ కింద మొత్తం 33,475 చదరపు అడుగుల స్థలాన్ని రెండు వేర్వేరు సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేశారు. బైజు రవీంద్రన్ సతీమణి, సహ వ్యవస్థాపకురాలు అయిన దివ్య గోకుల్‌నాథ్ నుంచి 18,305 చదరపు అడుగుల భూమిని రూ. 48.11 కోట్లకు కొనుగోలు చేయగా... బైజు సోదరుడు రిజు రవీంద్రన్ సతీమణి, బైజుస్ మాజీ హెచ్‌ఆర్ హెడ్ దీప్తి అఖిల రాఘవన్ నుంచి మరో 15,180 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ రెండు ప్లాట్లు కలిపి చదరపు అడుగుకు సుమారు రూ.25,029 ధర పలికాయి.

అయితే బైజుస్ మాతృ సంస్థ `థింక్ అండ్ లెర్న్` ప్రస్తుతం తీవ్రమైన దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కొనుగోలుపై ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రముఖ లా ఫర్మ్ `సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్` ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్రయవిక్రయ పత్రాలలో కఠినమైన లీగల్ ఇండెమ్నిటీ క్లాజులను పొందుపరిచారు. ఈ ఆస్తులు పూర్తిగా ప్రైవేట్ స్వాధీనంలో ఉన్నవని.. ఏ విధమైన రుణదాతల క్లెయిమ్‌లకు లోబడి లేవని స్పష్టమైన హామీలతో ఈ లావాదేవీని పూర్తి చేయడం విశేషం.

బైజూస్ ప‌త‌నం ఆస్తుల అమ్మ‌కం ..

ఒకప్పుడు ఎడ్‌టెక్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా వెలుగొందిన బైజుస్ సంస్థ.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, నిర్వహణ లోపాల కారణంగా ప్రస్తుతం పతనావస్థను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. కంపెనీ మాతృ సంస్థ `థింక్ అండ్ లెర్న్` భారీ నష్టాలు, నిధుల కొరత , రుణదాతలతో వివాదాల కారణంగా దివాళా ప్రక్రియను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రుణాలను తీర్చేందుకు, ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు సంస్థ వ్యవస్థాపకులు బైజు రవీంద్రన్ సహా పలువురు కీలక వ్యక్తులు తమ వ్యక్తిగత, కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించే పరిస్థితి తలెత్తింది.

తాజాగా బైజుస్ వ్యవస్థాపకుల కుటుంబం తమ వద్ద ఉన్న లగ్జరీ ఆస్తులను విక్రయించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా తూర్పు బెంగళూరులోని అత్యంత ప్రతిష్టాత్మకమైన `ఎప్సిలాన్` గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆస్తుల‌ను మీషో సీఈఓ విదిత్ ఆత్రేయకు విక్రయించారు. ఇవి కొనుగోలు చేసే వ్య‌క్తులు చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ముందుగా ప‌రిశీలించాల్సి ఉంటుంది.